నేడు భద్రాచలం డివిజన్ బంద్
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్ : భద్రాచలం డివిజన్‌ను తెలంగాణ నుంచి విడదీయొద్దంటూ అఖిలపక్షం, టీజేఏసీ ఆధ్వర్యంలో సోమవారం భారీ ఎత్తున ఆందోళన చేపట్టనున్నారు. డివిజన్ బంద్‌కు పిలుపునిచ్చారు. డివిజన్ వ్యాప్తంగా ప్రధాన రహదారులన్నీ దిగ్బంధం చేయనున్నారు. కొందరు సీమాంధ్ర పెట్టుబడిదారుల స్వప్రయోజనాల కోసమే భద్రాద్రిని ఆంధ్రలో విలీనం చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చిందని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని టీజేఏసీ డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు ‘న్యూస్‌లైన్’తో అన్నారు. బంద్ సందర్భంగా డివిజన్ ప్రధాన రహదారులన్నీ మూసివేసి వాహనాలు రాకుండా అడ్డుకుంటామని, వ్యాపార, వాణిజ్య సంస్థల బంద్‌కు పిలుపునిచ్చామని చెప్పారు. ఆటో డ్రైవర్లకు కూడా తమకు మద్దతు ఇచ్చారని తెలిపారు.
ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల మద్దతు
భద్రాచలం డివిజన్ బంద్‌కు పలు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. బీఎస్పీ, టీఆర్ఎస్వీ, మాలమహానాడు, నాయీబ్రాహ్మణ సంఘం, బీసీ సంఘం, రజక సంఘం, గిరిజన సంఘం, నంగారాభేరి తమ మద్దతును ప్రకటించాయి.