చిన్నారులకు దారి దొరికింది
♦ చైల్డ్‌లైన్ సంస్థ సహకారంతో
♦ ముగ్గురు అమ్మాయిలకు హోంలో ఆశ్రయం
♦ ఆడ పిల్లలను సాకలేక పారిపోయిన తండ్రి
♦ తండ్రిని వెతికే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన తల్లి
పటాన్చెరు టౌన్: హమ్మయ్య.. ఓ ముగ్గురు చిన్నారులకు దారి దొరికింది. ఆడపిల్లలై పుట్టిన పాపానికి రోడ్డున పడ్డారు. మూడు పూటలు తిండిపెట్టి, చదివించే వారు లేక అల్లాడిపోయారు. కన్నతండ్రి పారిపోగా.. తండ్రిని వెతికే క్రమంలో రోడ్డు ప్రమాదంలో కన్నతల్లి ప్రాణాలు విడిచింది. అనాథలుగా మారిన వీరు అమ్మమ్మ చెంతకు చేరారు. ఆర్థిక పరిస్థితి, అనారోగ్యం కారణంగా ఆమె వారిని సాకలేకపోయింది. ఈ క్రమంలో స్థానికుల సహకారం, కార్పెడ్-చైల్డ్‌లైన్ కృషితో చిన్నారులు ఎట్టకేలకు ఓ ఆశ్రమానికి చేరుకున్నారు.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ఎన్కతల గ్రామానికి చెందిన సురేశ్, రేఖ దంపతులకు తేజశ్రీ(9), నవ్వశ్రీ(7), కృతిక(5) సంతానం. ఈ ముగ్గురు ఆడపిల్లలను పోషించడం తన వల్ల కాదంటూ తండ్రి సురేశ్ గత ఏడాది ఇంటి నుంచి పారిపోయాడు. చిన్నారుల తల్లి రేఖ తన తండ్రి రమేశ్‌తో కలసి సురేశ్ కోసం వెతికే పనిలో పడింది. ఈ క్రమంలో రేఖ, ఆమె తండ్రి రమేశ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటి నుంచి ఈ ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారి.. మెదక్ జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌లోని వారి అమ్మమ్మ రూపమ్మ వద్దకు చేరారు.
ఆర్థిక పరిస్థితి, అనారోగ్యం, వయోభారం వంటి కారణాలతో రూపమ్మ తన మనవరాళ్లను పోషించలేకపోతుంది. ఆమె పరిస్థితిని గమనించిన స్థానికులు శ్రీను, రాజగోపాల్ విషయాన్ని.. సంగారెడ్డిలోని మహిళా శిశుసంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్ లైన్ సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సంస్థ డెరైక్టర్ ఎంఎస్ చంద్ర మూడు రోజుల క్రితం తన సిబ్బందిని ఇస్నాపూర్ పంపించారు. ఆ కుటుంబ పరిస్థితిని గమనించి సీడబ్ల్యూసీ సభ్యుల దృషి ్టకి తీసుకెళ్లారు. వాస్తవ పరిస్థితిని గమనించిన సంస్థ ప్రతినిధులు ఆ చిన్నారులను మంగళవారం అమీన్‌పూర్‌లోని మహిమ మినిస్ట్రీస్ హోంలో చేర్పించారు.