శ్రీలంకలో ఆస్ట్రేలియా విద్యార్థినిపై అత్యాచారం
శ్రీలంకలో అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతోంది. అక్కడ అంబలగొండ పట్టణంలో ఓ టూరిస్టు గైడు ఆస్ట్రేలియన్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. స్టడీ టూర్ కోసం ఆస్ట్రేలియా నుంచి శ్రీలంక వరకు వచ్చిన ఆ విద్యార్థిని బీచ్‌కి వెళ్లినప్పుడు అక్కడున్న ఓ టూరిస్టు గైడు తనపై అక్కడున్న సాలిటరీ రాక్ కింద అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ విషయాన్ని అక్కడి స్థానిక వెబ్సైట్లు తమ కథనంలో పేర్కొన్నాయి. మొత్తం 15 మంది ఆస్ట్రేలియన్ విద్యార్థులు పరిశోధన కోసం ఒక బృందంగా శ్రీలంకకు వెళ్లారు. అందులో ఉన్న ఈ విద్యార్థిని బీచ్ వద్దకు వెళ్లినప్పుడు అక్కడున్న గైడ్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించడంతో వారు ఆమెకు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. నిందితుడు అక్కడినుంచి వెంటనే పారిపోవడంతో అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.