ATP Challenger tennis tournament
-
టాటా ఓపెన్ విజేత గ్రీక్స్పూర్
పుణే: భారత్‌లో నిర్వహించే ఏకైక ఏటీపీ టోర్నీ టాటా ఓపెన్ మహారాష్ట్ర (ఏటీపీ 250) శనివారం ముగిసింది. సింగిల్స్‌లో నెదర్లాండ్స్ ఆటగాడు గ్రీక్స్పూర్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో గ్రీక్స్పూర్ 4–6, 7–5, 6–3 స్కోరుతో బెంజమిన్ బోన్జి (ఫ్రాన్స్)ను ఓడించాడు. 2 గంటల 16 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి సెట్‌ను కోల్పోయినా...పట్టుదలతో ఆడిన 26 ఏళ్ల గ్రీక్స్పూర్ తన కెరీర్లో తొలి ఏటీపీ టైటిల్ సొంతం చేసుకోవడం విశేషం. మరో వైపు డబుల్స్‌లో భారత జోడి శ్రీరామ్ బాలాజీ – జీవన్ నెడుంజెళియన్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో సాండర్ గిల్ – జొరాన్ వీగన్ (బెల్జియం) ద్వయం 6–4, 6–4తో శ్రీరామ్–జీవన్‌లపై విజయం సాధించింది. -
మెద్వెదేవ్ మెరిసె...
లండన్: ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ జొకోవిచ్పై... 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన రాఫెల్ నాదల్‌పై తాను సాధించిన విజయాలు గాలివాటమేమీ కాదని రష్యా టెన్నిస్ నయాతార డానిల్ మెద్వెదేవ్ నిరూపించాడు. పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్‌లో 24 ఏళ్ల మెద్వెదేవ్ చాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ మెద్వెదేవ్ 4–6, 7–6 (7/2), 6–4తో ప్రపంచ మూడో ర్యాంకర్, ఈ ఏడాది యూఎస్ ఓపెన్ చాంపియన్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను ఓడించాడు. ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో ‘బెస్ట్ ఆఫ్ త్రీ సెట్స్’ ప్రవేశపెట్టాక సుదీర్ఘంగా సాగిన ఫైనల్ ఇదే కావడం విశేషం. ఈ ఏడాదితో లండన్‌లో ఏటీపీ ఫైనల్స్ టోర్నీకి తెరపడింది. వచ్చే ఏడాది నుంచి ఇటలీలోని ట్యూరిన్‌లో ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ► 2 గంటల 43 నిమిషాలపాటు సాగిన ఈ తుది సమరంలో 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 83 కేజీల బరువున్న మెద్వెదేవ్ 12 ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తొలి సెట్ కోల్పోయి, రెండో సెట్ టైబ్రేక్‌లో 0–2తో వెనుకబడిన మెద్వెదేవ్ వరుసగా ఏడు పాయింట్లు గెలిచి టైబ్రేక్‌ను 7–2తో నెగ్గి రెండో సెట్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో సెట్లో ఐదో గేమ్‌లో థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన మెద్వెదేవ్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 4–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత కూడా తన సర్వీస్‌లను కాపాడుకున్న ఈ రష్యా ప్లేయర్ చివరకు 6–4తో మూడో సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. దాంతో థీమ్ వరుసగా రెండో ఏడాదీ ఈ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ► ఈ టోర్నీలో అజేయంగా నిలిచి టైటిల్ నెగ్గినందుకుగాను మెద్వెదేవ్‌కు 15 లక్షల 64 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 11 కోట్ల 58 లక్షలు)తోపాటు 1500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్‌గా నిలిచిన డొమినిక్ థీమ్‌కు 8 లక్షల 61 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 6 కోట్ల 37 లక్షలు)తోపాటు 800 ర్యాం కింగ్ పాయింట్లు దక్కాయి. ► 50 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో ఏకకాలంలో ప్రపంచ నంబర్‌వన్, నంబర్–2, నంబర్–3 ఆటగాళ్లను ఓడించి విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా మెద్వెదేవ్ గుర్తింపు పొందాడు. ఈ టోర్నీలో మెద్వెదేవ్ లీగ్ దశలో వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)పై, సెమీఫైనల్లో రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై, ఫైనల్లో మూడో ర్యాంకర్ థీమ్‌పై గెలిచాడు. ► నికొలాయ్ డెవిడెంకో (2009) తర్వాత ఏటీపీ ఫైనల్స్ టైటిల్ నెగ్గిన రెండో రష్యా ప్లేయర్ మెద్వెదేవ్. ► ఓవరాల్‌గా అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ఒకే టోర్నీలో ఏకకాలంలో వరల్డ్ నంబర్‌వన్, నంబర్–2, నంబర్–3 ఆటగాళ్లను ఓడించిన నాలుగో ప్లేయర్ మెద్వెదేవ్. గతంలో నల్బందియాన్ (అర్జెంటీనా–2007 మాడ్రిడ్ ఓపెన్‌లో), జొకోవిచ్ (సెర్బియా–2007 మాంట్రియల్ ఓపెన్‌లో), బోరిస్ బెకర్ (జర్మనీ–1994 స్టాక్‌హోమ్ ఓపెన్‌లో) మాత్రమే ఈ ఘనత సాధించారు. ► ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో వరుసగా ఆరో ఏడాది కొత్త చాంపియన్ అవతరించాడు. ఈ టోర్నీలో ఇలా జరగడం ఇది రెండోసారి. మొదటిసారి 1974 నుంచి 1979 వరకు వరుసగా ఆరేళ్లు కొత్త విజేత వచ్చాడు. ఈ విజయం నాకెంతో ప్రత్యేకం. శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉన్నపుడు నేను ఎంత గొప్ప ఫలితాలు సాధించగలనో ఈ టైటిల్ ద్వారా నిరూపితమైంది. ఈ గెలుపు భవిష్యత్‌లో మరిన్ని మేటి విజయాలకు ప్రేరణగా నిలుస్తుందని నమ్ముతున్నాను. –మెద్వెదేవ్ -
ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రజ్నేశ్
న్యూఢిల్లీ: ఒర్లాండో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ శుభారంభం చేశాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రజ్నేశ్ 6–3, 7–5తో సాడ్లో డుంబియా (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 137వ ర్యాంకర్ ప్రజ్నేశ్ మూడు ఏస్‌లు సంధించడంతోపాటు తన ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. ఇదే టోర్నీలో ఆడుతున్న మరో భారత ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. రామ్‌కుమార్ 3–6, 4–6తో నిక్ చాపెల్ (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు. -
రామ్‌కుమార్‌కు చుక్కెదురు
క్యారీ (యూఎస్ఏ): క్యారీ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు రామ్‌కుమార్ రామనాథన్‌కు చుక్కెదురైంది. టోర్నీలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో బరిలో దిగి న అతడు... రెండింటిలోనూ తొలి రౌండ్లోనే ఓడి ఇంటి దారి పట్టాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 6–3, 4–6, 1–6తో తేమురజ్ గబశ్విలి (రష్యా) చేతిలో ఓడాడు. తొలి సెట్‌ను గెల్చుకున్న రామ్‌కు మార్... అనంతరం పేలవ ప్రదర్శనతో రెండు, మూడు సెట్లను ప్రత్యర్థికి అప్పగించాడు. డబుల్స్ లో రెండో సీడ్ రామ్‌కుమార్–ఆండ్రె గొరాన్సెన్ (స్వీడన్) ద్వయం 1–6, 4–6తో హంటర్ రీస్ (అమెరికా)– సెమ్ వెర్బీక్ (నెదర్లాండ్స్) జంట చేతిలో ఓడింది. -
సెమీస్‌లో రామ్‌కుమార్
న్యూఢిల్లీ: ఎకెంటల్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు రామ్‌కుమార్ రామనాథన్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. జర్మనీలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 206వ ర్యాంకర్ రామ్‌కుమార్ 6–2, 6–1తో ప్రపంచ 120వ ర్యాంకర్, నాలుగో సీడ్ ఎవ్‌గెనీ డాన్స్కాయ్ (రష్యా)ను ఓడించాడు. 57 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 11 ఏస్‌లు సంధించడం విశేషం. తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన రామ్‌కుమార్ తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోలేదు. నేడు జరిగే సెమీఫైనల్లో మార్విన్ మోలెర్ (జర్మనీ)తో రామ్‌కుమార్ ఆడతాడు. -
సింగిల్స్ సెమీస్‌లో సాకేత్ మైనేని
వోల్వో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. జెరూసలేంలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 6–4, 6–3తో ఈడన్ లెషమ్ (ఇజ్రాయెల్)పై గెలిచాడు. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ఐదు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఒకసారి చేజార్చుకున్న సాకేత్, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. మరో క్వార్టర్ ఫైనల్లో శశికుమార్ (భారత్) 7–6 (7/2), 6–7 (5/7), 2–6తో ఫిలిప్ పెలివో (కెనడా) చేతిలో ఓడిపోయాడు. -
