170 ఆంగ్ల పదాలతో 50లక్షల వాక్యాలు
దహాను: ఈ మధ్య టీచర్లంటే ప్రయోగాల్లో కంటే వార్తల్లోనే కనిపిస్తున్నారు.. అది కూడా పిల్లలను చితక్కొట్టాడనో..ఇంకేవో దుశ్చర్యలకు పాల్పడ్డారనో.. కానీ, చాలా కాలం తర్వాత మహారాష్ట్రకు చెందిన ఓ ఉపాధ్యాయుడు గొప్ప పేరుతో వార్తల్లో నిలిచాడు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆంగ్ల భాష నేర్చుకునేందుకు పడుతున్న తంటాలు చూసి వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రయత్నించి అందులో విజయం సాధించి వార్తల్లోనే కాక ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చోటు సంపాధించాడు. ప్రస్తుతం గన్నీస్ దిశగా ముందుకెళుతున్నాడు.
ఆ ఉపాధ్యాయుడి పేరు బాలాసాహెబ్ చవాన్(37). దహాను ప్రాంతంలోని ఓ సెకండరీ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చవాన్ కేవలం 170 ఆంగ్ల పదాలను ఉపయోగించి మొత్తం 50లక్షల వాక్యాలు సిద్ధం చేసి ఔరా అనిపించారు. ఆ వాక్యాలన్నీ కూడా విద్యార్థులకు తేలికగా వచ్చేలా. దీనిపై అతనే స్వయంగా వివరాలు చెబుతూ కేఎల్ పాండా హైస్కూల్లో 2010లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమయంలోనే విద్యార్థులు ఆంగ్ల భాషలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు గమనించి 170 పదాల ప్రాజెక్టు ప్రారంభించాడట. ముఖ్యంగా వారి పాఠశాల పూర్తి గ్రామీణ నేపథ్యంతో ఉండటం కూడా ఆ పరిస్థితికి కారణం అని గుర్తించి తేలికైనా పదాలతో వ్యాఖ్యాలు నిర్మించి ఈ ఘనత సాధించాడు.