'దీక్ష ఆరంభం మాత్రమే'
అమలాపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోసం చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను ప్రభుత్వం భగ్నం చేయడం అక్రమమని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. జగన్ దీక్షను భగ్నం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం అమలాపురం పట్టణంలోని హైస్కూల్ సెంటర్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు మానవ హారం నిర్వహించారు.
సీఎం చంద్రబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వరూప్ మాట్లాడుతూ... తమ అధినేత జగన్ ప్రత్యేక హోదా కోసం ఏడు రోజులు దీక్ష చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడటంలో ఇది ఆరంభం మాత్రమేనని, పార్టీ అధిష్టానం పిలుపు మేరకు భవిష్యత్లో మరింతగా ఉద్యమిస్తామన్నారు.