రన్నరప్ ప్రజ్నేశ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీ టైటిల్ సాధించాలని ఆశించిన భారత నంబర్‌వన్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌కు నిరాశ ఎదురైంది. చైనాలో ఆదివారం ముగిసిన కున్మింగ్ ఓపెన్ టోర్నీలో ప్రజ్నేశ్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో ప్రపంచ 80వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 4–6, 3–6తో ప్రపంచ 211వ ర్యాంకర్ జే క్లార్క్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయాడు. రన్నరప్‌గా నిలిచిన ప్రజ్నేశ్‌కు 12,720 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 లక్షల 83 వేలు)తోపాటు 75 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తాజా ప్రదర్శనతో ప్రజ్నేశ్ తన వ్యక్తిగత ర్యాంకింగ్ ఆధారంగా... జూన్, జూలైలలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగాల్లో నేరుగా మెయిన్ ‘డ్రా’లో అవకాశాన్ని సంపాదించాడు. -
సాకేత్ పరాజయం
సాక్షి, హైదరాబాద్: కున్మింగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు, భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని పోరాటం ముగిసింది. చైనాలోని ఆనింగ్ నగరంలో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో సాకేత్ 2–6, 4–6తో భారత్‌కే చెందిన రెండో సీడ్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ చేతిలో ఓడిపోయాడు. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ఐదు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఒక్కసారి కూడా బ్రేక్ చేయలేకపోయిన సాకేత్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) 6–4, 6–4తో యాన్ బాయ్ (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. -
తొలి రౌండ్లోనే దివిజ్–బోపన్న జంట ఓటమి
గత వారం స్వదేశంలో జరిగిన టాటా ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో టైటిల్ నెగ్గిన దివిజ్ శరణ్–రోహన్ బోపన్న జంటకు రెండో టోర్నమెంట్లో మాత్రం నిరాశ ఎదురైంది. సిడ్నీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో ఈ భారత జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–ఎడువార్డో రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) ద్వయంతో జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–దివిజ్ జంట 2–6, 4–6తో ఓడిపోయింది. 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ రెండు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి రౌండ్లో ఓడినప్పటికీ భారత జంటకు 2,870 డాలర్ల (రూ. 2 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. -
మెయిన్ ‘డ్రా’కు సాకేత్
నింగ్బో (చైనా): యిన్‌జౌ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో సాకేత్ 6–0, 6–3తో రైటా తనుమ (జపాన్)పై గెలుపొందాడు. అంతకుముందు రెండో రౌండ్లో సాకేత్ 6–3, 7–5తో భారత్‌కే చెందిన శశికుమార్ ముకుంద్‌ను ఓడించాడు. ఇదే టోర్నీ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 7–6 (9/7), 6–2తో మొహమ్మద్ సఫ్వాత్ (ఈజిప్ట్)పై నెగ్గి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. ప్రాంజల ర్యాంక్ 340 వరుసగా రెండు వారాల్లో రెండు ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్స్ (లాగోస్ ఓపెన్) సాధించిన హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించింది. సోమవారం విడుదల చేసిన మహిళల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్‌లో ప్రాంజల 109 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 340వ ర్యాంక్‌లో నిలిచింది. అంకిత రైనా 201వ ర్యాంక్‌లో, కర్మన్‌కౌర్ థండి 215వ ర్యాంక్‌లో ఉన్నారు. -
క్వార్టర్స్‌లో బోపన్న జంట
బీజింగ్: చైనా ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–రోజర్ వాసెలిన్ (నెదర్లాండ్స్) ద్వయం శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–వాసెలిన్ జంట 6–2, 7–6 (7/5)తో కైల్ ఎడ్మండ్ (బ్రిటన్)–మార్టన్ ఫక్సోవిక్స్ (హంగేరి) జోడీపై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ లుకాస్ కుబోట్ (పోలాండ్)–మార్సెలో మెలో (బ్రెజిల్) ద్వయంతో బోపన్న జంట తలపడుతుంది. -
