competions
-
వీరే ‘ఆటా’ నవలల పోటీ విజేతలు
తెలుగు భాషా, సాహిత్యంపైన మక్కువతో అమెరికా తెలుగు సంఘం (ఆటా) నిర్వహించిన నవలల పోటీకి ప్రపంచం నలుమూలల నుండి దాదాపుగా 70 వరకూ నవలలు వచ్చాయి. అనేక పరిశీలనలూ, వడ పోతల తర్వాత ఈ దిగువ నవలలకు బహుమతి మొత్తాన్ని సమానంగా పంచాలని న్యాయనిర్ణేతలు నిర్ణయించారు. బహుమతి పొందిన నవలలు పగులు (తాడికొండ శివకుమార శర్మ, వర్జీనియా), కొంతమంది... కొన్నిచోట్ల... (వివిన మూర్తి, బెంగళూరు)గా ఉన్నాయి. విజేతలకు చెరి లక్ష రూపాయలు బహుమతిగా అందివ్వనున్నారు. ఈ రెండు నవలలను ‘ఆటా’ త్వరలో ప్రచురిస్తుంది. ఈ పోటీలో పాల్గొన్న ప్రతీ రచయితకీ, రచయిత్రికీ మా ఆటా కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ పోటీ నిర్వహణలో మాకు ఎంతో సహకరించి, న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన రమణమూర్తి, స్వాతికుమారి, అనిల్ రాయల్, పద్మవల్లి గార్లకు ప్రత్యేక ధన్యవాదాలని ఆటా పేర్కొంది. -
జ్యోతిబా పూలే జయంతి: రచనలపై పోటీ, బహుమతులు
మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ విద్యాసంస్థల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వ్యాస, కవిత, పద్య, చిత్రకళల్లో పోటీలు తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తామని బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. విద్యార్థుల్లో సాహిత్య సృజన పెంచేందుకు, జ్యోతి బా పూలే జీవిత ప్రభావం నేటి సమాజం పై ఎలా ఉంది అన్న విషయం తెలుసుకునేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన జ్యోతిబా పూలే గురించి ఆయన చేసిన సేవల గురించి ప్రతి ఒకరికీ తెలియజేస్తూ గడప గడపకి సాహిత్యాన్ని చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ పోటీలు తెలంగాణ సాహిత్య అకాడమీతో కలిసి నిర్వహిస్తున్నామని బుర్రా వెంకటేశం వివరించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని అన్ని విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు, తెలుగు ఉపాధ్యాయులు ఈ పోటీల్లో పాల్గొన్నవచ్చని వెంకటేశం చెప్పారు. ఆర్సీఓలు, ప్రిన్సిపాల్స్, తెలుగు ఉపాధ్యాయులు విద్యార్థులకు ఈ విషయాలు చెప్పి వారిలో రచనాశక్తిని పెంపొందించాలని ఆయన సూచించారు. ‘జ్యోతి బా పూలే జీవితం-నేటి సమాజం పై ప్రభావం’ అనే అంశంపై రెండుపేజీలకు మించకుండా వ్యాసం, పదికి మించకుండా పద్యాలు లేదా కవిత పంపాలన్నారు. అలాగే చిత్రం వేయాలనుకున్నవారు ఏ4 సైజు పేపరు పై చిత్రం గీసి పంపించాలని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన ఉత్తమ రచనలకు ఏప్రిల్ 11న హైదరాబాద్ లో నిర్వహించే జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల్లో బహుమతి ప్రదానం ఉంటుందని అన్నారు. గురుకుల విద్యార్థులతో పాటు హాస్టల్ విద్యార్థులు, టీచర్లు, వార్డన్లు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నవచ్చని ఆయన చెప్పారు. అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఈ పోటీల్లో వచ్చిన వాటిల్లో అత్యుత్తమైనవి ఎంపిక చేసి పుస్తకంగా తీసుకురానున్నట్టు బుర్రా వెంకటేశం వెల్లడించారు. -
