క్యాంపస్ అంబాసిడర్స్
ఐఐటీ - మద్రాస్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - మద్రాస్.. పరిచయం అక్కర్లేని విద్యా సంస్థ. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ఐఐటీ. ఇక్కడ దేశంలోనే ఎక్కువమంది తెలుగు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ వంటి కోర్సులకే పరిమితం కాకుండా ఎంఏ, ఎంఎస్సీ వంటి కోర్సులను అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ సెకండియర్ చదువుతున్న బి.అఖిల్ సాయి తన క్యాంపస్ ముచ్చట్లను మనతో పంచుకుంటున్నారిలా..
తెలుగు విద్యార్థులే ఎక్కువ
మాది హైదరాబాద్. ఐఐటీ - మద్రాస్‌లో దాదాపు 2000 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఇన్స్టిట్యూట్ తమిళనాడులోనే ఉన్నా.. తమిళ విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ. ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. ఐదారు క్యాంటీన్లున్నాయి. అన్ని రకాల ఆహార పదార్థాలు లభిస్తాయి. ఆన్లైన్లోనే నచ్చిన మెస్‌ను ఎంచుకోవచ్చు. అయితే ఆహారం అంత రుచిగా అనిపించదు. క్యాంపస్‌లో జీవ సంరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. 250 జింకలు, వందల్లో బ్లాక్‌బక్స్, ఇంకా ఎన్నో రకాల పక్షుల కిలకిలరావాలతో క్యాంపస్ అలరారుతూ ఉంటుంది. ర్యాగింగ్ అసలు లేదు. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ఎప్పుడూ క్యాంపస్‌లో తిరుగుతుంటుంది.
ఆధునిక పద్ధతుల్లో బోధన
సాధారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు క్లాసులుంటాయి. ప్రతి సోమవారం ప్రాక్టికల్స్ ఉంటాయి. ఫ్యాకల్టీ చాలా బాగా బోధిస్తారు. అవసరమైతే ప్రొజెక్టర్, వీడియో కాన్ఫరెన్స్ వంటి అత్యాధునిక సదుపాయాలు వినియోగిస్తారు. రీసెర్చ్ చేస్తూ పాఠాలు చెప్తారు. ఫ్యాకల్టీకి జాతీయస్థాయిలో అవార్డులు కూడా వచ్చాయి. ఐఐటీలు, ఐఐఎస్సీ ప్రవేశపెట్టిన ఎన్పీటీఈఎల్ (నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్సడ్ లెర్నింగ్) ద్వారా వివిధ అంశాలపై ఆన్లైన్ కోర్సులు చేసే సదుపాయం ఉంది.
ఇందుకోసం ప్రతి ఒక్క విద్యార్థికీ యూజర్‌నేమ్, పాస్వర్డ్ కేటాయిస్తారు. ఈ ఆన్లైన్ కోర్సులను ఉచితంగా చేయొచ్చు. టీచింగ్ అసిస్టెంట్స్ కూడా ఉంటారు. వీరు కూడా విద్యార్థులకు వివిధ అంశాల్లో సహాయసహకారాలు అందిస్తారు. ఏడాదికి రెండు సెమిస్టర్లు ఉంటాయి. ప్రతి సెమిస్టర్‌కు 85 శాతం హాజరు తప్పనిసరి. ప్రతి సెమిస్టర్‌కు క్విజ్-1, క్విజ్-2, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. బ్రాంచ్‌ను బట్టి సెమిస్టర్‌కు 24 క్రెడిట్స్ వరకు ఉంటాయి.
సౌకర్యాలు అత్యుత్తమం
ప్రతి శనివారం, ఆదివారం సెలవు ఉంటుంది. క్యాంపస్‌లో ఉన్న ఓపెన్ ఎయిర్ థియేటర్లో ప్రతివారం ఒక సినిమా ప్రదర్శిస్తారు. ఎక్కువగా ఇంగ్లిష్, హిందీ సినిమాలు చూస్తాం. సెమిస్టర్‌కు ఒకటి రెండుసార్లు తెలుగు సినిమాలు వేస్తారు. ఈ థియేటర్లో 2000 మంది వరకు కూర్చునే సదుపాయం ఉంటుంది. ఇంకా ఆడిటోరియం, తరగతి గదులు, హాస్టల్స్, లైబర్రీ, లేబొరేటరీలు, క్రీడా మైదానాలు అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి.
