బలి వెరీ గుడ్!
జ్ఞాపకం
చల్.. కబడ్డీ.. కబడ్డీ... కమ్ముకొచ్చెరా కాపుకొచ్చెరా.. ఆచ్‌తూచ్.. ఆచ్‌తూచ్.. బల్జింగన్నా.. బల్జింగన్నా... స్కూళ్లో చదివే ప్పుడు కబడ్డీ కబడ్డీ అంటూ ఎక్కువసేపు గస ఆపుకోలేక నోటికి ఏదొస్తే అది అనేసేవాళ్లం. మా కబడ్డీ టీమ్‌కి మంచి రిప్యుటేషనే ఉండేది. ఓడలేదని కాదు. అత్యధిక గెలుపు మాఖాతాలోనే ఉండేది. ప్రేయర్ కన్నా ముందు వచ్చి కబడ్డీ ఆడి, మట్టి కొట్టుకుపోయిన తెల్ల చొక్కాలపై చింత బరికెలతో హెడ్మాస్టర్ ‘బలిగుడు’ ఆడినా బాధ ఉండేది కాదు. మా జిల్లా (వైఎస్సార్ కడప)లో కొన్ని చోట్ల ఈ క్రీడను బలిగుడు అని కూడా అంటారండోయ్.
సాయంత్రమైతే రైల్వే క్వార్టర్స్ నీళ్ల ట్యాంకు పక్కన ఖాళీ జాగాలో రాత్రి పది దాకా ఒకోసారి అర్ధరాత్రిళ్లు కూడా బలిగుడు ఆడేదానికి, చూసేదానికిపెళ్లయినోళ్లు, కానోళ్లు, ముసలీ ముతకా అందరూ రెడీ. చూసేవాళ్లలో మహిళలు కూడా ఉండేవారు. ‘ఆమె ఇంట్యోడు (మొగుడు) ఎట్లా ఆడ తాండో సూడాల కదా’ అని ఒకరు... ‘ఓమ్మీ ఆయమ్మి మొగుడు బో ఆన్యాడు లే. దూరి అట్ట పట్టుకుండ్యా. పట్టు పట్టుకోడం ఇంగ ఇడిసిపెట్ల్యా’ అని ఇంకొకరు.
ఒక్కోసారి గొడవలై పంచాయితీలు కూడా అయ్యేవి.అలాంటి నా ఫేవరేట్ కబడ్డీకి గోల్డెన్ డేస్ వస్తాయని, అదీ తారలు దిగివచ్చి కబడ్డీ ఆడేస్తారని నేను కలలో కూడా ఊహించలేదు. నా పల్లె ఆట... బుల్లి తెరపై మల్టీ కలర్ డ్రెస్సుల్లో కండరగండలు ఉడుంపట్టు పట్టేస్తుంటే ఆహా క్యా బాత్‌హై! టీవీలో క్రికెట్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, రెజ్లింగ్ మాత్రమే చూసే మావాడు కబడ్డీ చూస్తుంటే వింత అను భూతికి లోనయ్యా.
లేకపోతే ఏంటండీ క్రికెట్ మాయలో పడి కూర్చున్నచోటు నుంచి లేవకుండా ఊబకాయులై, బద్దకస్తులై, కార్పొరేట్ చదరంగంలో పావులైన పిల్లలు.. కబడ్డీ కబడ్డీ అంటుంటే గుండెలు ఉప్పొంగవా మరి! ‘పల్లే కన్నీరు పెడుతోందో కనిపించని కుట్రల’ అని కుమిలి పోతున్న నేను కనీసం కబడ్డీతోనయినా పల్లెను గుర్తు పెట్టుకుంటారని, మూలాలను మరిచిపోరని సంబరపడు తున్నా.
గోడలకు వేలాడుతున్న క్రికెట్ దేముళ్ల పక్కన కబడ్డీ ఇష్టదైవాలు తొడగొడతారని గట్టి ఇదిగానే ఉన్నా. పల్లె జీవనాడి మళ్లీ జీవం పోసుకుంటుందని నమ్ముతున్నా. తొడగొట్టి ప్రత్యర్థికి సవాలు విసిరే అసలు సిసలు గ్రామీణ ఆట... దమ్మున్న ఆట... నా కబడ్డీకి కార్పొరేట్ సొబగులు అద్దిన వారందరికీ హృదయ పూర్వక సలామ్!
- ఎం.జి.నజీర్