హీరోయిన్ అయిన బాలతార
నేటి బాలలే రేపటి భావి పౌరులన్నది సత్యం. అలాగే ఒకప్పటి బాలతారలే నేటి నాయికలన్నది నిజం చేస్తున్నారు చాలామంది నటీమణులు. నటి శ్రీదేవి నుంచి మీనా, రాశి, రోహిణి ఇలా చాలామంది బాలతార నుంచి భావితరం నాయికలుగా ఎదిగిన వారే. ఈ కోవలోకి తాజాగా మరో ఉత్తరాది భామ చేరింది. ఈ అమ్మడి పేరు నవిక. ఈ పేరు చెబితే అంతగా గుర్తుకు రాకపోవచ్చు. ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలో శ్రీదేవి కూతురుగా నటించిన బాలతారనే ఈ నవిక. ఆ చిత్రంలో ఆంగ్లభాష తెలియని తల్లి శ్రీదేవిని చులకనగా చూసి ఆ తరువాత అమ్మ ఆంగ్లం నేర్చుకుని సరళంగా మాట్లాడినపుపడు సారీ చెప్పిన పాత్రలో నవిక బాగానే రిజిస్టర్ అయ్యింది. బొద్దుగా, ముద్దుగా వున్న ఆ బాలతార ఇప్పుడు నాయిక అయ్యింది.
మురుగాట్రుపడై అనే చిత్రంతో హీరోయిన్గా తెరపైకి రానుంది. నవ నటుడు శరవణన్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రా న్ని శిఖరం విజువల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. పలు చిత్రాలకు ప్రొడక్షన్ నిర్వహణ బాధ్యతల్ని నిర్వహించిన కె.మురుగానందం ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్రం గురించి ఈయన తెలుపుతూ ఇది యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ అని చెప్పా రు. ముఖ్యంగా కళాశాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన చిత్రం అని తెలిపారు.
నాన్న కోరికపై నటుడయ్యానంటున్న చిత్ర హీరో దర్శకుడి సూచనల మేరకు నటించానన్నారు. ఒక యూత్‌ఫుల్ చిత్రాల ద్వారా హీరోయిన్గా పరిచయం కావడం ఆనందంగా ఉందని నటి నవిక పేర్కొన్నారు. యువ సంగీత దర్శకుడు గణేశ్ రాఘవేంద్ర స్వరపరచిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. చిత్ర ఆడియోను తమిళ నిర్మాతల మండలి కార్యదర్శి టి.శివ ఆవిష్కరించగా సీనియర్ నటుడు విఎస్ రాఘవన్ తొలి ప్రతిని అందుకున్నారు.