Caitanya Krsna
-
ఈ చందమామ కథలు ఓ గొప్ప అనుభవం
‘‘చందమామ కథలంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది. ఆమె ఆప్యాయతకు గుర్తుగా ఈ సినిమాకు ‘చందమామ కథలు’ అనే టైటిల్ పెట్టాను. ఈ కథకు ఈ టైటిల్ కంటే గొప్ప టైటిల్ నాకు దొరకలేదు’’ అని ప్రవీణ్ సత్తారు అన్నారు. ఆయన దర్శకత్వంలో మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి చాణక్య బూనేటి నిర్మాత. చైతన్యకృష్ణ, నరేష్, అమని, కృష్ణుడు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం విశేషాలు తెలుపడానికి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రవీణ్ సత్తార్ ఇంకా చెబుతూ -‘‘మనిషికి జీవితానికి మించిన పాఠం వేరొకటి ఉండదు. అలా ఓ వ్యక్తి జీవితంలో ఎదురైన అనుభవాలు, ఫలితాలు, పర్యవసానాల సమాహారమే ఈ సినిమా. కథనం ప్రధానంగా సినిమా సాగుతుంది. ఇందులో మరో ముఖ్య సూత్రధారి ఉన్నారు. త్వరలోనే ఆయన ఎవరో రివీల్ చే స్తాం. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని, పాటల్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఇప్పటివరకూ తాను చేసిన పాత్రలకు 360 డిగ్రీల తేడా ఉన్న పాత్రను ఇందులో చేశానని, అద్భుతమైన వాణిజ్య విలువలు ఉన్న ఈ సినిమా తనకో గొప్ప అనుభవమని మంచు లక్ష్మి చెప్పారు. కథకు తగ్గట్టుగా మంచి టైటిల్ పెట్టిన దర్శకుణ్ణి అభినందిస్తున్నానని నరేష్ అన్నారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు. -
అందుకే ‘కాళిచరణ్’కు ఓకే చెప్పాను
‘‘కె.భాగ్యరాజా నా గురువు. ఆయన రూపొందించిన ‘సిద్దూ ప్లస్ 2’ చిత్రం ద్వారానే నేను కథానాయికగా పరిచయమయ్యాను. భాగ్యరాజాగారి వద్ద నుంచి నటనలో ఎన్నో మెళకువలు నేర్చుకున్నాను’’ అని చాందిని తమిళరాసన్ అన్నారు. ‘కాళిచరణ్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారీమె. చైతన్యకృష్ణ కథానాయకునిగా శ్రీప్రవీణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా చాందిని విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘‘తొలి సినిమా చేశాక... డిగ్రీ పూర్తి చేసే నిమిత్తం నటనకు కొంత విరామం ఇచ్చాను. ఓ తమిళ పత్రిక కవర్‌పేజీపై నా స్టిల్ చూసి శ్రీప్రవీణ్ నన్ను సంప్రదించారు. నటనకు మంచి అస్కారమున్న పాత్ర కావడంతో వెంటనే ‘కాళిచరణ్’కు అంగీకారం తెలిపాను. ఇందులో నా పాత్ర పేరు తీర్థ. బ్రాహ్మణ యువతి పాత్ర. లుక్ పరంగా కాస్త డీ గ్లామరైజ్డ్గా ఉంటాను. ఈ పాత్ర కోసం నా శారీరకభాషను కూడా మార్చుకున్నాను. నాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది’’ అని చెప్పారు. శ్రీదేవి, జ్యోతికలు నటిగా తనకు స్ఫూర్తి అని, తాను పవన్‌కల్యాణ్ వీరాభిమానినని చాందిని చెప్పారు. -
తహసిల్దార్ ఇబ్బందులు
1980ల నాటి కథాంశంతో నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ తెరకెక్కిన చిత్రం ‘కాళీచరణ్’. చైతన్యకృష్ణ, చాందిని జంటగా నటించారు. రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడు శ్రీ ప్రవీణ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీప్రవీణ్ మాట్లాడుతూ -‘‘ప్రచార చిత్రాలు విడుదలైనప్పట్నుంచీ ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ మొదలైంది. ఆరు నెలలు కోర్టులో, మూడు నెలలు సెన్సార్ బోర్డ్‌లో ఉండిపోయిందీ సినిమా. ఎట్టకేలకు గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల కానుంది. ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని నా విశ్వాసం’’ అన్నారు. నిజాయితీగా విధులను నిర్వర్తించే ఓ తహసిల్దార్... సమాజంలో ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడో ఈ చిత్రం కళ్లకు కడుతుందని నాగినీడు చెప్పారు. పక్కా కమర్షియల్ అంశాలున్న సినిమా ఇదని చైతన్యకృష్ణ తెలిపారు. ఇంకా సంగీత దర్శకుడు నందన్‌రాజ్, ఎడిటర్ ప్రవీణ్‌పూడి కూడా మాట్లాడారు.