కాప్రా చెరువుపై చర్యలేవీ?
► హెచ్ఎండీఏ కమిషనర్‌ను ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్, సైనిక్‌పురి పరిధిలోని కాప్రా చెరువులో మురుగు నీరు కలవకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కమిషనర్ చిరంజీవులును ఆదేశించింది. పూర్తి వివరాలతో ఓ నివేదికను తమ ముందుంచాలని సూచించింది. తదుపరి విచారణను అక్టోబర్ 3కి వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కాప్రా చెరువు కలుషితమవుతోందని, మురుగునీరు కలవకుండా తగిన చర్యలు తీసుకొనేలా చూడాలని సికింద్రాబాద్ లేక్‌వ్యూ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి గత ఏడాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది.
కాప్రా చెరువు కలుషితం కాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో వివ రించాలని ధర్మాసనం గతంలో హెచ్ఎండీఏ కమిషనర్‌ను ఆదేశించింది. నివేదిక ఇవ్వకపోవడంతో కమిషనర్ వ్యక్తిగత హాజరుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగ ళవారం కమిషనర్ చిరంజీవులు కోర్టు ముందు హాజరయ్యారు. పలుమార్లు కోరినా నివేదిక ఇవ్వకపోవడంపై ధర్మాసనం అసంతప్తి వ్యక్తం చేసింది. చెరువుల పరిరక్షణకు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలు సమన్వయంతో పనిచేయాలని సూచించింది.