CM Conway
-
కాన్వాయ్.. బాబోయ్..
జిల్లాకు తరచూ ప్రముఖులు వస్తుంటారు. కలియుగ దైవం వెంకటేశుడు ఇక్కడ వెలియడంతో అన్ని ప్రాంతాల నుంచి వీఐపీల నుంచి తాకిడి ఎక్కువ. దీనికి తోడు ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ పర్యటిస్తుంటారు. ఆయనిచ్చే హామీల మాటెలా ఉన్నా అద్దె వాహన శ్రేణి (కాన్వాయ్)కయ్యే ఖర్చు తడిసి మోపెడవుతోంది. వాహనాలు సమకూర్చాలంటే ట్రావెల్ ఏజెన్సీ వారు హడలిపోతున్నారు. సీఎం పర్యటనంటే ముచ్చెమటలు పడుతున్నాయి. నాలుగేళ్లుగా రూ.1.21 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. చిత్తూరు అర్బన్: రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే చిత్తూరు ప్రత్యేకం. ప్రపంచంలోని కోట్లాది మంది ఆరా ధ్య దైవం శ్రీనివాసుని ఆలయమిక్కడే ఉంది. దీంతో మన దేశంతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే ప్రముఖుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వీఐపీలు వచ్చినప్పుడు వారికి కనీస మర్యాదగా కాన్వాయ్ ఏర్పాటు చేయడం తప్పనిసరి. వీరితో పాటు మన సీఎం, ఆయన మంత్రివర్గం, టీడీపీ ప్రముఖులు, సీఎం కుటుంబ సభ్యులు.. ఇలా చాలా మందికి నాలుగేళ్లకుపైగాకాన్వాయ్ సమకూర్చి అద్దె వాహన నిర్వాహకులు అప్పులపాలైపోయారు. చంద్రబాబు టాప్.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో 2014లో 12 మార్లు జిల్లాకు వచ్చారు. కాన్వాయ్‌కు రూ.3.75 లక్షలు బకాయిలు మిగిలిపోయాయి. 2015లో 14 సార్లు రావడంతో రూ.13.32 లక్షలు చెల్లించాల్సి ఉంది. 2016లో 13 సార్లు రావడంతో 18.78 లక్షలు బకాయి ఉంది. గతేడాది తొమ్మిది సార్లు పర్యటించారు. ఇందుకోసం రూ.16లక్షలు ఇంకా చెల్లించలేదని వాహన శ్రేణి ఏజెన్సీలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ 18 సార్లు రావడంతో రూ.10 లక్షల బకాయి పేరుకుపోయింది. సీఎం సతీమణి హోదాలో నారా భువనేశ్వరి, మంత్రి పదవి రాకమునుపే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో లోకేష్‌కు, మంత్రి పదవి వచ్చాక ఐటీ మంత్రిగా.. అధికారిక కార్యక్రమాలతో పాటు పండుగలు, పబ్బాలు, టీడీపీ నేతల కుటుంబ సభ్యుల వివాహాలు, కొందరు నేతలు చనిపోయినప్పుడు ఇలా పలుమార్లు సీఎం కుటుంబ సభ్యులు జిల్లాకు వచ్చినప్పుడల్లా కాన్వాయ్‌లకు బకాయి పడ్డారు. ఎందరో మహానుభావులు... ఏ రాష్ట్రానికారాష్టం వీఐపీ కాన్వాయ్ బకాయిలు చెల్లించాల్సిందే. సీఎంతో పాటు సింగపూర్ మంత్రులు, రాష్ట్ర గవర్నర్, ప్రధాన మంత్రి, శ్రీలంక అధ్యక్షులు, శ్రీలంక ప్రధాన మంత్రి, తమిళనాడు, మేఘాలయ గవర్నర్లు, రాష్ట్ర డెప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి, రవాణశాఖ మంత్రి, పశు సంవర్థక శాఖమంత్రి, కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, బీజేపీ నేతలు జిల్లాకు వచ్చినప్పుడు కాన్వాయ్‌లు ఏర్పాటు చేస్తే చిల్లిగవ్వ విడుదల కాలేదు. పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల కోసం అధికారులు దబాయించి మరీ కాన్వాయ్ పెట్టించుకుంటున్నారు. వేధింపులు.. వీఐపీల పర్యటనకు కాన్వాయ్ సమకూర్చే బాధ్య త జిల్లా రవాణాశాఖ చూస్తోంది. