గురి చెదిరింది.. కాంస్యం చేజారింది
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. ఒలింపిక్స్ ఆర్చరీలో సెమీఫైనల్‌కు చేరిన భారత మిక్స్డ్ జట్టు.. పతకం పట్టే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్–అంకిత భకత్ జోడీ.. ‘ప్యారిస్’ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో దక్షిణ కొరియా జోడీ చేతిలో ఓడిన ధీరజ్–అంకిత జంట... కాంస్య పతక పోరులో అమెరికా ద్వయం చేతిలో ఓడి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. 36 ఏళ్ల ఒలింపిక్స్ ఆర్చరీ చరిత్రలో తొలిసారివిశ్వక్రీడల్లో భారత ఆర్చర్లకు మరోసారి నిరాశ తప్పలేదు. 36 ఏళ్ల ఒలింపిక్స్ ఆర్చరీ చరిత్రలో తొలిసారి సెమీఫైనల్‌కు చేరి పతక ఆశలు రేపిన మన మిక్స్డ్ ఆర్చరీ జట్టు చివరకు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఒలింపిక్స్ చరిత్రలో మన ఆర్చర్లకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం.శుక్రవారం రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో బొమ్మదేవర ధీరజ్–అంకిత భకత్ ద్వయం 2–6తో (37–38, 35–37, 38–34, 35–37) బ్రాడీ ఎలీసన్–క్యాసీ కౌఫ్‌హోల్డ్ (అమెరికా) జంట చేతిలో ఓడింది. ధీరజ్ గురి అంచనాలకు తగ్గట్లు సాగినా... ఒత్తిడికి గురైన అంకిత పలుమార్లు గురి తప్పడం ఫలితంపై ప్రభావం చూపింది. నాలుగు సెట్లలో కలిపి అంకిత రెండుసార్లు 7 పాయింట్లు సాధించడంతో జట్టు విజయావకాశాలను ప్రభావితం చేసింది. తొలి సెట్లో అంకిత 7 ,10 పాయింట్లు సాధించగా.. ధీరజ్ రెండు 10లు నమోదు చేశాడు. ప్రత్యర్థి ఆర్చర్లు 10, 9, 9, 10 పాయింట్లు సాధించి ముందంజ వేయగా.. రెండో సెట్‌ను కూడా అంకిత 7 పాయింట్లతో ప్రారంభించింది. చేజారిన కాంస్యంఈసారి కూడా ప్రత్యర్థిదే పైచేయి కాగా.. మూడో సెట్లో అంకిత 10, 9, ధీరజ్ 9, 10 పాయింట్లు గురిపెట్టారు. ప్రత్యర్థి జంట 10, 7, 9, 8 పాయింట్లు చేసి వెనుకబడింది. ఇక నాలుగో సెట్లో అంకిత రెండు బాణాలకు ఎనిమిదేసి పాయింట్లే రాగా.. ధీరజ్ 9, 10 పాయింట్లు గురిపెట్టాడు. అయితే వరుసగా 10, 9, 9, 9 పాయింట్లు సాధించిన అమెరికా జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది.దక్షిణ కొరియా, జర్మనీ జోడీలకు స్వర్ణ, రజత పతకాలు లభించాయి. అంతకుముందు సెమీఫైనల్లో ధీరజ్–అంకిత జోడీ 2–6తో (38–36, 35–38, 37–38, 38–39) ప్రపంచ నంబర్‌వన్ కిమ్ వూజిన్–లిమ్ షిహ్యోన్ (కొరియా) జంట చేతిలో ఓడింది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో భారత్ 5–3తో (38–37, 38–38, 36–37, 37–36) స్పెయిన్‌పై, తొలి రౌండ్లో 5–1తో (37–36, 38–38, 38–37) ఇండోనేసియాపై గెలిచింది. మహిళల వ్యక్తిగత విభాగంలో దీపికా కుమారి, భజన్ కౌర్ ఈరోజు బరిలోకి దిగనున్నారు. బల్‌రాజ్‌కు 23వ స్థానం పారిస్ ఒలింపిక్స్‌లో భారత రోవర్ బల్రాజ్ పన్వర్ 23వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్ రౌండ్ ‘డి’ ఫైనల్లో శుక్రవారం బల్రాజ్ 7 నిమిషాల 2.37 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. అంతకుముందు రెపిచాజ్ రౌండ్లో రెండో స్థానంలో నిలిచి క్వార్టర్స్‌కు చేరిన బల్రాజ్... అక్కడ ఐదో స్థానానికి పరిమితమవడంతో ఫైనల్‌కు దూరమయ్యాడు. ఫైనల్ ‘ఎ’లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభిస్తాయి.