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఉగాది ఉత్తమ రచనల పోటీ
ఉగాది సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 27వ ఉగాది ఉత్తమ రచనల పోటీలో విజేతల పేర్లను నిర్వాహకులు ప్రకటించారు. . ఈ సారి పోటీకి అమెరికా, కెనడా, న్యూజీలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్, దక్షిణ ఆఫ్రికా, అబు ధాభి. హాంగ్ కాంగ్, సింగపూర్, ఐర్లాండ్, భారత దేశాల నుంచి ఎంట్రీలు వచ్చాయి. విజేతలకు నిర్వాహాకులు అభినందలు తెలిపారు. విజేతల వివరాలు ఇలా ఉన్నాయి ఉత్తమ కథానిక విభాగం విజేతలు 1) “మరో కురుక్షేత్రం”- పాణిని జన్నాభట్ల (బోస్ట్‌న్, ఎంఏ, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 2) ‘‘ధారావాహిక హత్యలు” –నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్ (టాంపా, ఫ్లోరిడా, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “భూలోక స్వర్గం” – డా. కె. గీత (మోర్గాన్హిల్, కాలిఫోర్నియా, ప్రశంసా పత్రం) 4) “ఆట – పోరు”- తాడికొండ కె. శివకుమార శర్మ, (గ్రేటర్ వాషింగ్టన్, డీసీ, ప్రశంసా పత్రం) ఉత్తమ కవిత విభాగం విజేతలు 1) “ఈ రాత్రికి సౌత్ ఆఫ్రికా” -గౌతమ్ లింగా (జోహెన్నస్‌బర్గ్, దక్షిణాఫ్రికా) ($116 నగదు పారితోషికం) 2) “ఏమంటేనేం?”- స్వాతి శ్రీపాద (డెట్రాయిట్, మిచిగాన్, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “ఒంటరి సాయంత్రాలు”- రవి మంత్రిప్రగడ (డబ్లిన్, ఐర్లాండ్ ప్రశంసా పత్రం) 4) “పువ్వు” - సతీష్ గొల్లపూడి (ఆక్లాండ్, న్యూజీలాండ్, ప్రశంసా పత్రం) “నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు 1) “క్రైమ్ నెవెర్ పేస్” – వీకేవీ ప్రసాద్ (హైదరాబాద్, ఇండియా, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 2) “రెండు నిమిషాలు- అమృత వర్షిణి (లోన్ట్రీ, యూఎస్ఏ) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “ఆడ పిల్ల”- షేక్ షబ్బర్ హుస్సేన్ (కడప, ఏపీ) ప్రశంసా పత్రం "నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు 1) “భూమిని హత్తుకునే క్షణాలకోసం”- అసిఫా గోపాల్ (నెల్లూరు, ఏపీ, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 2) “తను వెళ్ళిపోయింది”- రాజు గడ్డం (కడవిపల్లి గ్రామం, ఇండియా) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “శిల-కల”- ఆవుల కార్తీక (హైదరాబాద్) ప్రశంసా పత్రం -
విజయఢంకా మోగించిన నంది బ్రీడింగ్ బుల్స్
దొడ్లేరు(క్రోసూరు): మండలంలోని దొడ్లేరు గ్రామంలో నాలుగురోజులుగా నిర్వహిస్తున్న ఎడ్లపోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామ రైతు రామకోటయ్యకు చెందిన కావ్యనంది బ్రీడింగ్ బుల్స్ 5760 అడుగుల దూరం బండలాగి విజయఢంకా మోగించి ప్రథమ బహమతి గెలుచుకున్నాయి. అందుకుగాను రూ.25 వేల నగదును తెలుగుదేశంపార్టీ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి నలజాల సదాశివరావు, మండలపార్టీ అధ్యక్షుడు కూరపాటిసైదా అందచేశారు. అదేవిధంగా శావల్యాపురం మండలం గంటావారిపాలెం గ్రామానికి చెందిన మారిసెట్టి మాధవి ఎడ్లు 5250 దూరం