పర్యాటక కేంద్రంగా ఘంటసాల
ఘంటసాల: ఘంటసాలను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ చెప్పారు. అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, కలెక్టర్ బాబు.ఎతో కలిసి శ్రీకాంత్ బౌద్ధారామం, పురావస్తు ప్రదర్శనశాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ ప్రాంతం ప్రసిద్ధి బౌద్ధక్షేత్రంగా విరసిల్లిందన్నారు. నాటి వైభవాన్ని తీసుకొచ్చేందుకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాంత విశిష్టతపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ జీవీ రామకృష్ణతోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో వసతుల కల్పించాలి : కలెక్టర్
ఘంటసాలలో కొత్తగా ఏర్పాటు చేసిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాబు.ఎ సంబంధిత అధికారులను ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాలను శనివారం కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం వసతిగృహంలో కళాశాలను ఏర్పాటుచేయగా విద్యార్థులకు అవసరమైన వసతులను కల్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలోనే ఉత్తమ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలగా తీర్చిదిద్దేందుకు అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. కళాశాలను పరిశీలించిన వారిలో డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, పలువురు అధికారులు కూడా ఉన్నారు.