ఓవెన్స్ ఒలింపిక్ పతకానికి రూ.9 కోట్లు
లాస్ఏంజిల్స్: అమెరికా అథ్లెటిక్స్ గ్రేట్ జెస్సీ ఓవెన్స్ 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో సాధించిన స్వర్ణ పతకానికి రికార్డు స్థాయిలో ధర పలికింది. కాలిఫోర్నియాలో ఆదివారం జరిగిన వేలంలో 14 లక్షల 66 వేల 574 డాలర్ల (దాదాపు రూ.9 కోట్లు) ధరకు కొనుగోలు చేశారు. ఇంత ధర ఇప్పటిదాకా ఏ ఒలింపిక్ పతకానికీ దక్కకపోవడం విశేషం. దీంతో విశ్వ వ్యాప్తంగా ఓవెన్స్ సాధించిన ఫీట్కున్న ప్రాముఖ్యత ఏమిటో లోకానికి వెల్లడయినట్టయ్యింది. వెయ్యికి పైగా క్రీడా వస్తువులను ఈ వేలంలో ఉంచారు.
జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ జాత్యహంకారానికి చెంపపెట్టుగా... నల్ల జాతీయుడైన ఓవెన్స్ బెర్లిన్ ఒలింపిక్స్‌లో 100మీ., 200మీ., లాంగ్‌జంప్, 4ఁ100మీ.రిలేలో స్వర్ణాలు సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ నాలుగు పతకాలలో ఓ పతకం వేలానికి రాగా దీన్ని కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలను వెల్లడి చేయలేదు. అయితే ఆయన తిరిగి ఈ స్వర్ణాన్ని ఆయన జెస్సీ ఓవెన్స్ ఫౌండేషన్‌ను ఇవ్వనున్నట్టు వేలం నిర్వాహకులు వెల్లడించారు. అలాగే 1960లో మహ్మద్ అలీ తన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ టైటిల్ నిలబెట్టుకున్న బౌట్‌కు ముందు ధరించిన గౌను 60వేల 667 డాలర్ల (రూ.37 లక్షలు)కు అమ్ముడుపోయింది.