పుణే ఓపెన్ విజేత యూకీ
పుణే: భారత్‌లో ఈ సంవత్సరం జరిగిన తొలి ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ పుణే ఓపెన్‌లో భారత స్టార్ యూకీ బాంబ్రీ విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో యూకీ 4–6, 6–3, 6–4తో భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌ను ఓడించాడు. యూకీ కెరీర్లో ఇది ఆరో ఏటీపీ చాలెంజర్ టైటిల్ కాగా ఈ ఏడాది తొలి టైటిల్. రెండు గంటల రెండు నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో రామ్‌కుమార్ 11 ఏస్‌లు సంధించడంతోపాటు 10 డబుల్‌ఫాల్ట్‌లు చేశాడు. తొలి సెట్‌ను కోల్పోయిన యూకీ వెంటనే తేరుకొని రెండో సెట్లో రెండుసార్లు, మూడో సెట్లో ఒకసారి రామ్‌కుమార్ సర్వీస్‌ను బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన యూకీకి 7,200 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 4 లక్షల 68 వేలు)తోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రాంజల, నిధి ఓటమి మరోవైపు మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ముంబై ఓపెన్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయిలు యడ్లపల్లి ప్రాంజల, నిధి చిలుముల క్వాలిఫయింగ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. ప్రాంజల 0–6, 0–6తో అనా బొగ్డాన్ (రొమేనియా) చేతిలో, నిధి 1–6, 3–6తో అనా మోర్గినా (రష్యా) చేతిలో ఓడిపోయారు. -
సాకేత్ జంటకు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఇజ్మీర్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. భారత్‌కే చెందిన తన భాగస్వామి దివిజ్ శరణ్‌తో కలిసి సాకేత్ విజేతగా నిలిచాడు. టర్కీలోని ఇజ్మీర్ పట్టణంలో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ సాకేత్-దివిజ్ శరణ్ ద్వయం 7-6 (7/5), 4-6, 9-8తో ఆధిక్యంలో ఉన్న దశలో నాలుగో సీడ్, ప్రత్యర్థి జంట మాలిక్ జజిరి (టర్కీ)-మొల్చనోవ్ (ఉక్రెయిన్) గాయం కారణంగా వైదొలిగింది. విజేతగా నిలిచిన సాకేత్ జోడీకి 3,950 యూరోల (రూ. 2 లక్షల 92 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సాకేత్ కెరీర్లో ఇది నాలుగో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. గతంలో అతను సనమ్ సింగ్‌తో కలిసి పుణే, ఢిల్లీ, కోల్‌కతాలలో జరిగిన ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లలో డబుల్స్ టైటిల్స్‌ను సాధించాడు. -
‘షాంఘై’ చాంప్ యూకీ
షాంఘై (చైనా) : భారత డేవిస్ కప్ ఆటగాడు యూకీ బాంబ్రీ... షాంఘై ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో యూకీ 3-6, 6-0, 7-6 (7/3)తో వుయ్ ది (చైనా)పై నెగ్గి టైటిల్‌ను గెలుచుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో యూకీ ఆరు ఏస్‌లు సంధించగా, వుయ్ ఒకదానితో సరిపెట్టుకున్నాడు. యూకీ కెరీర్లో ఇది నాలుగో ఏటీపీ చాలెంజర్ సింగిల్స్ టైటిల్. -
క్వార్టర్స్‌లో సాకేత్, యూకీ
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్) : ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేనితోపాటు భారత అగ్రశ్రేణి ఆట గాడు యూకీ బాంబ్రీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో సాకేత్ మైనేని 6-3, 6-2తో ల్యూక్ బామ్‌బ్రిడ్జి (బ్రిటన్)పై అలవోకగా గెలుపొందగా... ఏడో సీడ్ యూకీ 1-6, 7-5, 7-6 (7/1)తో లాస్లో జెరె (సెర్బియా)పై చెమటోడ్చి విజయం సాధించాడు. తొలి రౌండ్లో రెండో సీడ్ ఫారూఖ్ దస్తోవ్ (ఉజ్బెకిస్తాన్)పై సంచలన విజయం సాధించిన ల్యూక్ రెండో రౌండ్లో సాకేత్ ముందు తేలిపోయాడు. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ -దివిజ్ (భారత్) జోడీ 4-6, 6-7 (4/7)తో లాస్లో జెరె-పెజా (సెర్బియా) జంట చేతిలో ఓడింది. -
క్వార్టర్స్‌లో యూకీ
