బుల్లెట్ దిగిందా.. లేదా.?
స్నాచర్ల కోసం పోలీసుల విస్తృత గాలింపు
ఆటోనగర్ ఘటనలో గాయపడి ఉంటారని అనుమానం
అన్ని చెక్ పాయింట్లు, ఆస్పత్రుల్లోనూ నిఘా
సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో: వనస్థలిపురంలోని ఆటోనగర్‌లో చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న చైన్‌స్నాచర్ల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అనురాధ అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కోబోయిన ఇద్దరు దుండగులు సీసీటీం జరిపిన కాల్పుల్లో గాయపడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలి వద్ద ఒక్క బుల్లెట్ కూడా లభించకపోవడంతో అవి వారికి తగిలి ఉంటాయని భావిస్తున్నారు.
దుండగులు ఆటోనగర్ నుంచి చింతల్‌కుంట, సాగర్‌రింగ్ రోడ్డు, కర్మన్‌ఘాట్ మీదుగా కంచన్‌బాగ్ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అక్కడి ఆస్పత్రులతో పాటు ఇతర ప్రాంతాల్లోని హాస్పిటళ్లలో పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఎవరైనా గాయపడి చికిత్స కోసం వస్తే వెంటనే తమకు సమాచారమివ్వాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే అన్ని చెక్ పాయింట్ల వద్ద నిఘా ముమ్మరం చేశారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఊహా చిత్రాలను గీసి ఇప్పటికే గస్తీ సిబ్బందితో పాటు అన్ని పీఎస్‌లకు పంపారు. ‘స్నాచర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. సాధ్యమైనంత తొందరగా వారిని పట్టుకుంటాం. బస్, రైల్వే స్టేషన్లలోనూ గాలిస్తున్నాం. సీసీటీమ్స్ కూడా చాలా చురుగ్గా పనిచేస్తున్నాయ’ని ఎల్బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ చెప్పారు.