బండలాగి ద్వితీయబహుమతి రూ.20 వేలు గెలుచుకున్నాయి. కొండవీటి శ్రీనిసరావు, నలజాల కోటేశ్వరరావు, అనుముల వెంకట్రామిరెడ్డి ఈ బహుమతి అందచేశారు. ప్రత్తిపాడు గ్రామం కాకాని వెంకట్రామయ్య మొమోరియల్స్, కాకానిశ్రీహరిరావు ఎడ్లు 4500 అడుగుల దూరం బండలాగి మూడవ బహుమతి రూ.15వేలు గెలుచుకున్నాయి. బండారు మైసూరుబాబు, కాండ్రుసాంబయ్య ఈ బహుమతి అందచేశారు. నారాకోడూరు గ్రామానికి చెందిన వెలగా అనూరాధ, దుర్గి గ్రామానికి చెందిన కె.వి.నాయుడు కంబైన్స్ ఎడ్లు 4359 అడుగుల దూరం బండలాగి నాల్గవ బహుమతి రూ.10వేలు గెలుచుకున్నాయి. దొడ్లేరు పెట్రోల్‌బంకు నిర్వహకులు అమీనాహేస్సేన్ ఈ బహుమతి అందచేశారు. కొత్తపాలెం మండలం ఆకురాజుపల్లె గ్రామానికి చెందిన యామిని మోహన్శ్రీ, కళ్లంవారిపాలెం గ్రామానికి బద్దిగం సుబ్బారెడ్డి కంబైన్స్ ఎడ్లు 3610 దూరం బండలాగి ఐదోబహుమతి ఆరువేల రూపాయలు గెలుచుకున్నాయి. షేక్ ఖాశిమిల్లి జ్ఞాపకార్థం మనవడు గుత్తికొండ ఖాజామొహిద్దీన్ ఈ బహుమతి అందచేశారు. -
రాష్ట్ర సైకిల్ పోటీల్లో ప్రథమం ‘అల్లం’
చెరుకుపల్లి : రాష్ట్ర స్థాయి సైకిల్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండల పరిధిలోని రాంబోట్లవారిపాలెం గ్రామంలో శ్రీబండ్లమ్మ తల్లి యూత్ పగడం వారి పాలెం వారి ఆధ్వర్యంలో ఈ సైకిల్ వేగం పోటీలు నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి సైకిల్ వేగం పోటీల్లో 30 మంది పాల్గొన్నారు. మొదటి బహుమతి అల్లం సుబ్బారెడ్డి (దుండిపాలెం) రూ.20,116 , రెండో బహుమతి గంజరబోయిన కుమారస్వామిరెడ్డి (దుండిపాలెం) రూ.15,116, మూడో బహుమతి వారె నాగరాజు రెడ్డి (పొన్నపల్లి) రూ.10,116, నాలుగో బహుమతి గణేష్ యూత్ (పొన్నపల్లి) రూ.6,116, ఐదో బహుమతి కుక్కల మణికంఠరెడ్డి (దుండిపాలెం) రూ.5,116, ఆరో బహుమతి నక్కా సూరిబాబు (పిట్లవానిపాలెం) రూ.3,116 అందుకున్నారు. జెడ్పీటీసీ సభ్యులు పిట్టు శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు చీరాల ప్రసాదరెడ్డి, కిరణ్‌కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంఆర్‌కె మూర్తి, కుమారస్వామి పాల్గొన్నారు. -
ఆగిన కూత
ఉత్కంఠభరితంగా సాగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు పురుషుల విభాగంలో తూర్పు, మహిళల విభాగంలో విశాఖ విజేతలు పదోసారి విజేతగా తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట : సామర్లకోటలో జరిగిన ఎన్టీఆర్ మెమోరియల్ 64వ రాష్ట్ర కబడ్డీ పోటీల్లో ఆదివారం ఫైన ల్స్ హోరాహోరీగా సాగాయి. పురుషుల విభాగంలో తూర్పు–ప్రకాశం జట్ల మధ్య పోరు ఉత్కంఠగా సాగింది. చివరి నిమిషం వరకు సాగిన పోరులో తూర్పు గోదావరి రెండు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. మహిళల విభాగంలో విశాఖ జట్టు విజయనగరంపై 18 పాయింట్ల తేడాతో గెలుపొందింది. ద్వితీయ స్థానంలో విజయనగరం, తృతీయ స్థానంలో తూర్పు, కృష్ణా జట్లు నిలిచాయి. పురుషుల విభాగంలో పదోసారి విజేతగా నిలిచిన తూర్పు ప్రథమ స్థానం కైవసం చేసుకోగా, ప్రకాశం ద్వితీయ, విశాఖ, విజయనగరం తృతీయ స్థానాలు సాధించాయి. 