ట్రంప్ దెబ్బకు దిగొస్తున్న కంపెనీలు
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలతో దాదాపు అన్ని కంపెనీలు దిగొస్తున్నాయి. తాజాగా జర్మనీ బహుళ జాతీయ ఫార్మా, కెమికల్స్ కంపెనీ బేయర్ ఏజీ, తనలో విలీనం చేసుకున్న అమెరికా బయోటెక్ అగ్రగామి మోన్శాంటో ఉద్యోగాలు అమెరికాలోనే కల్పించనున్నట్టు డొనాల్డ్ ట్రంప్‌కు వాగ్దానం చేసింది. ఈ కంపెనీ ఇటీవలే మోన్శాంటోను సొంతం చేసుకుంది. సొంతం చేసుకున్న మోన్శాంటోలో కల్పించబోయే ఉద్యోగాలు అమెరికాకేనని బేయర్ తెలిపింది. అంతేకాక అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్టు పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అనంతరం కంపెనీ ఈ ప్రణాళికను వెల్లడించింది.
విలీనం అనంతరం 8 బిలియన్ డాలర్ల(రూ.54,519కోట్లకు పైగా) పెట్టుబడులు, వేలకొలదీ ఉద్యోగాలు కల్పించాలని ప్లాన్ చేస్తున్నట్టు బేయర్ తెలిపింది. 3వేల ఉద్యోగాలను మోన్శాంటోలో కల్పించనున్నామని బేయర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెర్నర్ బామన్ వాగ్దానం చేసినట్టు ట్రంప్ అధికార ప్రతినిధి తెలిపారు. అంతేకాక డీల్ పూర్తి అయిన తర్వాత కూడా మోన్శాంటో ప్రధాన కార్యాలయం సెయింట్ లూయిస్‌లోనే ఉంటుందని చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న తరుణంలో అమెరికా వ్యాపారాలన్నీ, అమెరికన్లకే ఉద్యోగాలు సృష్టించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మెక్సికో నుంచి కొన్ని మోడల్ కార్లను అమెరికా మార్కెట్‌కు తరలిస్తున్న జనరల్ మోటార్స్ కంపెనీ సైతం 1 బిలియన్ డాలర్ల అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌ను ప్రకటించింది. వాల్‌మార్ట్ స్టోర్స్ ఇంక్, ఫోర్డ్ మోటార్ కంపెనీ, ఫియాట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ వంటి కంపెనీలు కూడా ట్రంప్ దెబ్బకు దిగొచ్చి తమ అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను గతవారమే ప్రకటించేశాయి.