విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు
భివండీ, న్యూస్‌లైన్: స్వాభిమాన్ సేవా సంస్థ, దామన్‌కర్ నాకా మిత్రమండలి సంయుక్తంగా బుధవారం ప్రేమాతాయి హాలులో విద్యార్థులకు చిత్రకళ పోటీలు నిర్వహించాయి. ఉదయం నుంచి రాత్రి వరకు నిర్వహించిన ఈ పోటీల్లో పట్టణంలోని దాదాపు అన్ని పాఠశాలలకు చెందిన 2-10 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. భ్రూణహత్యలు, బాలికల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై పెయింటింగ్‌లు గీయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోవా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రమోద్ పాటిల్, భివండీ బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు హర్షల్ పాటిల్, కార్పొరేటర్లు సంతోష్ శెట్టి, శశిలతా శెట్టి, ఠాణా జిల్లా కళాధ్యావన్ సంఘ్ అధ్యక్షుడు సుధాకర్ బోర్సే, తెలుగు సమాజ్ శిక్షణ సంస్థ చైర్మన్ డాక్టర్ పాము మనోహర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రమోద్ పాటిల్ మాట్లాడుతూ.. ఇటువంటి పోటీలు విద్యార్థులకు స్ఫూర్తినిస్తాయన్నారు. గెలుపొందిన విద్యార్థులకు ల్యాప్‌టాప్, సైకిల్, ఐప్యాడ్, కేసినో తదితర బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతిని స్కాలర్ స్కూల్‌కు చెందిన విజేత అర్థవ్ గోదేకర్ దక్కించుకోగా, ద్వితీయ విజేతగా హర్షిత్ బిహాని నిలిచాడు. తృతీయ బహుమతి కె.ఎం.ఈ.ఎస్. స్కూల్‌కు చెందిన మోమిన్ జన్నత్ అందుకున్నాడు. రెండోబృందం విద్యార్థుల్లో మొదటి బహుమతిని నవభారత్ స్కూల్‌కు చెందిన దియా అంబేద్కర్, ద్వితీయ బహుమతిని స్కాలర్ స్కూల్ విద్యార్థిని హరదీ జఖారియా గెలుచుకుంది.
మూడోస్థానంలో స్కాలర్ స్కూల్‌కు చెందిన స్నేహా మ్యాకల్ నిలిచింది. మూడో బృందం విద్యార్థుల్లో ప్రథమ బహుమతి అల్నూర్ స్కూల్ విద్యార్థి అన్సారీ అరబియాకి దక్కింది. రెండో బహుమతి హోలీమేరీ స్కూల్‌కు చెందిన గోస్ అంకుర్, మూడో బహుమతిని నవభారత్ స్కూల్ విద్యార్థి జైన్ కషిశ్ అందుకున్నారు. నాలుగోబృందం విద్యార్థుల్లో ఎస్.ఎ.ఎం. స్కూల్‌కు చెందిన షేక్ సబీనా తొలి స్థానంలో, రైస్ స్కూల్‌కు చెందిన మోమిన్ తోఫిక్ ద్వితీయ స్థానంలో నిలిచారు. తృతీయ బహుమతిని హోలీమేరీ స్కూల్ విద్యార్థిని శ్రేయ గెలుచుకుంది.