ఐదు స్వర్ణాలతో అబ్బురపరిచాడు
గువాహటి: శ్రీలంకలో జరిగిన దక్షిణ ఆసియా ఆక్వాటిక్ చాంపియన్ షిప్(ఎస్ఏఏసీ) క్రీడల్లో అస్సాం కుర్రాడు ఐదు స్వర్ణాలు, సిల్వర్ పతకం సాధించి దేశం గర్వించేలా చేశాడు. అతనే పదిహేనేళ్ల బస్తబ్ తపన్ బొర్డోలోయ్. చిన్ననాటి నుంచి ఈతపై మక్కువ కలిగిన బస్తబ్ ను అతని తల్లిదండ్రులు ఎంకరేజ్ చేశారు.
2012లో తొలిసారి అస్సాం రాష్ట్ర స్ధాయి క్రీడల్లో పాల్గొన్న బస్తబ్ వెండి పతకాన్ని సాధించాడు. ఉత్తర భారతదేశం పోటీలకు నుంచి శ్రీలంకకు వెళ్లిన ఏకైక స్విమ్మర్ కూడా బస్తబే. సార్క్ దేశాల నుంచి వచ్చిన స్విమ్మర్లు తనకు గట్టి పోటీనిచ్చినట్లు బస్తబ్ తెలిపాడు. మొత్తం ఆరు విభాగాల్లో(50 మీటర్ల బటర్ ఫ్లై, 50 మీటర్ల ఫ్రీ స్టైల్, 4X100 మీటర్ల మిక్స్ రిలే, 4X100 మీటర్ల ఫ్రీ స్టైల్ రిలే, 4X200 మీటర్ల ఫ్రీ స్టైల్ రిలే, 100 మీటర్ల బటర్ ఫ్లై) పాల్గొనగా 100 మీటర్ల బటర్ ఫ్లైలో వెండి, మిగిలిన ఈవెంట్లలో స్వర్ణాలు సాధించనట్లు వెల్లడించాడు.
ఆసియా గేమ్స్, 2020 టోక్యో ఒలింపిక్స్ కు ఎంపిక కావడమే తన తదుపరి లక్ష్యాలని తెలిపాడు. కాగా ఐదు స్వర్ణాలతో పోటీల్లో అద్భుతంగా రాణించిన బస్తబ్ కు జోర్హత్ ఆక్వాటిక్ సొసైటి రూ.50 వేల నగదు బహుమతి అందించింది.