ఇంటి అందం రెట్టింపు!
సాక్షి, హైదరాబాద్ : గతంలో గోడలకు సున్నం వేయించడమే పెద్ద అలంకరణ. అలాంటిదిప్పుడు గోడలకు చిత్రాలు (ఆర్ట్స్) తగిలించుకోవటం ట్రెండ్. మోడరన్ ఆర్ట్ కేన్వాస్లు నివాస గృహాలతో పాటు, వాణిజ్య, వ్యాపార కేంద్రాలు, కార్యాలయాల గోడల మీద దర్శనమిస్తాయి.
► చిత్రాలను వేలాడదీయాల్సిన ఆయా ప్రదేశాలను బట్టి ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవాలి. లేకపోతే ‘వీడికి బొత్తిగా కళాభిరుచి లేదే’ అంటూ పెదవి విరుస్తారు. వంట గదిలో తాజా కన్పించే పండ్లు, కూరగాయలు, తినుబండారాల చిత్రాలను వేలాడదీయాలి. ఆహార పదార్థాలకు ఉండాల్సిన తాజాదనాన్ని ఎప్పడూ గుర్తు చేస్తుంటుంది కూడా. ముందు గదిలోనయితే ప్రకృతి చిత్రాలు, పడకగదిలో ఊహా చిత్రాలు, పిల్లల గదుల్లో జంతువుల, పక్షుల చిత్రాలు, వృద్ధులు ఉండే గదుల్లో ఆధ్యాత్మికత చిత్రాలు వేలాడదీయవచ్చు.
► కార్యాలయాల్లో అతిథులు వేచి ఉండే చోట చూడగానే వెంటనే అర్థంకాని చిత్రాలను అంటే మోడరన్ ఆర్ట్‌ను ఎంపిక చేసుకోవచ్చు. వాటిని చూసీ చూడకముందే ఆ కార్యాలయ నిర్వాహకుడిపై అతిథులు ఒక అంచనాకు రాకూడదన్నమాట. అధునాతన చిత్రాన్ని అర్థం చేసుకునే పనిలో అతిథి మునిగిపోతే విసుగు పుట్టకుండా కాలం వెళ్లదీసే అవకాశం ఉంటుంది. కార్యాలయ గోడలకు వేలాడుతున్న మోడరన్ ఆర్ట్‌కు ఇచ్చేంత గౌరవాన్ని దానికి సంబంధించిన వారు కూడా అతిథుల నుంచి అందుకుంటారు.
► సున్నితమైన రంగులయితే మానసిక ప్రశాంతత కలగజేస్తాయి. ముదురు రంగులు మనసును అల్లకల్లోలం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రంగుల్లోనూ తెలుపు, నీలం, చిలకాకుపచ్చ, పసుపు రంగులు మృదువుగా కనిపిస్తాయి. ఎరుపు, ముదురు ఆకుపచ ్చ, నలుపు రంగులు కంటిని సైతం బెదరగొడతాయి. తేలికపాటి రంగులను ఎంపిక చేసుకోవడ మంచిదేగానీ, గోడ రంగులో చిత్రాలు కలసి కనపడకుండాపోయే ప్రమాదం ఉంటుంది.