అనుమతి లేకుంటే మూడేళ్లు జైలే!
చెన్నై కలెక్టర్ హెచ్చరిక
టీనగర్: అనుమతి లేకుండా బీచ్‌లో కటౌట్లు ఏర్పాటు చేస్తే మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని చెన్నై జిల్లా కలెక్టర్ తెలిపారు. చెన్నై జిల్లా సమాచార, పౌరసంబంధాల అధికారి విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విధంగా తెలిపారు. చెన్నై బీచ్‌లో కటౌట్లు, ప్రకటన బోర్డులు ముందస్తు అనుమతి లేకుండా ఏర్పాటుచేయకూడదని, ఈ విధంగా ఏర్పాటుచేస్తే శిక్ష విధిస్తామని పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలని మద్రాసు హైకోర్టు 30 మార్చి 2016న తెలియజేసిందని, ఒక వేళ కటౌట్లు, ప్రకటన బోర్డులు ఏర్పాటు చేయదలిస్తే చెన్నై జిల్లా కలెక్టర్ వద్ద ముందస్తు అనుమతి పొందాలని పేర్కొన్నారు.
దీన్ని ఉల్లంఘించినట్లయితే గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని తెలిపారు. కార్పొరేషన్ అధికారులు, పోలీసు అధికారుల సహకారంతో జిల్లా యంత్రాంగం అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన కటౌట్లను, ప్రకటన బోర్డులను తరచుగా తొలగిస్తోందని, ఇవి పాదచారులు నడిచివెళ్లేందుకు ఆటంకంగా పరిణమిస్తున్నట్లు పేర్కొన్నారు.
భవన యజమానులు ఈ విధంగా కటౌట్లు ఏర్పాటుచేసుకునేందుకు అనుమతిస్తున్నారని, అయితే ఆ విధంగా అనుమతించేందుకు వారికి హక్కులేదని తెలిపారు. అదేవిధంగా కొన్ని యాడ్ ఏజన్సీలు అక్రమాల్లో పాలుపంచుకుంటున్నట్లు పేర్కొన్నారు. అందువల్ల జిల్లా కలెక్టర్‌కు మాత్రమే అనుమతించేందుకు హక్కు ఉందన్నారు. నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా వారిపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్రజలు ఇటువంటి అక్రమాలను గమనించినట్లయితే 044-25268323 అనే హెల్ప్‌లైన్‌కు సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని, రాజాజీ రోడ్డులోగల శింగారవేలర్ భవనంలో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని 25268320 అనే ఫోన్ నంబర్‌పై సంప్రదించి తెలియజేయవచ్చని చెన్నై జిల్లా కలెక్టర్ గోవిందరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.