భూసేకరణ చేపట్టాలి
అధికారులకు కలెక్టర్ విజయకుమార్ ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటుకు జిల్లాలో భూసేకరణ చేపట్టాలని, ఆ మేరకు ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయని కలెక్టర్ విజయకుమార్ వెల్లడించారు. జిల్లాలో కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటుకు అనువైన భూమిని పరిశీలించి త్వరితగతిన నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర విద్యాసంస్థలు, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రకాశం భవనంలోని తన చాంబర్లో బుధవారం అధికారులతో ఆయన సమీక్షించారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)కి 300 ఎకరాలు అవసరమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. టంగుటూరు, కొండపి, జరుగుమల్లి మండలాల్లో ఆ భూమిని సేకరించేందుకు పరిశీలించాలని సూచించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)కు 200 ఎకరాలు అవసరమవుతుందని, ఆ భూమిని పొదిలి, దర్శి ప్రాంతాల్లో సేకరించేందుకు పరిశీలించాలని చెప్పారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)కు మరో 200 ఎకరాలు అవసరమవుతుందని, దీనికోసం త్రిపురాంతకంలో భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి కూడా 300 ఎకరాల భూమి అవసరమని, దీనికోసం ఒంగోలు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లోని భూమిని పరిశీలించాలని కోరారు. అదే విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)కి 200 ఎకరాలు అవసరం అవుతుందని, దర్శి, దొనకొండ ప్రాంతాల్లో ఆ భూమిని పరిశీలించాలని ఆదేశించారు.
జిల్లాలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటులో భాగంగా కనిగిరి నియోజకవర్గంలోని సీఎస్ పురంలో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు 7,500 ఎకరాల భూ సేకరణను పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే యాకూబ్‌నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, సర్వే అండ్ ల్యాండ్ ఏడీ కే నరసింహారావు, కందుకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి టీ బాపిరెడ్డి, వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.కొండయ్య తదితరులు పాల్గొన్నారు.