అతడు.. దూకుడు... ఆగడు...
ఒక్క మగాడు!
పై పేర్లు మన తెలుగు సినిమా పేర్లనే విషయం మీకు తెలిసిందే. విషయం ఏమిటంటే, పై నాలుగు పేర్లతోనే స్టోరీని ఈజీగా ఇలా చెప్పవచ్చు... అతడు: అతడి పేరు స్టాన్సిల్వా ఎక్సెనెవ్. రష్యా దేశస్థుడు. కుదురుగా కూర్చోవడం అంటే బొత్తిగా ఇష్టం ఉండదు. ఏదో ఒక పని చేయాలి. ఆ పనిలో మజా ఉండాలి. దూకుడు: ఏ పని చేసినా ‘దూకుడు నా జన్మహక్కు’ అనట్లుగా ఉంటుంది ఎక్సెనెవ్ ప్రవర్తన. బేస్జంపింగ్లో దూసుకుపోయి ఎప్పటికప్పుడు సత్తా చాటుతున్నాడు. వేల అడుగుల ఎత్తు నుంచి దూకుతూ ‘ఔరా’ అనిపించాడు.
ఆగడు: నిజానికి ఎక్సెనెవ్ పనులేవీ వారి కుటుంబసభ్యులకు అంతగా నచ్చావు.
‘‘రిస్క్ ఎందుకు?’’ అంటూ ఉంటారు. కాని వాటిని పెద్దగా ఎప్పుడూ పట్టించుకోలేదు. ఆగిపోలేదు. చాలా దేశాలు బేస్జంపింగ్ను నిషేధించాయి. గత 13 సంవత్సరాల్లో వివిధ ప్రాంతాలలో బేస్జంపింగ్ చేసిన వారిలో 30 మంది వరకు మరణించారు. స్విట్జర్లాండులాంటి కొన్ని దేశాల్లో మాత్రం నిషేధం లేదు.
ఒక్క మగాడు: ఇటీవల స్విట్జర్జాండులో తన సరికొత్త సాహసకార్యానికి శ్రీకారం చుట్టాడు ఎక్సెనెవ్. ఒంటికి కొక్కాలు తగిలించుకొని, వాటిని పారాచూట్‌కు కట్టుకొని పదమూడు వందల అడుగుల ఎత్తు నుంచి బేస్జంప్ చేశాడు. ఇలా చేయడం సామాన్య విషయమేమీ కాదు. ఏ కొద్ది తేడా వచ్చినా...ఇక అంతే! కాని ఎక్సెనెవ్ ఎలాంటి ప్రమాదానికీ గురి కాకుండా భద్రంగా భూమి మీద ల్యాండై మరోసారి శభాష్ అనిపించుకున్నాడు.