దక్షిణ భారతదేశంలోనే పెద్దది
ప్రతి ఏటా జనవరిలో టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్ నిర్వహిస్తారు. టెక్‌ఫెస్ట్‌లో భాగంగా రోబో ఫెస్ట్, వర్క్‌షాప్స్, కోడింగ్ వర్క్‌షాప్స్ మొదలైన కార్యక్రమాలు ఉంటాయి. ప్రముఖ పరిశోధన సంస్థలు, విద్యా సంస్థల నుంచి శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు హాజరవుతారు. ఇక కల్చరల్ ఫెస్ట్‌ను సౌతిండియాలోనే పెద్దదిగా చెప్పొచ్చు. ఇది ఐదురోజులపాటు జరుగుతుంది. ప్రఖ్యాత మ్యూజిక్ బాండ్ గ్రూపులను తీసుకొస్తారు. సినీ, క్రీడా రంగాలకు చెందినవారిని కూడా ఆహ్వానిస్తారు.
పరిశోధనలకు ప్రోత్సాహం ఎంతో
ఇక్కడ పరిశోధనల దిశగా అడుగులు వేయాలనుకునే విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహం లభిస్తోంది. భారీ విస్తీర్ణంలో రీసెర్చ్ పార్క్ ఉంది. సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ కూడా కొలువుదీరింది. స్టార్టప్స్ దిశగా నడవాలనుకునే విద్యార్థులు తమ ఆలోచనలను వివరించి సూచనలు, సలహాలు, ఫండింగ్ పొందొచ్చు. ఇన్నోవేషన్ కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులు.. చెన్నై నగరం ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపారు. దీని ప్రకారం.. ఏ రోడ్లలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది? ఏ రోడ్లలో ట్రాఫిక్ తక్కువ ఉంది? ఏ రోడ్డు ద్వారా సులువుగా వెళ్లొచ్చు.. ఇలా ప్రజలకు శాటిలైట్ ద్వారా సమాచారం అందుతుంది. దీన్ని త్వరలో అమలు చేయనున్నారు. ఇంకా ఇక్కడ విద్యార్థులు చేసే పరిశోధనలకు పేటెంట్స్ కూడా లభిస్తున్నాయి. పూర్వ విద్యార్థులు కూడా వివిధ అంశాల్లో విద్యార్థులకు సహాయాన్ని అందిస్తున్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పొందిన విద్యార్థులకు కనీసం ఏడాదికి రూ.5.5 లక్షలు, గరిష్టం రూ.1.3 కోట్లు లభిస్తున్నాయి. నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి విదేశాల్లో ఎంఎస్ చేయాలనుకుంటున్నా.
ఎన్ఐటీ - తిరుచ్చి
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - తిరుచ్చి.. ఇంజనీరింగ్ కోర్సులను అందించడంలో దక్షిణ భారతదేశంలోనే టాప్-5 విద్యా సంస్థల్లో ఒకటిగా నిలుస్తోంది.త్రిచీ, తిరుచిరాపల్లి వంటి పేర్లతో కావేరీ నదీ ప్రవాహ హోయలతో అలరారుతోంది. ఎన్ఐటీ- తిరుచ్చిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బీటెక్ మూడో ఏడాది చదువుతున్న జి.శివరామ్ క్యాంపస్ లైఫ్‌ను వివరిస్తున్నారిలా..
క్యాంపస్ అంతా వై-ఫై
క్యాంపస్‌లో ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. హాస్టల్ కామన్ రూమ్‌లో భాగంగా టీవీ, పత్రికలు, మ్యాగజైన్లు అందుబాటులో ఉంటాయి. క్యాంటీన్లో ఫుడ్ బాగుంటుంది. క్యాంపస్ అంతా వై-ఫై ఉంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 వరకు తరగతులు నిర్వహిస్తారు. వారంలో రెండు రోజుల ల్యాబ్ వర్క్. సెమిస్టర్లో 8 సబ్జెక్టులు ఉంటాయి. సెమిస్టర్‌ను బట్టి సబ్జెక్టులు మారుతుంటాయి. నేను ఇప్పటివరకు 10కు 8.3 సీజీపీఏ సాధించాను.
