‘లాల్బాగ్ చా రాజా’కు కాసుల వర్షం
సాక్షి, ముంబై: ‘లాల్బాగ్ చా రాజా’ కు కాసుల వర్షం కురిసింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా భక్తులు భారీ సంఖ్యలో కానుకలు సమర్పించారు. నగదు రూపంలో రూ.6.77 కోట్లు వచ్చాయని లాల్బాగ్ చా రాజా మండలి అధ్యక్షుడు అశోక్ పవార్ చెప్పారు. వెండి, బంగారు కానుకలు భారీగానే వచ్చాయని తెలిపారు. వీటిని ప్రతిరోజూ సాయంత్రం ఐదు నుంచి రాత్రి 10 గంటల వరకు రాజా మండపం ఆవరణలో బహిరంగంగా వేలం వేస్తున్నామని వివరించారు. ఈ వేలం నిర్వహణ శుక్రవారం వరకు ఉంటుందని తెలిపారు. ‘వినాయక చవితి ఉత్సవాల సమయంలో భక్తులకు కొంగుబంగారంగా నిలిచిన రాజాను దర్శించుకోవాలంటే కనీసం 20 నుంచి 25 గంటల సమయం తీసుకుంటుంది. ఇందుకోసం ఎంతో ఓపిగ్గా క్యూలో నిలబడాల్సి ఉంటుంది.
అయినా ఎంతో భక్తిశ్రద్ధలతో 10 రోజుల పాటు రాజాను లక్షల్లో వచ్చిన జనం దర్శించుకున్నార’ని ఆయన చెప్పారు. రాజాను గత బుధవారం ఉదయం నిమజ్జనానికి తరలించినప్పటికీ అంతకుముందు రోజు నుంచే నగదు లెక్కింపు ప్రారంభించామన్నారు. లాల్బాగ్ చా రాజా మండలి ఆవరణలో ఏర్పాటుచేసిన ఆరు హుండీల్లో పోగైన నగదును బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు చెందిన 20 మంది సిబ్బంది ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లెక్కించారని పేర్కొన్నారు. రూ.6.77 కోట్లు నగదు వచ్చినట్టు తేలిందన్నారు.
ఇందులో దేశ కరెన్సీతో పాటు విదేశీ డాలర్లు కూడా ఉన్నాయని చెప్నారు. ‘వస్తురూపంలో చెల్లించుకున్న కానుకల్లో బంగారు, వెండి ఆభరణాలు, బిస్కెట్లు, గణేశ్ విగ్రహాలు, మూషికాలు, ఉంగరాలు, కిరీటాలు, రుద్రాక్ష మాలలు, బంగారు గొలుసులు, బ్రాస్లెట్లు, మోదక్‌లు, త్రిశూలాలు, వజ్రాలతో కూడిన వాచీలు తదితర వస్తువులు ఉన్నాయి. ఇందులో దాదాపు 11 కేజీల బంగారు, 200 కేజీల వెండి వస్తువులు ఉన్నాయ’ని పవార్ వెల్లడించారు.