పట్టణ పక్షులకు దూకుడెక్కువ!
వాషింగ్టన్: నివసించే ప్రాంతాన్ని బట్టి మనస్తత్వాల్లో, భావాల్లో మార్పులు ఉంటాయని అందరికి తెలిసిన విషయమే. పట్టణాల్లో ఉండే వారు ఒకలా, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు మరోలా ఉండడం మనం గమనిస్తునే ఉంటాం. ఇది కేవలం మనుషులకు మాత్రమే పరిమితం కాదు.. పక్షులకూ వర్తిస్తుందంటున్నారు పరిశోధకులు. పట్టణాల్లో ఉండే పక్షులు గ్రామాల్లో ఉండే వాటికంటే కోపంగానూ, దూకుడు స్వభావంతో ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది.
జనసాంద్రత పక్షుల స్వభావాలపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. పట్టణాల్లో ఉండే పక్షులకు ఎక్కువ వనరులు ఉన్నప్పటికీ అవి నివసించేందుకు స్థలం తక్కువ ఉండడమే వాటి దూకుడు స్వభావానికి కారణమని వర్జినీయా యూనివర్సిటీకి చెందిన స్కాట్ డేవిస్ అనే పరిశోధకుడు తెలిపారు. పిచ్చుకల స్వరాల్లో తేడాలపై పరిశోధనలు చేసిన అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే పిచ్చుకల స్వరంలో స్పష్టమైన తేడాలను వారు గమనించారు.