ఎన్నికల్లోనే మేము గుర్తుకొస్తామా?
నక్కారామేశ్వరం(అల్లవరం), న్యూస్‌లైన్ :ఎన్నికల సమయంలోనే రాజకీయ నాయకులు, అధికారులు మా గ్రామం వస్తారు తప్ప మిగిలినకాలంలో మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడని అటువంటప్పడు మేమెందుకు ఓట్లు వేయాలంటూ అల్లవరం మండలం నక్కారామేశ్వరం గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. ఎన్నికల సమయంలోనే నేతలకు తాము గుర్తుకువస్తున్నామని ఓట్లు వేశాక తమను పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతూ పార్టీలకు అతీతంగా గ్రామస్తులు నిర్ణయించుకుని బుధవారం ఎన్నికలను బహిష్కరించారు. కొమరగిరిపట్నం పంచాయతీ పరిధిలోని తీర ప్రాంతంలో ఓ దీవిలా దూరంగా విసిరివేసినట్టుంటుంది మత్స్యకార గ్రామం నక్కారామేశ్వరం.
అక్కడ సుమారు రెండు వేల ఐదువందలకుపైగా జనాభా నివాసముంటున్నారు. ఈ శివారు గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పన, రహదారుల అభివృద్ధి అంతంత మాత్రంగానే జరిగింది. గ్రామంలో ఉన్న 1100 వందల ఓటర్లలో మూడువందల మంది ఓటర్లు ఆరు కిలోమీటర్ల దూరంలోని ఎస్. పల్లెపాలెం గ్రామంలోనూ, మరో రెండొందల మంది ఓటర్లు మూడుకిలోమీటర్ల దూరంలోని కొమరగిరిపట్నంలోని మిలటరీ కాలనీ పోలింగ్ బూత్‌లలో ఓటు వేస్తున్నారు. మిగిలినవారు మాత్రమే గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్‌లో ఓట్లు వేస్తున్నారు. అయితే బుధవారం ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేసిన తరువాత గ్రామస్తులంతా ఏకమై పార్టీలకు అతీతంగా ఎన్నికలను బహిష్కరిద్దామని నిర్ణయించుకున్నారు. తాగేందుకు మంచినీరు నాలుగు రోజులకోసారి ఇస్తున్నారని, గ్రామంలో రహదారులు నిర్మించలేదని, గ్రామస్తులం అంతా గ్రామంలోనే ఓటు వేసుకునే సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ అవి నెరవేరుస్తామని అధికారులు హామీ ఇచ్చిన తరువాతే ఓట్లు వేస్తామంటూ బీష్మించారు.
తమ సమస్యలపై అనేకసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. సీఐ ఎన్.అంజనీ, తహశీల్దార్ జి. మమ్మీ, ఎంపీడీఓ ఉషారాణిలు అక్కడకు చేరుకుని గ్రామస్తులతో చర్చించారు. మేమెదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే ఓట్లు వేస్తామని లేకుంటే బహిష్కరిస్తామంటూ గ్రామస్తులు స్పష్టం చేశారు. ఇది ఎన్నికల సమయం కాబట్టి ఏవిధమైన హామీలు ఇవ్వకూడదని మీ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా పనిచేస్తామని అధికారులు వారికి నచ్చజెప్పారు. ఓటు వేయడం మానవద్దని అది మీహక్కని, సమస్యల పరిష్కారానికి ఆందోళన చేయడానికి ఇది సమయం కాదని అధికారులు గ్రామస్తులకు నచ్చచెప్పడంతో వారు ఓట్లు వేసేందుకు అంగీకరించి పదకొండున్నర సమయంలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.