బియాండ్ ఖదీర్
కేశవరెడ్డి ఏం చేస్తారు? ఎరుకలూ యానాదుల్నేసుకుని పందులు
తోలుకుంటూ తిన్నగా మనింట్లోకొచ్చేస్తారు. అల్లం రాజయ్య అయితే? పేజీలు తెరిస్తే అక్షరాలు బొగ్గులై మండి కళ్లెర్ర జేసి రగల్ జండాలవుతాయి. మార్జిన్‌లోని అడవుల చెట్ల కొమ్మల చిగుళ్లకి బానెట్లు మొలుస్తాయి.
పతంజలి వెనకే వీరబొబ్బిలీ, గోపాత్రుడూ, రొంగలి అమ్మన్న ఇంకా
రకరకాల కులాల వాళ్లంతా వచ్చి జామి పోలీస్ స్టేషన్ దగ్గర కావిడి కర్రల్తో జరగాల్సిన అల్లరి భారత యుద్ధాన్ని మన డ్రాయింగ్రూమ్కి తెచ్చి రచ్చ రచ్చ చేస్తారు. ‘వేలుపిళ్లై’ సి.రామచంద్రరావుగారైతే మనల్ని చెవులు పట్టుకు తమిళనాడు లాక్కెళ్లి, టీ తోటల్లో తమిళ పనివాళ్లనీ, ఇంగ్లిషు దొరల్నీ, ఏనుగుల్నీ దగ్గరుండి చూపిస్తారు. నామిని వస్తే వెంట ఆ చెలకా, అమ్మా, నాన్నా, పెళ్లామూ, నోస్టాల్జియా అనే అమ్మాయి తిట్టుకుంటూ కొట్టుకుంటూ పుస్తకం లోంచి మన నెత్తికెక్కేస్తారు.
మరి ఖదీర్బాబయితే కావలి, నెల్లూరు పేద ముస్లింలూ, అమ్మా, నాన్నా, తలకాయ మాంసం, చేపలూ, హైదరాబాద్ ఓల్డ్‌సిటీ, మసీదులూ, ఇరుకు కొంపలూ, ఉక్కపోయించి ఉక్కిరిబిక్కిరి చేస్తాడు.
అంతేనా? ఇదే బ్రాండింగా? కాదని కొత్తగా తేలింది. ఊరి కతల నుంచి కలం మెట్రోపాలిస్కి
కదిలొచ్చింది. జూబ్లీ హిల్స్ రోడ్ల మీద కారును సర్రున డ్రైవ్ చేసింది. అవతల గేటెడ్ కమ్యూనిటీల మీదా లోపల అప్పర్ మిడిల్ క్లాస్ ఆడా మగా, పిల్లా జెల్లా బతుకు మీద టార్చిలైటేసింది. డబ్బూ దస్కం
సుబ్బరంగా ఉండి ఏ లోటూ లేకపోయినా ఆత్మ
లోకంలో కుప్పదివాలా తీసిన బతుకులు సబ్జెక్ట్ అయ్యాయి. ఆ సంసారాల్లో బోర్డమ్, ఎలియనేషన్ని చూపించింది.
ఈ కథలూ, వాటిని తూకం వేసి, సాహిత్య విమర్శ చేసి, బరువు ఇంత అని తేల్చి చెప్పడం వేరే విషయం. పాత రాతల నుంచీ, పాత వస్తువుల నుంచీ ఖదీర్ తనని తాను వదిలించుకొని, విదిలించుకొని బయటపడి కొత్త విషయాన్నీ దాని కొత్త పద్ధతినీ
వెతుక్కోవడం ఆ వరసలో తనని తానే కనుక్కోవడం పెద్ద బ్రేక్.
