సరిపడా నిద్రతోనే చదువుల్లో చురుకుదనం..
తగినంత నిద్ర ఉంటేనే చిన్నారులు చదువుల్లో చురుగ్గా ఉండగలరని, తగిన నిద్రలేని చిన్నారులు చదువుపై దృష్టి కేంద్రీకరించలేక వెనుకబడతారని బ్రెజిల్ నిపుణులు చెబుతున్నారు. బ్రెజిల్‌లోని ఏడు నుంచి పదేళ్ల లోపు వయసు గల చిన్నారులపై వివిధ పరీక్షలు నిర్వహించి వారు ఈ నిర్ధారణకు వచ్చారు.
పాఠశాలలోనైనా, ఇంట్లోనైనా ఆందోళన, ఒత్తిడి ఎదుర్కొనే చిన్నారులు సరిపడా నిద్రకు దూరమవుతున్నారని, సరైన వేళల్లో పడకకు చేరే అలవాటు లేని చిన్నారులు సైతం నిద్రలో సమస్యలు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. నిద్రకు దూరమైన పిల్లలు మిగిలిన వారి కంటే పరీక్షల్లో వెనుకబడుతున్నారని తమ అధ్యయనంలో తేలిందని బ్రెజిల్ నిపుణులు వెల్లడించారు.