ట్రాన్స్‌కో x మున్సిపాలిటీ
* సంగారెడ్డిలో ముదిరిన వివాదం
* బకాయి చెల్లించలేదని మున్సిపాలిటీకి కరెంటు కట్
* ట్రాన్స్‌కో పన్నుల బకాయిపై లెక్కతీస్తున్న మున్సిపాలిటీ
సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డిలో ట్రాన్స్ కో, మున్సిపాల్టీల మధ్య వార్ నడుస్తోంది. మున్సిపాలిటీ బకాయిలు పెరిగిపోయాయని ట్రాన్స్‌కో అధికారులు కార్యాలయానికి కరెంటు సరఫరాను నిలిపివేశారు. దీంతో మున్సిపాలిటీ అధికారులు అసలు ట్రాన్స్‌కో ఆస్తి బకాయి ఎంత ఉందో లెక్కలు తీసే పనిలో ఉన్నారు.
ఎవరి లెక్కలు వారివి
మున్సిపాల్టీ ట్రాన్స్‌కోకు రూ.5.65 లక్షల బకాయిగా ఉండడంతో వారం రోజుల క్రితం ట్రాన్స్‌కో అధికారులు సరఫరాను నిలిపివేశారు. దీంతో వారం రోజులుగా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. జనన, మరణ ధువపత్రాలతో పాటు ప్రభుత్వం కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులు ఏకంగా మున్సిపల్ పాలక వర్గ సమావేశం నిర్వహించి ట్రాన్స్‌కో ఆస్తి పన్ను బకాయిపై లెక్క తీయాలని తీర్మాణం చేశారు.
ఆమేరకు మున్సిపాలిటీ అధికారులు ట్రాన్స్‌కో కార్యాలయం భవనంతో పాటు అతిథిగృహం, పట్టణంలో ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు, ఎన్ని విద్యుత్ స్తంభాలు మున్సిపల్ స్థలంలో ఉన్నాయన్న దానిపై మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ గయాసోద్దీన్ సిబ్బందితో కలిసి లెక్కలు వేస్తున్నారు. ట్రాన్స్ కో ఎస్ఈ కార్యాలయంతో పాటు డీఈ , ట్రాన్స్‌కో సమావేశ మందిరానికి సంబంధించి ఇంతవరకు ఆస్తి పన్ను చెల్లించలేదని తేలినట్లు తెలిసింది. కొత్తగా నిర్మించిన మూడు భవనాలకు సైతం మున్సిపాల్టీ నుంచి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. మొత్తంగా ట్రాన్స్‌కో మున్సిపాలిటీకి దాదాపు 9.కోట్ల మేర బకాయిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ట్రాన్స్‌కోకు నోటీసులు పంపేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు.
రూ.3 లక్షలు చెల్లిస్తామన్నా వినలేదు
ట్రాన్స్‌కోకు మున్సిపాలిటీ బకాయి ఉన్న మాట వాస్తవమే. అందువల్లే బిల్లులతో సంబంధం లేకుండా ప్రతినెలా ట్రాన్స్‌కోకు రూ. 3 లక్షలు చెల్లిస్తామన్నా ట్రాన్స్‌కో అధికారులు ఒప్పుకోలేదు. వాస్తవానికి ట్రాన్స్‌కో రూ.5.65 లక్షల బకాయిగా చూపిస్తున్నప్పటికీ, మున్సిపాలిటీ మాత్రం రూ.3 కోట్లు మాత్రమే బకాయిగా ఉంది. ఈ బకాయి అంశంపై ప్రభుత్వానికి లేఖ రాసి తగు చర్యలు తీసుకుంటాం.
-గయాసోద్దీన్, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్, సంగారెడ్డి