లంచం అడుగుతున్నారు..
మెప్మా కార్యాలయంలో డ్వాక్రా మహిళల ధర్నా
ఖమ్మం సిటీ : బ్యాంకు రుణం అగ్రిమెంట్‌పై సంతకం చేయడానికి మెప్మా కార్యాలయంలో లంచం అడుగుతున్నారని ఆరోపిస్తూ..ఖమ్మం గాంధీ సమాఖ్యకు చెందిన మూడు డ్వాక్రా సంఘాల మహిళలు బుధవారం ఆందోళన చేశారు. కార్పొరేషన్ కార్యాలయం అవరణలోని నగర మెప్మా కార్యాలయంలో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. లక్షకు రూ.500 మామూలు ఇస్తేనే సంతకం పెడతామని డిమాండ్ చేశారని ఆరోపించారు. అలా ఇవ్వకపోతే డ్యాక్యుమెంటేషన్ సరిగా లేదని, తీర్మానం కాపీ లేదని, డ్యాకుమెంటేషన్ తనిఖీలు చేశాక సంతకం పెడతమని ఇబ్బంది పెడుతున్నారని మహిళలు అవేదన వ్యక్తం చేశారు.
సంతకం చేయాలని జూనియర్ మ్రైక్రో ఫైనాన్స్ అధికారి వెంకటేశ్వర్లను కోరితే..అరగంటలో వస్తానని కార్యాలయం నుంచి వెళ్లి గంటల తరబడి రాలేదని తెలిపారు. సీఓ సుల్తానా దురుసుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సిబ్బంది ఆందోళన విషయూన్ని పీడీ వేణుమనోహర్రావుకు, బిల్డింగ్ ఇన్‌స్ట్రక్చర్ కమలశ్రీకి ఫోన్లో సమస్యను వివరించారు. సీఓ ఉపేంద్రమ్మను వెళ్లి డాంక్యుమెంటేషన్పై సంతకం చేసి ఇవ్వాలని ఆదేశించడంతో డ్వాక్రా మహిళలు ఆందోళన విరమించారు. ఈ విషయమై..మైక్రో ఫైనాన్స్ అధికారి వెంకటేశ్వర్లుకు ‘సాక్షి’ వివరణ కోరగా..తాము ఎవ్వరినీ లంచం అడగలేదని, అలా అడిగి ఉంటే రుజువు చేయూలని అన్నారు. డ్యాక్యుమెంటేషన్లను సీఓతో విచారణ చేయించి, అన్నీ పరిశీలించాకనే అందజేస్తామని తెలిపారు.