కవులూ, కథకులూ, నవలా రచయితలూ, చిత్రకారుల్లో ఒక వరసుంది. కొత్తలో రాసిన ఓ రాతో గీతో హిట్టవుతుంది. అందరూ బాగుందంటారు. కనుక ఆ రాతా గీతా రిపీట్ అవుతాయి. జనం ఆశించేది అదే గనక సూపర్‌హిట్ అంటారు. మళ్లీ రిపీట్. ఈ వలయం గిరగిరా తిరగ్గా దశాబ్దాలు గడిచినా మొదటి గీత లోపలే ఆర్టిస్టు తిరుగుతూ ఆ గీతనే పీకకు చుట్టుకుంటాడు. దీనికి వంద సజీవ
ఉదాహరణలివ్వొచ్చు. ఈ వంద ఉదాహరణల రచయితలకీ అనేక పరిమితులున్నాయి, ఖదీర్కున్నట్టే. కానీ వాటిని బద్దలు కొట్టుకు బయటపడ్డాడు. కొత్త డిక్షన్ తెచ్చి పెట్టాడు. కొత్త సమస్యల తుట్టె కదిపాడు
(కంటెంట్, ఫామ్ అనే పదాల బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టుతుంది).
మెట్రోపాలిటన్ సిటీ, అర్బన్ లైఫ్, మిడిల్, అప్పర్ మిడిల్ క్లాస్ జనాల బతుకూ, చావుల్ని ఖదీర్ కొత్తగా డిస్కవర్ చేశాడని కాదు. గతంలో చాలమంది రాశారు. చక్కగానూ రాశారు. ఈ మధ్య ‘అరుణతార’ కథా స్పెషల్‌లో కూడా సాఫ్ట్వేర్ అమ్మాయిలూ హార్డ్‌వేర్ భర్తలూ సెక్స్ సమస్యల్లాంటి విషయాల మీద చాలా బోల్డ్‌గా ఈజీగా రాసిన కథలు ఆశ్చర్యం కలిగిస్తాయి. విప్లవ పత్రికల వాళ్లు కూడా ఇలాంటి
వాస్తవాల్ని ఒప్పుకుంటూ అచ్చు వేస్తారా అని బుగ్గలు నొక్కుకుంటాం.
‘ఖదీర్ వచనం బావుంటుంది. అయితే ఇఫ్- బట్’ అని సంభాషణలు ప్రారంభం కావటం గమనించొచ్చు. మంచి వచనం రావడం, కథ అల్లడం,
ఎత్తుబడీ, నడకా, ముగింపూ ఇదంతా చాలా చిన్న విషయమన్నట్టూ అసలు సంగతే వెరీ వెరీ ఇంపార్టెంటు అన్నట్టు ఆర్గ్యుమెంట్లు వచ్చాయి. ‘ఒక హత్య
చేయడానికి మొదటి నుంచి చివరి వరకూ పకడ్బందీగా వివరంగా పథకం పన్నడం ఎలా ఉంటుందో కథారచన కూడా అంతే’ అని యూరప్ పెద్దాయన చెప్పాడు. ఈ వచనం, ఈ కథనం తెలిసినవాణ్ణే స్టోరీ టెల్లర్ అంటారు. మిగతా వాళ్లందరి పేరూ ఒకటే- దారిన పోయే దానయ్య. కథలు చెప్పడం ఆషామాషీ కాదు. అసలు విషయం అదే. ఈ పది కథల్నీ ఏకబిగిన చదివేయొచ్చు. సింప్లీ ది పవరాఫ్ ఇంటెన్సివ్ స్టోరీ టెల్లింగ్. స్టోరీ టెల్లర్గా ఖదీర్ ముందడుగు ఇది.
తాజ్‌మహల్ తాతలాంటి బంగళా, కార్లూ, నౌకర్లూ చాకర్లూ ఉండీ కూడా కొడుకు నోట్లో శని
వదిలించడానికి మంత్రగాణ్ణి ఆశ్రయించిన తల్లి- డ్రగ్ ఎడిక్ట్ కొడుకుని కట్టుకున్న ఆడది డ్రైవర్‌తో తిరుగుతుంటే భరించలేని తల్లి- కొడుకుని బాగు చేయమని వేనకువేలు ఆఫర్ చేస్తే ఎదురొచ్చే లక్ష్మీదేవికి మోకాలడ్డిన మంత్రగాడు డబ్బు కాదనుకుని బయటికి పోవడం కథ. కానీ చివర్లో మంత్రగాడు
అసిస్టెంట్‌తో ‘అరటిపండు తింటావా’ అని అడగడం ఆటో కోసం ఎదురు చూడ్డం మన మీద ముద్ర గుద్దుతుంది. అదిక
చెరగదు (ఆస్తి).