న్యూఢిల్లీ : ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి ఆటగాడు యూకీ బాంబ్రీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తైపీలో గురువారం జరి గిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో యూకీ 6-3, 6-1తో ఎనిమిదో సీడ్ జిమ్మీ వాంగ్ (చైనీస్ తైపీ)పై అలవోక విజయం సాధించాడు. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీకి ఏ దశలోనూ పోటీ ఎదురుకాలేదు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ గో సొయెదా (జపాన్)తో యూకీ ఆడతాడు. -
క్వార్టర్స్‌లో సాకేత్ జంట
న్యూఢిల్లీ: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని తన భాగస్వామి యూకీ బాంబ్రీతో కలిసి డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తైపీలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్-యూకీ బాంబ్రీ ద్వయం 6-3, 2-6, 10-7తో యుయా కిబి-తకుటో నికి (జపాన్) జంటపై గెలిచింది. సింగిల్స్‌లో భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌కు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. రామ్‌కుమార్ 6-2, 3-6, 6-7 (3/7)తో జిమ్మీ వాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. -
సాకేత్ నిష్ర్కమణ
సింగిల్స్, డబుల్స్‌లో ఓటమి ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీ కర్షి (ఉజ్బెకిస్థాన్): ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాకేత్ మైనేని ప్రస్థానం ముగిసింది. సింగిల్స్‌లో క్వార్టర్స్‌తోపాటు డబుల్స్‌లో సెమీఫైనల్లో ఓటమిపాలై టోర్నీ నుంచి సాకేత్ నిష్ర్కమించాడు. గురువారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 1-6, 2-6 తేడాతో నికొలజ్ బసిలాష్విలి చేతిలో ఓడాడు. ఆ తరువాత జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్ మైనేని-జేమ్స్ క్లస్కీ (ఐర్లాండ్) జోడి సెర్గీ బెటోవ్-అలెగ్జాండర్ బురీ చేతిలో ఓడింది. ఇక తమిళనాడుకు చెందిన జీవన్ నెడున్‌చెజియాన్ తన కెరీర్లో తొలిసారిగా ఈ టోర్నీలో సెమీస్‌కు చేరాడు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జీవన్ 6-3, 6-2 తేడాతో రష్యాకు చెందిన మైఖేల్ లెదోవ్స్కిను ఓడించాడు. -
సోమ్‌దేవ్ శుభారంభం
కోల్‌కతా: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ ప్లేయర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సోమ్‌దేవ్ 6-4, 6-4తో మహ్మద్ సఫ్వత్ (ఈజిప్ట్)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో భారత్‌కే చెందిన సనమ్ సింగ్ 6-1, 5-7, 4-6తో డానియల్ కాక్స్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయాడు. క్వార్టర్స్‌లో సాకేత్ జోడి డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాకేత్ మైనేని తన భాగస్వామి సనమ్ సింగ్‌తో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. తొలి రౌండ్లో సాకేత్-సనమ్ సింగ్ ద్వయం 6-2, 4-6, 10-8తో రామ్‌కుమార్ రామనాథన్-కరుణోదయ్ సింగ్ (భారత్) జోడిపై గెలిచింది. మంగళవారం జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తీ చెన్ (చైనీస్ తైపీ)తో విష్ణువర్ధన్; ఎవగెని డాన్స్కాయ్ (రష్యా)తో సాకేత్ మైనేని; లియాంగ్ హువాంగ్ (చైనీస్ తైపీ)తో యూకీ బాంబ్రీ తలపడతారు. -
మెయిన్ డ్రాకు సనమ్ సింగ్
చెన్నై: భారత యువ టెన్నిస్ ఆటగాడు సనమ్ సింగ్ పీఎల్ రెడ్డి స్మారక ఏటీపీ చాలెంజర్ టోర్నీ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. సోమవారం జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఐదో సీడ్ సనమ్ 6-2, 6-2తో రెండో సీడ్ మారెక్ సెంజాన్ (స్లొవేకియా)కు షాకిచ్చాడు. స్థానిక ఆటగాళ్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో ప్రజ్నేశ్ గున్నేశ్వరన్ 7-6(4), 6-3తో శశికుమార్‌ను ఓడించి మెయిన్ డ్రాలో చోటు దక్కించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్ విక్టర్ బలూడా (రష్యా) 7-5, 4-6, 7-6(4)తో రిచర్డ్ బెకర్ (జర్మనీ)పై చెమటోడ్చి నెగ్గగా, మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) 6-2, 6-1తో కరుణుదయ్సింగ్పై గెలుపొంది మెయిన్ డ్రాకు చేరాడు.