గడువులోగా పోలవరం పూర్తికాదు
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు గడువులోగా పూర్తికాదని, గడువులోగా పూర్తి చేయడానికి కొన్ని సమస్యలు తలెత్తాయని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి చెప్పారు. పోలవరం పూర్తికి కొంత కాలపరిమితి పెంచాల్సి రావచ్చన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అథారిటీని ఏర్పాటు చేశామని, అయితే గడువులోగా పూర్తి సమస్యలు ఉన్నాయని శనివారం విలేకరుల సమావేశ ంలో ఆమె చెప్పారు. పోలవరం పాజెక్టు పూర్తి కార్యాచరణ, ప్రణాళికలను చర్చించడానికి ఢిల్లీకి రావాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబును కోరామని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రితో చర్చించి ప్రాజెక్ట్‌కు కొత్త కాలపరిమితి నిర్ధారిస్తామన్నారు.
ప్రాజెక్టుకు విధించిన గడువు దాటరాదన్నది తమ అభిమతమని, కానీ కొంతమేరకు సమయం పెంచాల్సి రావచ్చునని ఉమాభారతి వెల్లడించారు. ఇప్పుడు ప్రాజెక్టుకు నిధుల కొరత లేదన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ఇటీవలే రూ. 200 కోట్లు అందించామని, మొత్తం ఇప్పటికి రూ. 500 కోట్లు విడుదల చేశామని తెలిపారు. అయితే ఈ మొత్తం కేటాయింపులపై తనకు సంతృప్తిగా లేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌కు రూ. 1,600 కోట్లు విడుదల చేయాలని నీతి ఆయోగ్‌ను కోరామన్నారు.