కిక్ కూ ఓ లెక్కుంది..!
♦ ఒలంపిక్ క్రీడల్లో ఒకేఒక్క మార్షల్ ఆర్ట్
♦ ప్రభుత్వ గుర్తింపు పొందిన తైక్వాండో
♦ 150 దేశాల్లో అధికారికంగా పోటీలు
♦ సర్టిఫికెట్ ఉంటే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
సంగారెడ్డి టౌన్: ‘కెయ్...’ అంటూ గాల్లోకి ఎగిరి రెప్పపాటులో కిక్ ఇవ్వడం తైక్వాండో టెక్నిక్. అంతేకాదు ప్రత్యర్థిపై తొడగొట్టి.. పడగొట్టి.. పథకాలు కూడా ఎగరేసుకుపోవచ్చు. మార్షల్‌ఆర్ట్స్‌లో ఒలంపిక్ మెడల్స్ ఏంటా! అని ఆశ్చర్యపోతున్నారా? ఏ సంప్రదాయ యుద్ధకళకు లేని స్థానం తైక్వాండోకు దక్కింది. అందుకే ఒలంపిక్ క్రీడగా 150 దేశాల్లో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. సర్టిఫికెట్ ఉంటే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా పొందొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఈ కళ గ్రామీణులకు పెద్దగా చేరువ కాకపోవడం కొంత నిరాశ కలిగించే విషయం.
ఐటీఎఫ్ ఏర్పడి అర్ధశతాబ్దం
ఇంటర్నేషనల్ తైక్వాండో ఫెడరేషన్(ఐటీఎఫ్) ఏర్పడి అర్ధశతాబ్దం అవుతోంది. యుద్ధకళకు క్రీడా హోదా సాధించడంలో ఐటీఎఫ్ పాత్ర మరువ లేనిది. ఆస్ట్రేలియాలోని వియాన్నా ప్రధాన కార్యాలయంగా 1966 మార్చి 22న చోయ్ హాంగ్ హి(ఛిజిౌజీ ఏౌజ ఏజీ) ఆధ్వర్యంలో ఐటీఎఫ్ ప్రారంభమైంది.
ఫెడరేషన్ విధులు
ప్రపంచ వ్యాప్తంగా జరిగే టోర్నమెంట్లు, శిక్షణ, సెమినార్లకు అనుమతి ఇవ్వడం, గుర్తింపున్న ఫెడరేషన్ల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడం, అభ్యర్థులకు ర్యాంకులు, ధ్రువపత్రాలు అందించడం. తైక్వాండోకు అంతర్జాతీయ క్రీడాస్థాయిని ఇవ్వడంలో, ఒలంపిక్ గేమ్‌గా తీసుకురావడంలో ఐటీఎఫ్ కృషి అమోఘం. కాబట్టే దాదాపు 150 దేశాల్లో నేడు తైక్వాండో వెలుగుతోంది. సంస్థ 50 వసంతాలు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని కరోలిన్ స్ప్రింగ్, విక్టోరియాలో జాతీయ పోటీలు ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా కజకిస్తాన్ టైక్వాండో ఫెడరేషన్ ఆధ్వర్యంలో మార్చి 26వ తేదీ నుంచి 30 వరకు అల్మటీ, ఖజకిస్తాన్‌లో 8వ ఏషియన్ పోటీలు జరుగుతున్నాయి.
ప్రపంచ క్రీడగా అవతరణ
యుద్ధకళా నైపుణ్యమే కాకుండా అంతకు మించి మానసిక శక్తిని పెంపొందించి, జీవన విధానాన్ని, క్రమ శిక్షణను బోధించే ఆర్ట్‌గా తైక్వాండో ప్రసిద్ధి చెందింది. ‘తై’ అంటే ఫుట్(కాలు), ‘క్వాన్’ అంటే ఫిస్ట్(పిడికిలి), ‘డూ’ అంటే వే(క్రమశిక్షణ) ఈ మూడు భాగాల కలయికే ‘తైక్వాండో’. కాళ్లు, చేతుల కదలికలతో మొత్తం శరీరాన్ని, మనస్సును అదుపులో ఉంచుకోవడమే ఈ క్రీడ ప్రత్యేకత.
కొరియన్ యుద్ధకళ
కొరియాలో ఆయుధాలతో, అవి లేకుండా పోరాడే యుద్ధకళగా సుబాకు(టెక్కియాన్) ప్రాచుర్యం పొందింది. కీ.శ.1392-1910 వరకు కొరియాను పరిపాలించిన చొసున్ రాజ్యంలో సుబాకుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కళతో పాటు జీవన విధానాన్ని బోధించేవారు. ముఖ్యంగా మిలటరీ వ్యక్తులకు ఈ కళలో తర్ఫీదు ఇచ్చేవారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం జపాన్ కొలోనల్ పరిపాలన నుంచి కొరియా స్వాతంత్య్రం పొందింది. మొదటి అధ్యక్షుడు సింగమ్రీ ఆధ్వర్యంలో ఈ విద్య కళలకు పునరుజ్జీవం పోశారు. దీంతో టెక్కియాన్ మార్షల్ఆర్ట్ తైక్వాండ్గా రూపాంతరం చెందింది. 1950-1953 మధ్య తైక్వాండో పూర్తిస్థాయిలో వెలుగులోకి వచ్చింది. 1971లో కొరియా జాతీయ క్రీడాగా గు ర్తింపు పొందింది. 1972లో కొరియా అధ్యక్షుడు కుక్కివాన్ తైక్వాండోకు సంబంధించి జాతీయస్థాయిలో కార్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు పోటీలకు అనుమతిని చ్చాడు. 1966 మార్చి 22న ఇంటర్నేషనల్ తైక్వాండో ఫెడరేషన్(ఐటీఎఫ్)ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1973లో వల్డ్ తైక్వాండో ఫెడరేషన్(డబ్ల్యూటీఓ)ఏర్పాటైంది. అదే సంవత్సరం నుంచి ప్రపంచ తైక్వాండో పోటీలు ప్రారంభమైంది.
