పంట.. మంట
రైతు కంట్లో కారం
– నకిలీ మిరప విత్తనాలతో నిలువునా మోసం
– వేలాది ఎకరాల్లో గిడసబారిన పైరు
– ఐదు మాసాల పంటను దున్నేస్తున్న దయనీయం
– రూ.90 కోట్లకు పైగా నష్టం
- పత్తాలేని ఉద్యాన శాఖ అధికారులు
రూ.5 లక్షలకు పైగా నష్టం
ఎకరాకు రూ.40వేల మునుగుత్త ఇచ్చి 5 ఎకరాల్లో మిరప సాగు చేసినా. ఐదెకరాల గుత్త రూ.2లక్షలు.. విత్తనాలకు రూ.లక్ష.. సేద్యాలు, కూలీలు, నీళ్ల మందు, ఎరువులకు కలిపి మొత్తం రూ.5లక్షల వరకు ఖర్చు వచ్చింది. విత్తనాలు అమ్మేటప్పుడు ఏందేందో సెప్పినారు. ఇప్పుడేమో పంట పూర్తిగా దెబ్బతినింది. పైసా కూడా చేతికి అందకపాయ. పంటంతా పీకేసి మినుమన్నా వేద్దామని టిల్లరు కొట్టించినా.
- పత్తి బాలశంకర్, ఆలమూరు
ఆళ్లగడ్డ: రెండేళ్లుగా మిర్చి ధరలో పెరుగుదల ఉండటంతో రైతుల దృష్టి ఈ పంట వైపు మళ్లింది. ఇదే అదనుగా ఈ ఏడాది మిరప విత్తనాలకూ గిరాకీ ఏర్పడింది. అన్నదాత అమాయత్వం.. అవసరాన్ని ఆసరా చేసుకున్న విత్తన కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు.. దళారులు బహిరంగ మార్కెట్‌ను నకిలీ, నాణ్యత లేని విత్తనాలతో ముంచెత్తారు. ఆ ప్రభావం ఐదారు నెలల తర్వాత బయట పడటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. బెట్టను తట్టుకుంటుందని ఒకరు.. కొత్త రకం అధిక దిగుబడిని ఇస్తుందని మరొకరు.. విదేశీ టెక్నాలజీ కావడంతో మందులు, ఎరువుల అవసరం ఉండదని ఇంకొకరు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధమైన ప్రచారంతో రైతులకు విత్తనాలను అంటగట్టారు. సాధారణంగా నారు పోసిన తర్వాత మూడు నెలల నుంచే కాపు వస్తుంది. అయితే ఐదు నెలలు గడుస్తున్నా పూత, పిందె రాకపోవడం రైతులను ఆందోళన కలిగిస్తోంది. మోసపోయామని తెలుసుకుని పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రైతులు విధిలేని పరిస్థితుల్లో పంటను దున్నేస్తున్నారు. 70 శాతం పంట నకిలీ విత్తనాలతోనే నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.90 కోట్లకు పైగా నష్టం
నియోజవర్గంలోని ఆరు మండాల్లో సుమారు 8,500 ఎకరాల్లో మిరప సాగయింది. పొలం దున్ని సాగుకు సిద్ధం చేసినప్పటి నుంచి విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు కలిపి రైతులు ఎకరాకు లక్షకు పైగానే ఖర్చు చేశారు. ఇందులో విత్తనాలకే ఎకరాకు సుమారు రూ.20వేలు వెచ్చించారు. ఈ లెక్కన నియోజకవర్గంలో మిరప సాగు చేసిన రైతులు రూ.90 కోట్లు నష్టపోయినట్లు అంచనా.
పుట్టగొడుగుల్లా విత్తన వ్యాపారులు, నర్సరీలు
విత్తన వ్యాపారులు వందల సంఖ్యలో ఉండటం.. నర్సరీలు సైతం అదే స్థాయిలో ఏర్పాటు కావడం ప్రస్తుత పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. నిబంధనల మేరకు నర్సరీలు కొనుగోలు చేసిన విత్తనాల లాట్ నెంబర్లను రికార్డులో పొందుపర్చాలి. రైతులకు నారు ఇచ్చే సమయంలో ఏ విత్తనాలకు సంబంధించిన నారు ఏయే రైతులకు అమ్ముతున్నారనే విషయాన్ని కచ్చితంగా నమోదు చేయాలి.ఽ అయితే ఇలాంటి ప్రక్రియ ఏదీ జరుగకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. కొందరు దళారులు ఇవి ఇంపోర్టెడ్ అని.. బ్లాకులో తెచ్చానని నమ్మబలుకుతూ రసీదులు లేకుండానే అంటడుతున్నారు. ఫలితంగా అన్నదాత కష్టం మట్టి పాలయింది. నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఉన్నా అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పంటల సాగు.. సస్యరక్షణ.. సలహాలకు పురుగు మందుల డీలర్లు, దళారుల సలహాలపైనే ఆధారపడాల్సి వస్తుండటం గమనార్హం.
వాతావరణం అనుకూలించకే..
విత్తనాలు నాసిరకమా కాదా అనే విషయం సైంటిస్టులు తేలుస్తారు. వాతావరణంలో వచ్చిన మార్పులతోనే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నా. పురుగు మందులు, రసాయన ఎరువులు అధికంగా ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు చేపతాం.
- శ్రీధర్, ఉద్యాన శాఖ అధికారి
మండలం మిరప సాగు విస్తీర్ణం(ఎకరాల్లో..)
ఆళ్లగడ్డ 1,400
రుద్రవరం 2,200
చాగలమర్రి 2,250
శిరివెళ్ల 800
ఉయ్యలవాడ 1,000
దొర్నిపాడు 900