13 జిల్లాల నుంచి పురుష, మహిళల జట్లు ఇందులో పాల్గొన్నాయి. నాలుగు రోజులుగా ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఈ పోటీలు సామర్లకోట పల్లం బీడ్‌లో జరిగాయి. సెమిస్లో తలపడిన జట్లు అంతకుముందు పురుషుల విభాగంలో సెమీ ఫైనల్లో విశాఖను ఓడించి తూర్పు, విజయనగరంను ఓడించి ప్రకాశం ఫైనల్‌కు చేరాయి. మహిళల విభాగంలో సెమీఫైనల్లో తూర్పు జట్టును ఓడించి విజయనగరం, కృష్టాను ఓడించి విశాఖ జట్లు పైనల్‌కు చేరాయి. ఆదివారం రాత్రి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపీ తోట నరసింహం క్రీడాకారులను పరిచయం చేసుకుని, పోటీలను తిలకించారు. విజేతలకు చినరాజప్ప, నరసింహంతో పాటు దాత యర్లగడ్డ వీర్రాజు, మున్సిపల్ చైర్పర్సన్ మన్యం పద్మావతి బహుమతులు అందజేశారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో బహుమతులు పొందిన క్రీడాకారులను ఈ సందర్భంగా సన్మానించారు. పోటీలన ఏర్పాటు చేసిన బోగిళ్ల మురళీకుమార్‌ను డిప్యూటీ సీఎం, ఎంపీ అభినందించారు. ఆంధ్ర కబడ్డీ సంఘ కార్యదర్శి వి.వీరలంకయ్య, కోశాధికారి ఎం.రంగారావు, జిల్లా అధ్యక్షుడు, పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి బోగిళ్ల ముర ళీకుమార్, జాతీయ కోచ్ పోతుల సాయి, జిల్లా సహాయ కార్యదర్శి తళ్లూరి వైకుంఠం, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
జిల్లా స్థాయి పోటీలు ప్రారంభం
గుంటూరు స్పోర్ట్స్: హాకీ మంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి, జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కారించుకుని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం బాలబాలికలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్, స్కేటింగ్, టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. డీఎస్డీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ 27వ తేదీన హాకీ, జిమ్నాస్టిక్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు సోమవారం జరిగే కార్యక్రమంలో బహుమతులు ఇవ్వనున్నట్లు వివరించారు. -
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: విజయనగరంలో ఈనెల 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగనున్న రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు భాష్యం హైస్కూల్ 10వ తరగతి విద్యార్థి బోడేపూడి మహేష్ చంద్ర ఎంపికైనట్లు భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ తెలిపారు. చంద్రమౌళీనగర్‌లోని భాష్యం ప్రధాన క్యాంపస్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 15న రేపల్లెలోని ఏవీఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలో క్యాడెట్ కేటగిరిలో మహేష్ చంద్ర బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నట్లు వివరించారు. ఈసందర్భంగా మహేష్ చంద్రను, కోచ్ ఎస్కే రషీద్, జోనల్ ఇన్చార్జ్ తలశిల శివ, మెయిన్ క్యాంపస్ ప్రిన్సిపాల్ కిషోర్ అభినందించారు. -
29 నుంచి తెలుగు హాస్య నాటికల పోటీలు
