‘అవా’తో అమ్మతనం!
సంతానలేమితో బాధపడుతున్న వారికో శుభవార్త. పండంటి బిడ్డను జన్మనివ్వాలన్న వారి ఆకాంక్ష నెరవేర్చేందుకు ఓ హైటెక్ పరికరం అందుబాటులోకి వచ్చింది. మహిళలు చేతికి తొడుక్కునే వీలుండే ఈ పరికరం నెలసరిలో గర్భం దాల్చేందుకు ఎక్కువ అవకాశాలున్న ఐదు రోజులను గుర్తించి ఆ సమాచారాన్ని అందిస్తుంది. భార్యాభర్తల్లో వైద్యపరమైన సమస్యలేవీ లేకున్నా చాలా మందికి సంతానం కలగకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి వారికోసం ‘అవా’ అనే కంపెనీ ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది. రాత్రి సమయంలో దీన్ని ధరించి పడుకుంటే చాలు.
గుండె కొట్టుకునే వేగం, శరీర ఉష్ణోగ్రత, శ్వాసక్రియ రేటు వంటి అంశాలను గుర్తించి మహిళల్లో అండాలు విడుదలయ్యే సమయాన్ని లెక్కిస్తుంది. ఈస్ట్రాడయోల్, ప్రొజెస్టిరాన్ హర్మోన్ల మోతాదు పెరిగినపుడు వచ్చే సూచనలను గుర్తిస్తుంది. సరైన సమయాన్ని గుర్తించడంలో ఈ పరికరం 89 శాతం విజయవంతమైందని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలో అందుబాటులో ఉన్న ‘అవా బ్రేస్లెట్’ ఖరీదు దాదాపు రూ.14 వేలు!