‘బేటీ బచావో.. బేటీ పడావో’
ప్రగతినగర్ : ఆడపిల్లలను గర్భంలోనే చంపేసే విష సంస్కృతికి చరమగీతం పాడాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ప్రజల ను కోరారు. శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆడపిల్లల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో, బేటీ పడా వో కార్యక్రమాన్ని ప్రారంభిం చిందన్నారు. ఇందులో భాగం గా సుకన్య సమృద్ధి అకౌంట్ (ఆడపిల్ల ఖాతా)ను జిల్లాలోనూ ప్రారంభించామన్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డ పేరుతో పోస్టాఫీసులో లేదా బ్యాంకులో ఖాతా ప్రారంభించవచ్చన్నారు.
2003 డిసెంబర్ 2వ తేదీ తర్వాత జన్మించిన ఆడపిల్లలు ఈ ఖాతా తెరవడానికి అర్హులని పేర్కొన్నారు. వెయ్యి రూపాయలతో ఖాతా ప్రారంభించవచ్చని, ఏడాదిలో లక్షన్నర రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చని సూచించారు. 9.1 శాతం వడ్డీ చెల్లిస్తారని తెలిపారు. స్వైన్‌ఫ్లూపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నామని, అందరికీ ఈ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు అందుతాయన్నారు. 622 గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయన్నారు. ఆరోపణలు వచ్చిన మీ-సేవ కేంద్రాలను సీజ్ చేశామన్నారు. బోగస్ ఆధార్‌కార్డులు తయారు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఐదు ఇసుక క్వారీలకు మాత్రమే అనుమతి ఉందన్నారు. అంతకుముందు కలెక్టర్ కూతుళ్లతో సీనియర్ పోస్టల్ సూపరింటెండెంట్ అబయ్ బంచోడే బేటీ బాచావో -బేటీ పడావో అకౌంట్‌ను తెరిపించారు.