స్మార్ట క్లాసెస్
మన తెలుగు విద్యార్థులు దాదాపు 200 మంది వరకు ఉన్నారు. ఫ్యాకల్టీ చాలా బాగా బోధిస్తారు. స్మార్ట్ క్లాసెస్, ఆన్లైన్ లెక్చర్లు ఉంటాయి. ఆన్లైన్లో మెటీరియల్ పొందే సౌలభ్యం ఉంది. ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేస్తారు. ఇండస్ట్రీ ఓరియెంటేషన్‌తో క్లాసులు నిర్వహిస్తారు. సబ్జెక్టుపరమైన సందేహాలు వస్తే ఎప్పుడైనా ఫ్యాకల్టీని సంప్రదించే వీలు ఉంది. ఎంటెక్, పీహెచ్డీ స్టూడెంట్స్ కూడా వివిధ అంశాల్లో సహాయమందిస్తారు.
మన పండుగలు బాగా చేస్తాం
ప్రతి ఏటా క్యాంపస్‌లో టెక్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్ నిర్వహిస్తారు. టెక్నికల్ ఫెస్ట్‌లో రోబోటిక్స్ పోటీలు, ఐడియా కాంపిటీషన్స్ ఉంటాయి. ఈ కార్యక్రమాలకు దేశవిదేశాల నుంచి వివిధ అంశాల్లో నిష్ణాతులు హాజరవుతారు. కల్చరల్ ఫెస్ట్‌లో భాగంగా పాటలు, డ్యాన్సులు, నాటకాలు, చిన్నచిన్న స్కిట్స్ ఉంటాయి. క్యాంపస్‌లో అన్ని రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. ఎవరి రాష్ట్ర పండుగలను వారు ఘనంగా నిర్వహిస్తారు. మేము ఉగాది, సంక్రాంతి, దీపావళి, వినాయకచవితి వంటి పండుగలను బాగా చేస్తాం.
విదేశాల్లో ఎంఎస్ చేస్తా
క్యాంపస్‌లో ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. భావి వ్యాపార వేత్తలను తీర్చిదిద్దడానికి దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వర్క్‌షాప్స్ జరుగుతుంటాయి. నేను ప్రస్తుతం శాంసంగ్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నా. ఇది రెండునెలలపాటు ఉంటుంది. స్టైఫండ్ కూడా ఇస్తారు. కోర్సు పూర్తయ్యాక క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సాధించి రెండేళ్లు ఉద్యోగం చేస్తా. తర్వాత విదేశాల్లో ఎంఎస్ చదువుతా.
బిట్స్ పిలానీ
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (బిట్స్) - పిలానీ.. ఇంజనీరింగ్ కోర్సులను అందించే ప్రైవేటు ఇన్స్టిట్యూట్లలో దేశంలోనే నెంబర్‌వన్. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో బీటెక్ సెకండియర్ చదువుతున్నారు పి.వినయ్‌కుమార్ రెడ్డి. ఎడ్యుకేషన్, పరిశోధనలకు ఇచ్చే ప్రోత్సాహం చాలా బాగుందని తెలిసి బిట్స్‌లో చేరానంటున్న ఆయన తన క్యాంపస్ కబుర్లను చెబుతున్నారిలా..
ఇక్కడే బాగుంది
ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ విద్యార్థులకు బిట్స్‌లో మంచి ప్లేస్‌మెంట్స్ ఉంటాయని తెలుసుకున్నా. దాంతో ఇక్కడ చేరా. క్యాంపస్‌లో 200 మంది వరకు తెలుగు విద్యార్థులు ఉన్నారు. ప్రవేశం పొందిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. దక్షిణ భారత వంటకాలన్నీ క్యాంటీన్లో లభిస్తాయి. సాధారణంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు క్లాసులు ఉంటాయి. లెక్చర్ సెషన్, ట్యుటోరియల్ సెషన్లలో.. లెక్చర్ సెషన్లో సంబంధిత సబ్జెక్టు థియరీని బోధిస్తారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, ప్రొజెక్టర్ వంటి అత్యాధునిక విధానాలను వినియోగిస్తారు.
