బౌద్ధం @ బాదన్కుర్తి
బుద్ధుని శిష్యుల ఆవాసం ఇదే.. ∙బుద్ధుడిని కలసిన 16 మంది యువకులు ఇక్కడివారే
ఆయన ఆదేశంతో ఇక్కడ్నుంచే బౌద్ధ ప్రచారానికి శ్రీకారం
నిర్మల్ జిల్లా బాదన్కుర్తిలో వెలుగుచూసిన తొలి తరం బౌద్ధ నిర్మాణాలు
సాక్షి, హైదరాబాద్: బుద్ధుడు సజీవంగా ఉండగానే బౌద్ధ ప్రచారానికి నడుం బిగించిన బృందం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిందే అన్న విషయం ఎందరికి తెలుసు? ఇప్పటి వరకు చరిత్రపుటల్లోనే నిక్షిప్తమైన ఆ అంశానికి సంబంధించి తిరుగులేని ఆధారాలు వెలుగులోకి వచ్చా యి. నేరుగా బుద్ధుడిని కలిసి ఆయన ఆదేశంతో బౌద్ధ ప్రచారాన్ని ప్రారంభించిన తొలి బృందం ప్రస్తుత నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదన్కుర్తి ప్రాంతానికి చెందినదే! ఈ విషయం బౌద్ధ గ్రంథం సుత్తనిపాతంలోని పారాయణ వగ్గలో ఉంది. కానీ సాక్ష్యాలు లేకపోవడంతో ఇదంతా వట్టి ప్రచారమే అన్న వాదన కొనసాగింది.
కానీ అది నిజమని చాటే ఆధారాల జాడ ఇప్పుడు దొరికింది. సుదీర్ఘ ప్రయత్నం తర్వాత బుధవారం దాని జాడ వెలుగుచూసింది. వెరసి రెండున్నర వేల ఏళ్ల నాటి అత్యం త కీలక చారిత్రక సాక్ష్యం ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం తెలంగాణకు దక్కింది. తెలంగాణ వేదికగా బౌద్ధ చరిత్రకు ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు. బాదన్కుర్తి బౌద్ధ సంస్కృతి వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా భాసిల్లిన తీరును గతంలోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ మేరకు జూలైలో ప్రత్యేక కథనం కూడా ప్రచురించింది.
ఆ ప్రస్తావన ఇక్కడిదే..: బౌద్ధ సాహిత్యంలో గోదావరి నదీ ప్రస్తావన.. బాదన్కుర్తి గ్రామానికి సంబంధించిందే అయి ఉంటుందని చరిత్రకారులు చాలాకాలం క్రితమే పేర్కొన్నారు. ‘మహాజనపథ రాజ్యం అస్మక పాలన కాలం.. గోదావరి నది రెండుగా చీలిన ప్రాంతంలోని ఆవాసానికి చెందిన బావరి ఆధ్వర్యంలో 15 మంది యువకులు బుద్ధుని కలసి ఆయన బోధనలకు ప్రభావితులయ్యారు. వారు ఆయన బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు బయలుదేరారు’ అని సుత్తనిపాతం పారాయణవగ్గలో బుద్ధునికాలంలోనే లిఖించి ఉంది. అస్మక పాలన పరిధి తెలంగాణలోనే ఉంది. ఇక్కడ గోదావరి రెండుగా చీలిన ప్రాంతం ఇక్కడే కనిపిస్తుంది. అదే బాదన్కుర్తి గ్రామం ఉన్న చోటు. అది నదీ ద్వీపంగా భావిస్తారు.
గోదావరి రెండుగా చీలగా మధ్యలో ఏర్పడ్డ భూభాగంలో ఉన్న ఒకేఒక్క జనావాసం ఈ గ్రామం. బావరి పేరుతోనే ఈ ప్రాంతానికి బాదన్కుర్తిగా పేరు వచ్చిందని పేర్కొన్నారు. కానీ ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఎక్కడా బౌద్ధ సంస్కృతిని చాటే ఒక్క నిర్మాణం జాడ వెలుగు చూడలేదు. దీంతో ఆ వాదనలో సత్యం లేదనే వాదన మొదలైంది. కానీ ఇప్పుడు బౌద్ధ స్థూపానికి చెందినదిగా భావిస్తున్న నిర్మాణాల జాడను గుర్తించారు. ఇవి బౌద్ధానికి చెందిన తొలి నిర్మాణాలుగా భావిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచే బౌద్ధమత ప్రచారం మొదలై ఇతర దేశాలకూ విస్తరించిందని అంచనా వేస్తున్నారు. బావరి బృందంతోపాటు అప్పట్లో బయలుదేరిన మరికొన్ని బృందాలే ప్రపంచానికి బౌద్ధాన్ని పరిచయం చేశాయి.
వెలుగుచూసిన పురాతన ఇటుకల వరుస
తెలంగాణలో బౌద్ధానికి చెందిన జాడలు చాలా వెలుగుచూశాయి. వాటి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన బుద్ధవనం ప్రాజెక్టు అధికారులే తాజాగా బావన్కుర్తిలో నిర్మాణాల జాడ కనిపెట్టారు. స్థానిక దత్తాత్రేయ దేవాలయం వెనకవైపు గోదావరి తీరం చేరువలో పురాతన ఇటుకల వరుస బయటపడింది. రెండడుగుల పొడవున్న ఆ ఇటుకలను వెలికితీసి పరిశీలింగా అవి బౌద్ధ స్థూప నిర్మాణాల్లో వాడేవని రూఢి అయింది. దీంతో అక్కడే బౌద్ధ స్తూపంతోపాటు ఇతర నిర్మాణాలు ఉండిఉంటాయని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపి విలువైన ఆ నిర్మాణాలను వెలుగులోకి తేవాలని కేంద్రానికి లేఖ రాయాలని బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య నిర్ణయించారు.
బౌద్ధ చరిత్రలో ఇది కీలక పరిణామం
బావన్కుర్తి ప్రస్తావన బౌద్ధ సాహిత్యంలో ఉన్నా.. దాన్ని రూఢి చేసే ఆధా రాలు లేకపోవటం ఇంతకాలం వెలితి. ఇప్పుడు వాటి జాడ దొరకటం బౌద్ధ చరిత్రలో కీలక పరిణామం. బుద్ధుడిని స్వయంగా కలిసి ఆయన బోధన లను విశ్వవ్యాప్తం చేసేందుకు బయలుదేరిన బృందం తెలంగాణకు చెం దినది కావటం విశేషం. త్వరలో చేపట్టబోయే బుద్ధిస్ట్ సర్క్యూట్ ప్రాజెక్టుకు ఇది కీలకం కానుంది. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపి భూగర్భంలో నిక్షిప్తమైన బుద్ధుడి కాలంనాటి అపురూప కట్టడాలను ప్రపంచం ముందు నిలపాల్సి ఉంది. – మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం ప్రత్యేకాధికారి