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగే అధికారులు తిరుపతి, చిత్తూరు, మదనపల్లె ప్రాంతాల నుంచి అద్దె వాహనాలను సమకూరుస్తారు. అందరి వద్ద తమ జుట్టు చిక్కుకోకుండా తిరుపతిలోని ఓ ట్రావెల్ ఏజెన్సీని ముందుకు నెట్టి ప్రతిసారి అధికారులు తప్పించుకుంటున్నారు. ప్రముఖుల పర్యటన పూర్తయిన తరువాత నెల రోజుల్లో వాహనాలకు అద్దె చెల్లిస్తామని చెప్పడం.. ఆపై చేతులు దులుపుకోవడం అలవాటైపోయింది. పెట్టలేమని ఏజెన్సీవారు చెబితే పోలీసులతో చెప్పి కేసులు పెట్టిస్తామని అధికారులు బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. ఇది చాలదన్నట్లు కాన్వాయ్‌కు వెళ్లే డ్రైవర్ల ఇళ్ల వద్దకు పోలీసులు విచారణ పేరిట అర్ధరాత్రులు వెళ్లడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పగటిపూట రాకుండా అర్ధ రాత్రులు మందీ మార్బలంతో వస్తే చుట్టుపక్కల పరువుపోతోందని డ్రైవర్లు వాపోతున్నారు. -
సీఎం కాన్వాయ్కి డాక్టర్లు కావలెను!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాన్వాయ్‌కు కేటాయించిన అంబులెన్సుల్లో పనిచేసేందుకు డాక్టర్లు ఎవరూ ముందుకు రావడంలేదు. అధికార వర్గాల్లో ఇప్పుడు ఇది తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తాజాగా సీఎంకు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతిలలో నాలుగు అత్యాధునిక అంబులెన్సులను కేటాయించారు. సీఎం ఏ జిల్లాలో పర్యటించినా సమీపంలోని అంబులెన్స్ కాన్వాయ్‌లో ఉంటుంది. వీటిల్లో జనరల్ మెడిసిన్, అనస్థీషియా, ఆర్థోపెడిక్ డాక్టర్లతోపాటు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు ఉంటారు. కాగా, నెలకు రూ.60 వేల వేతనంతో ఇటీవల డాక్టర్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఆ తర్వాత ఈ మొత్తాన్ని రూ.75 వేలకు పెంచి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చినా ఇద్దరే ముందుకొచ్చారు. సీఎం పర్యటన ఉన్నప్పుడే వైద్యులు పనిచేయాల్సి ఉన్నప్పటికీ ఎవరూ ముందుకురాకపోవడం వెనుక కారణం ఏమై ఉంటుందని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆస్పత్రుల్లో నియామకాలకు నోటిఫికేషన్ ఇస్తే వేలల్లో దరఖాస్తులొస్తాయని.. కానీ, సీఎం కాన్వాయ్ అంబులెన్స్‌కు ఎందుకు రావడంలేదో అర్థంకావడం లేదని ఓ అధికారి చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు కూడా వీటిల్లో పనిచేసేందుకు సుముఖంగా లేరు. తాము ఆ డ్యూటీకి వెళ్లలేమని చెబుతున్నారు. దీంతో కొత్త అంబులెన్సులకు డాక్టర్లు లేకపోవడంతో వాటిని ప్రారంభించలేదు. -
తెలంగాణ సచివాలయం ముస్తాబు
