టెలికంలో 30 లక్షల ఉద్యోగాలు!!
అసోచాం – కేపీఎంజీ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: టెల్కోల మధ్య తీవ్ర పోటీతో టెలికం రంగం ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పటికీ వచ్చే ఏడాది నాటికి గణనీయంగా ఉపాధి అవకాశాలు కల్పించనుంది. 2018 నాటికి 30 లక్షల ఉద్యోగాలు టెలికం రంగం కల్పించగలదని అసోచాం, కేపీఎంజీ ఒక సంయుక్త అధ్యయనంలో అంచనా వేశాయి. 4జీ టెక్నాలజీ విస్తృతి చెందడం, డేటా వినియోగం పెరుగుతుండటం, డిజిటల్ వాలెట్లు.. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నట్లు వివరించాయి.
పోటీతో టారిఫ్‌లు పడిపోయి, ఆపరేటర్ల ఆదాయాలు.. లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపుతున్న తరుణంలో అసోచాం–కేపీఎంజీ ఆశావహ నివేదికను రూపొందించడం గమనార్హం. యూజర్‌పై సగటు ఆదాయం తగ్గుతున్నప్పటికీ... టెలికం రంగం మెరుగ్గానే రాణించగలిగే అవకాశాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. పోటీని దీటుగా ఎదుర్కొనేందుకు కంపెనీలు తప్పనిసరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టక తప్పని పరిస్థితి నెలకొందని వివరించింది.
టెలికం రంగంలో ప్రస్తుతమున్న మానవ వనరులు.. సంఖ్యాపరంగాను, నైపుణ్యాలపరంగానూ రాబోయే డిమాండ్‌కు సరిపోకపోవచ్చని నివేదిక తెలిపింది. 2020 నాటికి మొత్తం సిమ్ కనెక్షన్ల సంఖ్య ప్రస్తుతమున్న 110 కోట్ల నుంచి 140 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. అప్పటికల్లా స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) టెలికం రంగ వాటా 8.2 శాతానికి చేరగలదని పేర్కొంది.
ట్రేడింగ్‌లో ఫిన్లెర్న్ అకాడమీ శిక్షణ
ముంబై: ముంబైకి చెందిన ఫిన్లెర్న్ అకాడమీ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్‌కు సంబంధించి అత్యాధునిక శిక్షణను ‘స్మార్ట్ ట్రేడర్’ పేరుతో ఆరంభించింది. లైవ్ మార్కెట్ వాతావరణంలో ట్రేడ్ చేయడం ఎలా అన్నదానిపై, చార్ట్‌లు, సాఫ్ట్వేర్, ఆడియో, వీడియో పాఠాల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ తెలిపింది. ఏడాది కాలవ్యవధి గల కోర్సునకు క్లాస్రూమ్ శిక్షణ అయితే రూ.40,000, ఆన్లైన్లో అయితే రూ.20,000 చార్జ్ చేస్తున్నట్టు తెలిపింది.