వయస్సు 25... చోరీలు 50
కాకినాడ క్రైం :అల్లరిచిల్లరగా తిరుగుతూ.. జల్సాలకు అలవాటు పడ్డ ఆ యువకుడు చోరీల బాటపట్టాడు. సుమారు 25 ఏళ్ల వయస్సు ఉన్న ఆ యువకుడు తన 16వ ఏట నుంచే చోరీలు ప్రారంభించాడు. తొమ్మిదేళ్ల నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 50 చోరీలకు పాల్పడ్డాడు. పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినా... అతడిలో మార్పు రాలేదు. చోరీల బాటే పట్టి.. మరోమారు పోలీసులకు చిక్కాడు. కాకినాడ సెంట్రల్ క్రైం స్టేషన్ సీఐ అల్లు సత్యనారాయణ కథనం ప్రకారం... తాళ్లరేవుకు చెందిన 25 ఏళ్ల వంకా రాజ్‌కుమార్ చిన్నతనం నుంచి అల్లరి చిల్లరగా తిరిగేవాడు. జల్సా జీవితం గడిపేందుకు చోరీల బాటపట్టాడు. సుమారు తొమ్మిదేళ్ల నుంచే పలు ప్రాంతాల్లో చోరీలు చేసేవాడు. పోలీసులకు చిక్కడమే కాకుండా జైలు జీవితాన్ని కూడా అనుభవించాడు. అయినా అతడిలో మార్పు రాలేదు.
జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా చోరీలు చేస్తూ పోలీసులకు సవాలుగా మారాడు. ఇంటి వెనుక భాగంలో గడియ పెట్టి ఉన్న తలుపులను చాకచక్యంగా తీసి ఇంట్లో ప్రవేశించి చోరీలకు పాల్పడడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. నాలుగు నెలలుగా ఇళ్లలో వరుస చోరీలు జరుగుతుండడంపై క్రైం పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగా కాకినాడ నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. అయితే రాజ్‌కుమార్ ఆదివారం సాయంత్రం కాకినాడ దేవాలయం వీధిలోని బంగారం షాపుల వద్ద సంచరిస్తుండడాన్ని పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, నాలుగు చోరీల విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి రూ. ఎనిమిది లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
రాజ్‌కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కాకినాడ రూరల్ తూరంగి రవీంద్రనగర్‌లోని ఇంట్లో, అదే నెలలో కాకినాడ శ్రీరామ్‌నగర్‌లోని మరో ఇంట్లో, ఏప్రిల్‌లో కాకినాడ రామారాావుపేటలోని మరో ఇంట్లో బంగారు ఆభరణాలు, మే నెలలో రామారావుపేటలోని ఒక ఇంట్లో రూ.50 వేల నగదు చోరీ చేశాడు. పాత నిందితుడిని అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన క్రైం సీఐ ఎ.సత్యనారాయణ, ఎస్సై సీహెచ్ ఉమామహేశ్వర రావు, హెచ్‌సీలు గోవిందు, శ్రీను, కానిస్టేబుల్స్ వర్మ, శ్రీరాం, నాయుడు తదితరులను డీఎస్పీ ఆర్. విజయభాస్కర రెడ్డి అభినందించారు.