తెలంగాణ సచివాలయం ముస్తాబు
- సర్వాంగ సుందరంగా అలంకరించిన అధికారులు
- కొత్త సీఎంకు మింట్ కాంపౌండ్ నుంచి రహదారి
- సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించి పరిశీలన
- నల్ల పోచమ్మ గుడి వద్ద పూజలు చేయనున్న కేసీఆర్
- గుడి నుంచి ‘సీ’ బ్లాక్ వరకు రెడ్ కార్పెట్ స్వాగతం
- సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించనున్న టీఆర్‌ఎస్ అధినేత
సాక్షి, హైదరాబాద్: చరిత్రాత్మక ఘట్టానికి తెరలేచింది. తెలంగాణ సచివాలయం ఏర్పాటైంది. సోమవారం నుంచి దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవిస్తున్న తెలంగాణకు పరిపాలనా కేంద్రమైన సచివాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కేసీఆర్ సచివాలయానికి రానున్నారు. ఈ సందర్భంగా సచివాలయం లోపల, ప్రహరీగోడలను విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉమ్మడి రాష్ట్ర సచివాలయానికి లుంబిని పార్క్ ఎదురుగా ఉన్న గేటును ప్రధాన మార్గంగా వినియోగించేవారు. ప్రస్తుతం తెలంగాణ, సీమాంధ్ర ఇరు రాష్ట్రాల కోసం వేర్వేరు సచివాలయాలుగా విభజించడంతో.. తెలంగాణ సచివాలయానికి కొత్త రహదారిని ఏర్పాటు చేశారు.
మింట్ కాంపౌండ్ వైపు నుంచి సచివాలయంలోకి ప్రవేశించడానికి వీలుగా అక్కడున్న పాఠశాలను తొలగించి కొత్త రహదారి నిర్మించారు. ఈ రహదారిపై ఆదివారం సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్‌ను కూడా నిర్వహించారు. ఇక సచివాలయం గేటు నుంచి ముఖ్యమంత్రి కార్యక్రమాలు నిర్వహించే ‘సీ’ బ్లాక్ వరకు అడుగడుగునా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. కాన్వాయ్‌లో తెలంగాణ సచివాలయ గేటు నుంచి లోపలికి ప్రవేశించే కేసీఆర్ నేరుగా వెళ్లి నల్లపోచమ్మ గుడి వద్ద దిగుతారు. అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి.. అక్కడి నుంచి ‘సీ’ బ్లాక్ వరకు ఏర్పాటు చేసే రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ వస్తారని అధికారవర్గాలు తెలిపాయి.
ఈ మార్గంలో కేసీఆర్ నడిచి వస్తుండగా.. పూలతో సచివాలయ సిబ్బంది స్వాగతం పలుకనున్నారు. c బ్లాకు ఆరో అంతస్తులోని కార్యాలయంలో కేసీఆర్ మధ్యాహ్నం 12.57 గంటలకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందుకోసం ‘సీ’ బ్లాక్ ముందు ప్రత్యేకంగా పందిళ్లను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు అక్కడ కూర్చోవడానికి గ్రీన్ కార్పెట్‌ను కూడా సిద్ధం చేశారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ.. ఉద్యోగులు పనిచేయడానికి రావడంతో సందడి నెలకొంది.
ఐఏఎస్ అధికారుల హడావుడి..
మరైవెపు సచివాలయంలో ఐఏఎస్ అధికారుల హడావుడి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహంతి పదవీ విరమణతో వివిధ శాఖల ఉన్నతాధికారులు ఆయనను కలవడానికి వచ్చారు. తెలంగాణ జిల్లాల కలెక్టర్లు కూడా మహంతిని కలిశారు. కాగా.. తెలంగాణ సచివాలయం గేటు ఏర్పాటు కోసం తొలగించిన పాఠశాల కోసం..‘బీ’ బ్లాక్ వెనుకభాగంలో ఉన్న భవనాన్ని ఆ విద్యార్జన పాఠశాల కోసం సీఎస్ ఉన్నతాధికారులతో కలసి పరి శీలించారు. అధికారులు రేమండ్ పీటర్, బూసి శాంబాబ్, వెంకటేశ్వరరావు, శశిభూషణ్ కుమార్, పూనం మాల కొండయ్య తదితరులు ఈ పాఠశాల భవనాన్ని పరిశీలించారు. ఈ పాఠశాలకు బయటి వైపు నుంచి గేటు ఏర్పాటు చేసే అంశాన్ని కూడా అధికారులు పరిశీలించారు.