అధికారులా...మాకో లెక్కా?
పభుత్వ హెచ్చరిక బోర్డులు విరిచి, పాక వేసి
దర్జాగా చెరువు గర్భం దున్నిన వైనం
పెట్రేగుతున్న ఆక్రమణదారులుఆయకట్టు రైతుల కలవరం
ఆ చెరువు ఆయకట్టు రైతుల అమాయకత్వమో, రెవెన్యూ సిబ్బంది మెతక వైఖరో తెలియదు గానీ అప్పలమ్మపాలెం, కుముందానిపేట గ్రామాల్లోని ఆక్రమణదారులు పేట్రేగిపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు మూడోసారి అధికారుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ దర్జాగా చెరువు గర్భాన్ని దున్నేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సాక్షాత్తూ తహశీల్దార్ వేయించిన హెచ్చరిక బోర్డు పీకిపారేసి అదే స్థలంలో మరలా పెద్దపాక వేసేశారు. అంతేకాదు...చెరువునీరు అడ్డంగా ఉందన్నట్టుగా గట్టు తెగనరికి నీటిని వదిలేశారు. వివరాలివి.
రావికమతం: మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏటా జరుగుతున్న ఈ దౌర్జన్యంపై సదరు చెరువు ఆయకట్టు రైతులు మడకా సత్యారావు, మదుమంతి శ్రీను, రాజాన అప్పారావు, చల్లపురెడ్డి అప్పారావు, మడకా శ్రీను, అప్పారావు, మిరియాల గోవింద, నాగేశ్వరరావు తదితర 40 మంది రైతు లు ఏటా అధికారులకు, ప్రజా ప్రతినిధులకూ మొరపెట్టుకుంటున్నారు. వారు తూతూ మంత్రంగా ఏవో చర్యలు చేపడుతున్నారు. మళ్లీ ఏడాది పరిస్థితి షరామామూలే. అప్పలమ్మపాలెం గ్రామానికి చెందిన సర్వే నెంబరు 196, 235 లో నల్లకొండమ్మతల్లి చెరువు ఉంది.
ఆ చెరువు గర్భం ఆరెకరాలు, కాగా మరో రెండెకరాలను సమీప ఆయకట్టు రైతులు వేరొక రైతు నుంచి కొనుగోలు చేసి చెరువుకు కేటాయించేశారు. కాగా గ్రామంతో పాటు, కుముందానిపేట, గదబపాలెం గ్రామాలకు చెందిన పోతల నర్సింగరావు, ఇంగళపు పేరయ్య, శ్రీను, కటారి సత్తిబాబు, శలాది సత్తిబాబు, మారబోయిన చిన్నలు చెరువు గర్భంతో పాటు తాము కొనుగోలు చేసి చెరువుకు కేటాయించిన భూమిని సైతం ఆక్రమించి దున్నేసారని రైతులు ఆరోపిస్తున్నారు.
గతంలో చెరువు దున్ని, పాకలు వేసి, గట్టు నరికినందుకు కలెక్టర్‌కు, తహశీల్దార్‌కు ఫిర్యాదు చేయగా వాటన్నిం టినీ తొలగించి, వారిపై కేసులు కూడా నమోదు చేశారన్నారు. మళ్లీ గట్టు నరికేయడంతో పాటు చెరువులో పాకలు వేసేసారని, చెరువు మొత్తం దున్నేశారని ఆయకట్టురైతులు వాపోయారు. ఆ చెరువుకు గతంలో పని కి ఆహార పథకంలో రూ. 2లక్షలతోనూ, ఉపాధి హామీ పథకంలో రూ.4 లక్షల యాభైవేల వ్యయంతోనూ పనులు చేపట్టామని, ఇపుడు ఆయా బంటాలు కూడా ఆక్రమణదారులు కలియ దున్నేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
దొంగ పాసుపుస్తకమే కారణమా?
గతంలో ఆక్రమణదారులు ఆ చెరువుకు రెండు కిలోమీటర్ల దూరంలోని 237, 240 సర్వే నంబర్లుతో పాసు పుస్తకాలు చేయించి వాటిని ఆధారంగా చూపుతూ ఈ చెరువును దున్నేస్తున్నారని రైతులు ఆరోపించారు. దీనిపై గత ఏడాది మండల సర్వేయర్ సర్వేలో రుజువైంది. ఆ సర్వే ఆధారంగా చర్యలు కూడా తీసుకున్నారు.
రావిచెరువు కూడా : దీనితో పాటే అప్పలమ్మపాలెం రావిచెరువును కూడా ఆ గ్రామానికి చెందిన మరికొంత మంది రైతులు శనివారం సాయంత్రం దున్నేశారు. అయితే ఎవరు దున్నినదీ ఇంకా తెలియరావడం లేదని ఆ ఆయకట్టు రైతులు తెలిపారు. దీనిపై వీఆర్వో శ్రీనుకు ఫిర్యాదు చేసామని, సోమవారం కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్తున్నట్టు తెలిపారు. కాగా ఈ విషయమై ఆర్ఐ గంగరాజును సాక్షి సంప్రదించగా చెరువును మళ్లీ దున్నేసిన వైనం తమ దృష్టికి వచ్చిందన్నారు. తహశీల్దార్ భాస్కరరావుకు తెలియజేశామన్నారు. ఆక్రమణ దారులపై నోటీసులు కూడా సిద్ధమయ్యాయన్నారు. వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.