విజయవాడ కల్చరల్ : సుమధుర కళానికేతన్, ముమ్మనేని సుబ్బారావు కళాపీఠం సంయుక్త నిర్వహణలో ఈ నెల 29వ తేదీ నుంచి 21వ తెలుగు హాస్య నాటికల పోటీలు నిర్వహించనున్నట్లు సుమధుర కళానికేతన్ పరిషత్ చైర్మన్ డాక్టర్ ఎన్.మురళీకృష్ణ తెలిపారు. బుధవారం హోటల్ కృష్ణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల పాటు జరిగే నాటికల పోటీలను మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. సుమధుర కళానికేతన్ 43వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తునట్లు పేర్కొన్నారు. మొదటి రోజు ‘తేలు కుట్టిన దొంగలు’ నాటికతో పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. మొత్తం ఎనిమిది నాటికలు ప్రదర్శిస్తారని వివరించారు. 29న నటుడు విద్యాసాగర్‌కు కబీర్దాస్ పురస్కారం, 30న రంగస్థల నటి ఎం.రత్నకుమారికి రాధాకుమారి పురస్కారం, 31న 2016కు గానూ సినీ, రంగస్థల నటుడు జయప్రకాష్‌రెడ్డిని జంధ్యాల స్మారక పురస్కారంతో సత్కరించనున్నట్లు తెలిపారు. సుమధర కళానికేతన్ అధ్యక్షుడు సామంతపూడి నరసరాజు మాట్లాడుతూ ఆదివారం ఉదయం విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. సమావేశంలో విద్యావేత్త ఎంసీ దాస్, సిద్ధార్థ కళాపీఠం కార్యదర్శి చివుకుల సుందరరామశర్మ తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా కర్రసాము పోటీలు
బాపట్ల : కర్రసాము రంగు టచ్‌పోటీలు ఎంతో హోరాహోరీగా గురువారం రాత్రితో ముగిశాయి. గొల్ల ఆదినారాయణ మెమోరియల్ ఆధ్వర్యంలో బుధ, గురువారం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 30 మంది పాల్గొన్నారు. వీరిలో వేల్పుల వెంకటేశ్వర్లు మొదటిబహుమతి, ద్వితీయ తన్నీరు శేషవెంకటశివప్రసాద్, తతీయ శవనం సాంబిరెడ్డి సొంతం చేసుకున్నారు. వీరనారాయణ, నక్కా వెంకట్రావు సొంతం చేసుకున్నారు. కమిటీ సభ్యులుగా చిల్లర వెంకటేశ్వర్లు నాయుడు, షేక్ అల్లాభక్షి, మేడిబోయిన విష్ణునారాయణరెడ్డి, ఆర్.వెంకటప్పయ్యనాయుడు, గొల్ల సుబ్రహ్మణ్యం, చెరుకూరి జయపాల్, సూర్యనారాయణరెడ్డి, వేల్పుల శ్రీనివాస్, మన్నెం చిన్న, శవనం రాంబాబురెడ్డి, టి.యోబు వ్యవహరించారు. మొదటి బహుమతిగా రూ.10,116 విలువచేసే వెండి తోడా, రెండో బహుమతిగా రూ.5116 విలువ చేసే వెండి తోడా, మూడో బహుమతిగా రూ.3116 విలువ చేసే వెండి తోడాను అందజేశారు. బహుమతులను వేగేశన ఫౌండేషన్ చైర్మన్ నరేంద్రవర్మ చేతుల మీదుగా అందించారు. -
తపాలాశాఖ స్టాంపు డిజైన్ పోటీలు
తెనాలి : తపాలశాఖ అక్టోబరు 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా జాతీయ స్థాయిలో స్టాంపు డిజైను పోటీలను నిర్వహిస్తున్నట్టు తెనాలి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.హరికృష్ణప్రసాద్ సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియజేశారు. ‘స్వచ్ఛభారత్’ అనే అంశంపై నిర్వహించే ఈ పోటీల్లో ఎవరైనా పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి కలిగినవారు తమ ఎంట్రీలను ‘అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (ఫిలా టెలి), రూమ్ నం.108 (బి), ఢాక్ భవన్, పార్లమెంట్ స్ట్రీట్, న్యూఢిల్లీ –110001 చిరునామాకు, స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ నెల 22వ తేదీకి చేరేలా పంపాలని కోరారు.