ఆస్పత్రి పాలైన తాగుబోతు భర్తతో విసుగెత్తి వెళ్లిపోతున్న బుజ్జి పెళ్లాం అనుకోకుండా అక్కడున్న కుర్రాడితో ముందు గొడవ పడి తర్వాత ఎఫైర్లో పడుతుంది. ఈ ఫైరీ ఎఫైర్ గురించి వేరెవరేనా అయితే రెండు పేజీలో ఆరు పేరాలో రాస్తారు. కానీ ఖదీర్ పరమ పొట్టి వాక్యం పొదుపుగా రాస్తాడు. కొద్దిగా స్కిప్ చేస్తే అసలు సంగతి అర్థం కాదు గూడా. బ్రివిటీ అదే (ఘటన).
భర్త ఆఫీసుకి, పిల్లలు చదువులకి. లంకంత కొంపలో ఒంటరి ఒంటెగా ఉస్సురోమంటూ తోచక కొట్టుకునే అర్బన్ ఇల్లాలు. ఇలాంటి వాళ్లు సిటీలో కోకొల్లలు. పత్రికల్లో వ్యాసాలూ రచనలూ చేసే ప్రముఖులకి అదేపనిగా ఫోన్లు కొట్టి టైమ్ కిల్
చేయడానికి ఆమె నానా చావులూ చావడం బతుకులో బోర్‌డమ్‌ని, నిస్సహాయతనీ చూపుతుంది. ఇది ఈనాడే కాదు ఎప్పుడూ ఉన్నదే. క్లైవూ, వెల్లస్లీ ప్రభువూ, బెంటింగ్ ప్రభువూ వారి నానా రకాల తెల్ల ఆఫీసర్లూ ఇండియాలో దండయాత్రలతో వ్యాపా
రాలతో యమ బిజీగా ఉన్నపుడు వాళ్ల భార్యలందరూ ఏం చేశారు? అని శోధించి వాళ్ల బతుకులు రికామీగా బోర్‌డమ్‌తో నిండిపోవడం గురించి రెండు దశాబ్దాల క్రితం ఓ నవల వచ్చింది. ఖదీర్ ఇప్పటి ఆధునిక కాలంలో మన చుట్టూ ఉన్న వాతావరణంలో చిత్రాన్ని చూపుతాడు (టాక్ టైమ్).
పక్క సందులోని జంషీద్ అనే అమ్మాయితో ఎంతో ఆప్యాయంగా ఉండే చిన్నపిల్లడు వహీద్, ఆ పిల్లకి పెళ్లయి, వెళిపోతే తట్టుకోలేకపోతాడు. ఇలాంటి కథలు చాలమంది రాశారుకానీ ట్రీట్మెంట్ మనల్ని బుట్టలో వేస్తుంది. చివరి వాక్యాలు ‘అప్పుడు జంషీద్ ఆపా గుర్తుకు వస్తుంది. అప్పుడు ఎందుకనో చాల బాగుంటుంది’ అని ముగించినపుడు మనకిక ఆ బుట్టలోనే కూచుండిపోదామనిపిస్తుంది (వహీద్). ఇలా ప్రతి కథలోనూ మెరుపులూ పార్టింగ్ కిక్‌ల గురించి ఎంతేనా, ఎన్నేనా చెప్పొచ్చు.
ఈ పది కథల్లోని పాత్రలూ ఘటనలని ఘటనా ఘటన సమర్థులైన పాఠకులూ రచయితలే ఫీలయ్యి, ఎమ్యూజ్ అయ్యి, ఆశ్చర్యపోయి, విషాదించి ఇంకా ఎన్నెన్ని రసాలుగానో కరిగిపోగలరు. సంతోషించదగ్గ విషయమల్లా ఖదీర్ తనలోకి తాను ప్రయాణించి వెదుక్కుని ‘బియాండ్ ఖదీర్’ తీరానికి మళ్లీ ప్రయాణం కట్టడమే. చాలామంది కళాకారులు చేయలేక ఫెయిల్ అయిందీ ఖదీర్ సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగిందీ ఇక్కడే.
బెస్ట్ ఆఫ్ లక్. బాన్ వాయేజ్ ఖదీర్.
- మోహన్ (ఆర్టిస్ట్)
బియాండ్ కాఫీ; మహమ్మద్ ఖదీర్‌బాబు కథలు
వెల: రూ.135; ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ (కాచిగూడ)