ఆరోగ్య బీమాలోకి టాటా ఏఐఏ లైఫ్ రీఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా రంగంలో ఉన్న టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆరోగ్య బీమా పాలసీలను తిరిగి ప్రవేశ పెట్టనుంది. ఐఆర్డీఏ నుంచి ఈ ఏడాదే అనుమతి లభించే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. అనుమతి రాగానే పలు ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తామని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సౌమ్యజిత్ పట్నాయక్ తెలిపారు.
అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అరుణవ ఖాన్‌తో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చి నాటికి ఇతర విభాగాల్లో 7 కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తామన్నారు. ‘2014-15లో కొత్త పాలసీల ద్వారా రూ.312 కోట్ల వ్యాపారం నమోదు చేశాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు నాటికే ఇది రూ.226 కోట్లను దాటింది. ఆన్లైన్లో విక్రయమవుతున్న పాలసీల వాటా 6.25 శాతముంది’ అని వివరించారు.
లైఫ్ ప్లానర్లతో..
నెట్వర్కింగ్, కమ్యూనికేషన్స్ నైపుణ్యం ఆర్థిక విషయాలపట్ల లోతైన అవగాహన కలిగిన ఏజెంట్లను కంపెనీ నియమిస్తోంది. వీరిని లైఫ్ ప్లానర్లుగా అభివర్ణిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కంపెనీకి 1,000కిపైగా లైఫ్ ప్లానర్లతోపాటు 33,600 మంది ఏజెంట్లున్నారు. లైఫ్ ప్లానర్ల సంఖ్యను మరింత పెంచుతున్నామని, నియామకాల్లో ప్రైవేటు బీమా కంపెనీల్లో టాప్-5లో నిలిచామని సౌమ్యజిత్ వెల్లడించారు.
పాలసీదారుల అనుభవం ఆధారంగా పరిష్కారాలను అంది స్తున్నట్టు చెప్పారు. కాగా, పాలసీల గురించి తెలుసుకోవడానికి 92% మంది ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్నారు. అయితే ఆన్లైన్లో పాలసీలు తీసుకునే వారి సంఖ్య 5-6%కే పరిమితమైంది. ఈ సంఖ్య ఇప్పుడు పెరుగుతోందని కంపెనీ చెబుతోంది.