సమ్మిళిత భారత్ దిశగా..
బడ్జెట్ కామెంట్
సమ్మిళిత భారత్ దిశగా..
ఎకానమీ వృద్ధికి బాటలు పరిచే బడ్జెట్ ఇది. ఉద్యోగావకాశాల పెంపు, మౌలిక వసతులు మెరుగుపర్చడంతోపాటు పేదరికాన్ని తగ్గించేలా రూపొందించారు. బడ్జెట్ ప్రకటన చూస్తుంటే సమ్మిళిత భారత్ నిర్మాణం దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలుస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఆధార్ ఆధారిత హెల్త్ కార్డులు జారీ చేయనుండడం ఆహ్వానించదగ్గది. పీజీ మెడికల్, డీఎన్బీ కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంపు మెచ్చుకోతగ్గ అంశం. ప్రాణాధార ఔషధాల ధరల సవరణ, వైద్య పరికరాల ధరల క్రమబద్ధీకరణతో ఆరోగ్య సేవల రంగంపై సానుకూల ప్రభావమే చూపిస్తుంది. వైద్యానికి ప్రాధాన్య దేశంగా భారత్ అవతరించింది. –ప్రతాప్ సి రెడ్డి, అపోలో హాస్పిటల్స్ చైర్మన్
గేమ్ చేంజర్ మాత్రం కాదు..
సానుకూల బడ్జెట్ అయినప్పటికీ గేమ్ చేంజర్ మాత్రం కాదు. వైద్య రంగం వృద్ధికి చర్యలు తీసుకోలేదు. 1.5 లక్షల హెల్త్‌కేర్ సెంటర్ల నవీకరణ, 2 ఎయిమ్స్‌ల ఏర్పాటు మినహా పెద్దగా ప్రకటించిందేమీ లేదు. జనరిక్ మందులను ప్రోత్సహించడంలో భాగంగా డ్రగ్స్, కాస్మెటిక్స్ యాక్టు సవరణకు ప్రతిపాదించారు. ఔషధ రంగాన్ని వృద్ధిబాటలో పెట్టేలా నిర్ణయాత్మక ప్రకటన ఉంటుందని పరిశ్రమ భావించింది. అటువంటిది ఏమీ జరగలేదు. ఎఫ్‌డీఐల రాకకు అవరోధంగా ఉన్న ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. –సతీష్ రెడ్డి, డాక్టర్ రెడ్డీస్ చైర్మన్