ఒలంపిక్ ఆట
అతి తక్కువ కాలంలోనే ఆసియా దేశాల్లో తైక్వాండో ప్రజాదరణ పొందింది. 1975లో అమెరికాకు చెందిన అమెచూర్ అథ్లెట్ యూనియన్‌లో సభ్యత్వం, 1976లో అంతర్జాతీయ మిలటరీ క్రీడలలో భాగస్వామ్యమైంది. 1984లో ఆసియా క్రీడల్లో అధికారిక క్రీడగా గుర్తింపు లభించింది. 1980లో ఇంటర్నేషన్ ఒలంపిక్ కౌన్సిల్(ఐఓసీ) స్పోర్ట్ ఫెడరేషన్ డబ్ల్యూటీఓను గుర్తించింది. ఐఓసీ గుర్తుంపు లభించిన తర్వాత 1981లో వల్డ్ గేమ్స్‌లో అధికారిక క్రీడగా అడుగుపెట్టింది. 1986లో పాన్ అమెరికా క్రీడల్లో స్థానం సంపాదించింది. ఆసియా ఖండం నుంచి ఒకేఒక్క మార్షల్ ఆర్ట్ క్రీడగా సిడ్నిలో 2000లో జరిగిన ఒలంపిక్ క్రీడలలో పాల్గొంది. 2010లో కామన్వెల్త్ క్రీడల్లో గుర్తింపు లభించింది.
నైపుణ్యానికి గ్రేడింగ్
06 సంవత్సరాల వయస్సు నుంచి 60 సంవత్సరాల వారు తైక్వాండోను నేర్చుకోవచ్చు. ప్రాథమిక శిక్షణ తర్వాత నైపుణ్యాలను పెంచుతూ గ్రేడింగులు(బెల్టులతో) ఇస్తారు. వైట్ బెల్టుతో మొదలై ఎల్లో, గ్రీన్, గ్రీన్ 1, బ్లూ, బ్లూ 1, రెడ్, రెడ్ 1 తర్వాత బ్లాక్‌బెల్ట్ ఇస్తారు. ఒక్కో బెల్టుకు కనీసం నాలుగు నెలల శిక్షణ ఉంటుంది. బ్లాక్‌బెల్ట్ సాధించాలంటే దాదాపు మూడు సంవత్సరాల సమయం పడుతుంది. రెడ్ 1 బెల్డ్ సాధిస్తే మాస్టర్‌గా గుర్తింపు లభిస్తుంది.
భిన్నమైన పోటీలు
తొంబై శాతం స్టాండింగ్, ఫ్లయింగ్ కిక్‌లు, పది శాతం చేతి కదలికలతో ఉండే తైక్వాండో.. పో టీల్లో మాత్రం కిక్‌లు మాత్రమే ఉపయోగిం చాలి. పంచ్‌లకు స్థానం లేదు. నడుముకు కట్టుకునే బెల్టు నుంచి తల వరకు స్పారింగ్లో కిక్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. బెల్టు కింద కిక్‌లు తగిలితే పరిగణనలోకి తీసుకోరు. నిబంధనలకు అనుగుణంగా వేగంగా, సరైన పద్ధతిలో ఉపయోగించిన కిక్‌లకు మాత్రమే పాయింట్స్ ఉంటాయి.
ఐదుగురు జడ్జిలు
పోటీల్లో నలుగురు రెఫరీలు, ఒక జడ్జి ఉంటారు. బౌట్ నాలుగు వైపులా నలుగురు రెఫరీలు ఉంటారు. జడ్జి బౌట్‌ను పర్యవేక్షిస్తుంటాడు. మూడు నిమిషాల సమయం ఇచ్చి గేమ్ స్టార్ట్ చేస్తారు. నలుగురు రెఫరీలు నాగులు కోణాల్లో అభ్యర్థులను గమనిస్తారు. మూడు నిమిషాల అనంతరం రెఫరీలు రహస్యంగా చీటీపై రాసి జడ్జికి ఇస్తారు. ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తే వారు విజైతలవుతారు. నాక్ఔట్ అయితే అంతటితో ఆగిపోతుంది.
గార్డ్స్ ముఖ్యం
ఇతర క్రీడలకు భిన్నంగా రక్షణకు వివిధ రకాల గార్డ్స్ ఉపయోగిస్తారు. తలకు రక్షణ కోసం గార్డ్, చెస్ట్, గ్లాయిన్స్, ఎల్బో గార్డులను ఉపయోగిస్తారు. లేకుంటే వేగంగా కిక్‌లు తగిలితే చాలా ప్రమాదం.