ఎరువుల యాజమాన్యం ఎలా?
ప్రశ్న: అన్నపూర్ణ పంటల నమూనా పూర్తిగా ప్రకతి వ్యవసాయ పద్ధతిలో సాగుతుంది కదా.. ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా కేవలం సహజ సాగు విధానాల ద్వారానే పంటల దిగుబడి పెంచడం సాధ్యమేనా?
జవాబు: చాలా మంది రైతులు ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. అడగకపోయినా ఇతర రైతుల మనసుల్లోనూ ఇలాంటి సందేహాలు ఉంటాయనేది నిజమే. జనాభా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పంటల దిగుబడి కూడా అద్వితీయంగా పెరగవలసి ఉంది. మట్టి పరుపుల్లో అంతర పంటలు, మిశ్రమ పంటలు, ఎరపంటలు, సరిహద్దు పంటల సాగు ద్వారా శత్రు కీటకాలను సహజ సిద్ధంగానే అదుపులో ఉంచుతున్నాం. అంతేకాకుండా.. పప్పు ధాన్యాలు, పంట మార్పిడి విధానం ద్వారా పంటలకు అవసరమైన పోషకాలను అందించడం, తెగుళ్ల కారక జీవుల వ్యాప్తిని అరికట్టడం సాధ్యమవుతున్నది.
అంతేకాదు.. సహజ పద్ధతులతో భూసారాన్ని పెంచుకోవచ్చు. అన్నపూర్ణ పద్ధతిలో పొలం చుట్టూ తవ్విన కందకాలు, మట్టి పరుపుల మధ్యలో తవ్విన కాలువలను ఎరువుల గుంతలుగా వినియోగించుకుంటున్నాం. పంటల్లో తీసిన కలుపు మొక్కలను, పంట పండిన తరువాత వచ్చే రొట్టను ఈ కాలువల్లో వేసి మట్టి కప్పుతాం. కనీసం రెండు నెలల్లో అది సహజ ఎరువుగా తయారవుతుంది. మట్టి పరుపు మీద పంట తీసిన తరువాత ఈ కాలువల్లో కుళ్లిన ఎరువును మట్టి పరుపు మీద వేస్తాం.
దీని వల్ల.. నేల గత పంట కాలంలో కోల్పోయిన సారాన్ని తిరిగి గ్రహిస్తుంది. నేలను మరింత సారవంతం చేసుకునేందుకు పేడ గెత్తం (పశువుల ఎరువు)/ పేడ, మూత్రం కలిపి తయారు చేసిన ద్రావణాన్ని ఉపయోగించుకుంటూ నిస్సందేహంగా మంచి దిగుబడుల ను సాధించవచ్చు.
- డి.పారినాయుడు (94401 64289),
జట్టు సంస్థ వ్యవస్థాపకులు, అన్నపూర్ణ పంటల నమూనా రూపశిల్పి
గమనిక: ‘అన్నపూర్ణ-అక్షయపాత్ర’ సిరీస్లో గతంలో ప్రచురించిన కథనాల కోసం saagubadi.blogspot.in ను చూడొచ్చు.