బాలిక వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
తల్లిదండ్రులకు కౌన్సెలింగ్
గొల్లపల్లి : మండల కేంద్రంలోని కోమళ్ల మల్లయ్య– లచ్చవ్వ దంపతుల కూతురు వివాహాన్ని అధికారులు ఆదివారం అడ్డుకున్నారు. కూలీపనులు చేసుకునే మల్లయ్య అనారోగ్యానికి గురవడంతో పదో తరగతి చదివే తమ కూతురుకు ధర్మపురి మండలానికి చెందిన తమ బంధువు కుమారుడికి ఇచ్చి సోమవారం వివాహం జరిపించాలని నిశ్చయించారు. బాలికకు వివాహం చేస్తున్నారనే సమాచారం అందడంతో ఎస్సై ఉపేందర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ మణెమ్మ ఆదివారం బాలిక ఇంటికి చేరుకున్నారు. మైనారిటీ తీరకుండానే వివాహం చేస్తే బాలిక అనారోగ్యానికి గురవుతుందని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. 18ఏళ్ల వయస్సు నిండే వరకూ ఆమెకు వివాహం జరిపించబోమంటూ వారి నుంచి లిఖితపూర్వకంగా హామీపత్రం రాయించుకున్న అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు హరిప్రియ, అనంతలక్ష్మి, ఎంపీటీసీ ముస్కు జలజ తదితరులు పాల్గొన్నారు.