ట్యుటోరియల్ సెషన్ అంతా
ప్రాబ్లమ్ సాల్వ్డ్గా ఉంటుంది. ప్రస్తుతం ఎదురవుతున్న వివిధ సమస్యలను పరిష్కరించే దిశగా శిక్షణనిస్తారు. వారంలో లెక్చర్, ట్యుటోరియల్, ప్రాక్టికల్స్ కలిపి 29 క్లాసులుంటాయి. ఇంజనీరింగ్ సబ్జెక్టులతోపాటే హ్యుమానిటీస్‌ను కూడా తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ఇంకా ఆన్లైన్లో కోర్సెరా, ఎడెక్స్ వంటివాటి ద్వారా కోర్సులు అభ్యసిస్తాం. ప్రతి సెమిస్టర్లో మిడ్ సెమిస్టర్, కాంప్రహెన్సివ్ ఎగ్జామ్స్ ఉంటాయి.
మెరిట్ స్కాలర్షిప్స్
క్యాంపస్‌లో పుట్‌బాల్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటివి ఆడుకోవడానికి క్రీడా మైదానాలున్నాయి. ఓపెన్ ఆడిటోరియం, జిమ్‌లు, ప్రపంచంలోనే అన్ని జర్నల్స్‌తో కూడిన లైబ్రరీ, పరిశోధనాలయాలతో క్యాంపస్ విరాజిల్లుతోంది. ఇంకా ఆయా బ్రాంచ్‌ల డిపార్ట్మెంట్లు, క్లబ్‌ల ద్వారా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతిభావంతులకు మెరిట్ స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయి.
ముగ్గుల పోటీలు పెడతాం
రీజినల్ కమిటీ ఆధ్వర్యంలో తెలుగువాళ్లమంతా కలిసి మన తెలుగు పండుగలను వైభవంగా నిర్వహిస్తాం. సంక్రాంతికి ముగ్గులేయడం, గాలిపటాలు ఎగరేయడం వంటి పోటీలు పెడతాం. ఇంకా ఉగాది, వినాయకచవితి వంటి పండుగలను బాగా చేస్తాం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్ ఆధ్వరంలో స్టార్టప్స్‌కు ఎంతో ప్రోత్సాహమందిస్తున్నారు. కొత్త స్టార్టప్స్ ఏర్పాటు చేయాలనుకునేవారు తమ ఆలోచన వివరించి సూచనలు, సలహాలు పొందొచ్చు. కంపెనీల హెడ్లు, మేనేజర్లు క్యాంపస్‌ను సందర్శిస్తుంటారు. వారికి ఆలోచన నచ్చితే ఫండింగ్ చేస్తారు. నేను కోర్సు పూర్తయ్యాక విదేశాల్లో ఎంఎస్ చేయాలనుకుంటున్నా.
మీరూ పంపండి!
కొత్త ఆశలతో మీరు ఇప్పటికే ఏదో ఒక కళాశాలలో చేరి ఉంటారు. ఇందుకోసం మీరు ఎంతో కష్టపడి ఉండొచ్చు. చాలామంది విద్యార్థులకు కోరుకున్న కోర్సులో ప్రవేశించడం ఎలా? ఎలాంటి కాలేజీలో చేరాలి? ఇలా ఎన్నో సందేహాలు. వీరంతా మీలాంటివారి అనుభవాలు తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు. మీ క్యాంపస్ ప్రత్యేకతలు, ఫెస్ట్‌లు, కల్చరల్ ప్రోగ్రామ్స్ వంటి వాటిని మా ద్వారా మీ తోటి విద్యార్థులతో పంచుకోండి.మీ వివరాలను ఈ-మెయిల్ చేయండి.
sakshi.ambsdr@gmail.com