విజయవాడలో ‘ఆక్వా ఆక్వేరియా ఇండియా షో’
సాక్షి, విజయవాడ బ్యూరో: దేశ, విదేశాలకు చెందిన ఆక్వా కల్చర్ రైతులు, శాస్త్రవేత్తలు, పంపిణీదారులు, ఆక్వేరియం నిర్వాహకులందరూ ఒకేచోట చేరి ఆక్వా రంగం లో నూతన ఆవిష్కరణలపై చర్చించుకునేందుకు విజయవాడ వేదిక కానుంది. భారత ప్రభుత్వ వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వశాఖలోని సముద్ర ఉత్పత్తులు, ఎగుమతుల అభివృద్ధి సంస్థ(ఎంపెడా) ఆధ్వర్యంలో మెగా ‘ఆక్వా ఆక్వేరియా ఇండియా షో’ శుక్రవారం నుంచి మూడు రోజులపాటు విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాల మైదానంలో కొనసాగనుంది.
ఈ ప్రదర్శనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ప్రారంభించనున్నారు. ఎంపెడా చైర్మన్, సీనియర్ ఐఏఎస్ అధికారిణి లీనానాయర్ గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో ఆక్వాకల్చర్, అలంకరణ చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రెండేళ్లకోసారి ‘ఆక్వా ఆక్వేరియా ఇండియా ప్రదర్శన’ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.