- సర్వాంగ సుందరంగా అలంకరించిన అధికారులు - కొత్త సీఎంకు మింట్ కాంపౌండ్ నుంచి రహదారి - సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించి పరిశీలన - నల్ల పోచమ్మ గుడి వద్ద పూజలు చేయనున్న కేసీఆర్ - గుడి నుంచి ‘సీ’ బ్లాక్ వరకు రెడ్ కార్పెట్ స్వాగతం - సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించనున్న టీఆర్ఎస్ అధినేత సాక్షి, హైదరాబాద్: చరిత్రాత్మక ఘట్టానికి తెరలేచింది. తెలంగాణ సచివాలయం ఏర్పాటైంది. సోమవారం నుంచి దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవిస్తున్న తెలంగాణకు పరిపాలనా కేంద్రమైన సచివాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కేసీఆర్ సచివాలయానికి రానున్నారు. ఈ సందర్భంగా సచివాలయం లోపల, ప్రహరీగోడలను విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉమ్మడి రాష్ట్ర సచివాలయానికి లుంబిని పార్క్ ఎదురుగా ఉన్న గేటును ప్రధాన మార్గంగా వినియోగించేవారు. ప్రస్తుతం తెలంగాణ, సీమాంధ్ర ఇరు రాష్ట్రాల కోసం వేర్వేరు సచివాలయాలుగా విభజించడంతో.. తెలంగాణ సచివాలయానికి కొత్త రహదారిని ఏర్పాటు చేశారు. మింట్ కాంపౌండ్ వైపు నుంచి సచివాలయంలోకి ప్రవేశించడానికి వీలుగా అక్కడున్న పాఠశాలను తొలగించి కొత్త రహదారి నిర్మించారు. ఈ రహదారిపై ఆదివారం సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్‌ను కూడా నిర్వహించారు. ఇక సచివాలయం గేటు నుంచి ముఖ్యమంత్రి కార్యక్రమాలు నిర్వహించే ‘సీ’ బ్లాక్ వరకు అడుగడుగునా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. కాన్వాయ్‌లో తెలంగాణ సచివాలయ గేటు నుంచి లోపలికి ప్రవేశించే కేసీఆర్ నేరుగా వెళ్లి నల్లపోచమ్మ గుడి వద్ద దిగుతారు. అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి.. అక్కడి నుంచి ‘సీ’ బ్లాక్ వరకు ఏర్పాటు చేసే రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ వస్తారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ మార్గంలో కేసీఆర్ నడిచి వస్తుండగా.. పూలతో సచివాలయ సిబ్బంది స్వాగతం పలుకనున్నారు. c బ్లాకు ఆరో అంతస్తులోని కార్యాలయంలో కేసీఆర్ మధ్యాహ్నం 12.57 గంటలకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందుకోసం ‘సీ’ బ్లాక్ ముందు ప్రత్యేకంగా పందిళ్లను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు అక్కడ కూర్చోవడానికి గ్రీన్ కార్పెట్‌ను కూడా సిద్ధం చేశారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ.. ఉద్యోగులు పనిచేయడానికి రావడంతో సందడి నెలకొంది. ఐఏఎస్ అధికారుల హడావుడి.. మరైవెపు సచివాలయంలో ఐఏఎస్ అధికారుల హడావుడి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహంతి పదవీ విరమణతో వివిధ శాఖల ఉన్నతాధికారులు ఆయనను కలవడానికి వచ్చారు. తెలంగాణ జిల్లాల కలెక్టర్లు కూడా మహంతిని కలిశారు. కాగా.. తెలంగాణ సచివాలయం గేటు ఏర్పాటు కోసం తొలగించిన పాఠశాల కోసం..‘బీ’ బ్లాక్ వెనుకభాగంలో ఉన్న భవనాన్ని ఆ విద్యార్జన పాఠశాల కోసం సీఎస్ ఉన్నతాధికారులతో కలసి పరి శీలించారు. అధికారులు రేమండ్ పీటర్, బూసి శాంబాబ్, వెంకటేశ్వరరావు, శశిభూషణ్ కుమార్, పూనం మాల కొండయ్య తదితరులు ఈ పాఠశాల భవనాన్ని పరిశీలించారు. ఈ పాఠశాలకు బయటి వైపు నుంచి గేటు ఏర్పాటు చేసే అంశాన్ని కూడా అధికారులు పరిశీలించారు.