సీఎం భార్య దత్తత గ్రామానికే నిధులన్నీ?
మిగతా పల్లెల గతేమిటి?
సర్కారుపై ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆగ్రహం
పామర్రు :
స్మార్ట్ విలేజ్ అభివృద్ధి అంటూ ఒక్క గ్రామానికే రూ. 7 కోట్ల ప్రభుత్వ నిధుల్ని కట్టబెట్టడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని అసెంబ్లీలో వెఎస్సార్ సీపీ డిప్యూటీ ప్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ మండల పరిధిలోని కొమరవోలు గ్రామాన్ని సీఎం సతీమణి నారా భువనేశ్వరీ దత్తత తీసుకోగా, ఇప్పటివరకూ గ్రామానికి ఆర్డీఎఫ్ నిధులు రూ.7కోట్లు మంజూరు చేయటం జరిగిందన్నారు. సీఎం సతీమణి దత్తత తీసుకున్నారని అంత భారీమొత్తంలో ప్రజల సొమ్మును ఒక్క గ్రామానికే ఇవ్వడం విడ్డూరంగా ఉన్నదన్నారు. నియోజకవర్గంలో అనేక గ్రామాలకు సరైన రహదారులు లేక బరద రోడ్లతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన గ్రామాల పరిస్థితి ఏమిటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రభుత్వం స్థానికంగా గెలిచిన ప్రజా ప్రతినిధులను ఉత్సవిగ్రహాలుగా మార్చి, ఓడిపోయినవారికి, పరిపాలనలో భాగస్వామ్యంలేని వారికి పెద్దపీట వేయడం ఏమిటని ప్రశ్నించారు. కావాలంటే సొంత డబ్బును ఖర్చు పెట్టుకోవాలని సూచించారు. దీనిపై రాబోయే అసెంబ్లీ సమావేశాలలో గట్టిగా నిలదీస్తామన్నారు. దాసు గంగాధరరావు, ఆరుమళ్ల శ్రీనా«ద్రెడ్డి, ఎన్సాంబిరెడ్డి పాల్గొన్నారు.