కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు..
కరీంనగర్ క్రైం/కరీంనగర్ అర్బన్ :
కరీంనగర్ ఇన్‌కం ట్యాక్ డెప్యూటీ కమిషనర్ జయప్రకాశ్ లంచం కోసం తనను తీవ్రంగా వేధించారని సన్నిహిత చిట్‌ఫండ్ ఎండీ భూమాగౌడ్ తెలిపారు. రూ.50 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడని, కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని, ఆయన వేధింపులు భరించలేకనే సీబీఐ అధికారులను ఆశ్రయించానని చెప్పారు. భూమాగౌడ్ నుంచి రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ ఇన్‌కం ట్యాక్స్ డెప్యూటీ కమిషనర్, ఇన్స్పెక్టర్లు రాము, భూపతి సోమవారం రాత్రి సీబీఐ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే.
రాత్రి 7 గంటల నుంచి మంగళవారం ఉదయం 7 గంటల దాకా సీబీఐ అధికారులు ఇన్‌కం ట్యాక్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకోవడంతో పాటు జయప్రకాశ్, రాము, భూపతిలను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు తరలించారు. అనంతరం భూమాగౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఏవిధంగా ఇబ్బందులు పెట్టారో వివరించారు.
‘కొద్ది రోజుల క్రితం నేను కరీంనగర్లో ఓ భవనం కొన్నాను. ఈ విషయం తెలుసుకున్న జయప్రకాశ్ ఈ నెల 16న మా సన్నిహిత చిట్‌ఫండ్‌కు వచ్చి రికార్డులు తనిఖీ చేశారు.
ఆ రోజు నేను పనిమీద హైదరాబాద్‌లో ఉన్నాను. ఆయన నాకు ఫోన్ చేసి ఇన్‌కం ట్యాక్స్‌కు సంబంధించిన రికార్డులు సరిగా లేవన్నారు. రేపు వచ్చి తన ఆఫీసులో కలవమన్నారు. మరసటి రోజు ఆయనను కలిస్తే.. రికార్డులు సరిగా లేవని, రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పది రోజుల క్రితమే నేను రూ.8.60 లక్షలు ఇన్‌కం ట్యాక్స్ కట్టాను. ఆ రికార్డులను తీసుకొచ్చి చూపించినా ఒప్పుకోలేదు.
నన్ను భయభ్రాంతులకు గురిచేసి లంచం కోసం ఒత్తిడి చేశాడు. అంత డబ్బు ఇచ్చుకోలేనని కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. చివరకు రూ.25 లక్షలు ఇమ్మన్నాడు. ఆయన వేధింపులు భరించలేక ఈ నెల 17న సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశాను. వారి సూచన మేరకు ముందుగా రాము, భూపతిలకు రూ.2లక్షలు ఇచ్చాను. ఆ డబ్బును వారిద్దరు పంచుకున్నారు. రాత్రి 7 గంటలకు జయప్రకాశ్‌కు ఫోన్ చేసి మిగతా రూ.23 లక్షలు తెచ్చానని చెప్పాను.
ఆయకర్ భవన్ సమీపంలో పార్కింగ్ చేసి ఉన్న తన కారులో డబ్బు పెట్టమన్నారు. కొద్దిసేపటికి ఆయన కారువద్దకు వచ్చి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జయప్రకాశ్ గతంలో కూడా పలుమార్లు డబ్బుల కోసం వేధింపులకు గురిచేశాడు. మా దగ్గర పనిచేస్తున్న ఆడిటర్ శివకుమార్ ఇన్‌కం ట్యాక్స్ అధికారులతో మధ్యవర్తిగా వ్యవహరించాడు’ అని భూమాగౌడ్ వాపోయాడు.