సైబర్ స్పేస్‌లోకి ప్రమాదకర వైరస్!
న్యూఢిల్లీ: భారత సైబర్‌స్పేస్‌లో 'బయోజీ' అనే ప్రమాదకర వైరస్ వ్యాప్తి చెందుతోందని సైబర్ దాడుల నిరోధక సంస్థ సెర్ట్-ఇన్ (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా) హెచ్చరించింది. ఈ వైరస్ వినియోగదారుల కంప్యూటర్లలోకి చొరబడి వారి సమాచారాన్ని మార్చివేసి, తస్కరిస్తుందని తెలిపింది. ట్రోజన్ రకానికి చెందిన ఈ వైరస్ ఐదు మారు రూపాల్లో కంప్యూటర్లలోకి ప్రవేశించి రిమోట్ పద్ధతిలో పనిచేస్తుందని, వేరే చోట ఉన్న వ్యక్తులు దీని ద్వారా కంప్యూటర్లలోకి సమాచారాన్ని ఎక్కించడం లేదా తస్కరించడం, ఫైళ్లను డిలీట్ చేయడం, మార్చివేయడం వంటివి చేసేందుకు వీలవుతుందని పేర్కొంది.
వైరస్ బారిన పడకుండా ఉండేందుకు బయోజీ(బీఐవోఏజడ్ఐహెచ్), ఇతర సారూప్య పేర్లతో కూడిన ఈ-మెయిల్స్, లింకులను ఓపెన్ చేయరాదని ఇంటర్నెట్ వినియోదారులకు సెర్ట్-ఇన్ సూచన చేసింది. గుర్తుతెలియని వెబ్సైట్లలోకి లాగిన్ కాకుండా ఉండటం, ఆటోరన్/ఆటో ప్లే ఆప్షన్లను డిజేబుల్ చేసుకోవడం, యాంటీ వైరస్ సాప్ట్వేర్లను అప్డేట్ చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.