ప్రేమ పేరుతో మోసం..
పెద్దపల్లిరూరల్: మరదలు వరసయ్యే యువతితో నాలుగైదేళ్లుగా ప్రేమాయణం సాగించి తీరా పెళ్లి సమయానికి మోసం చేసిన ప్రియుడి ఉదంతం వెలుగుచూసింది. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన గండు నరేశ్ ఇదే గ్రామానికి చెందిన దుబ్బాసి దివ్యను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి చెట్టా పట్టాలేసుకొని తిరిగాడు.
బీటెక్ పూర్తి చేసిన దివ్య హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండగా, నరేశ్ కూడా హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. పెళ్లి చేసుకోవాలని దివ్య కోరడంతో నరేశ్ ముఖం చాటేశాడు. చావే శరణ్యమంటూ ప్రియుడి ఇంటికి వెళ్లిన యువతిని గెంటివేయడంతో ఇటీవల రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. అయినా నరేశ్ వివాహం చేసుకునేందుకు ససేమిరా నిరాకరించడంతో దివ్య, ఆమె తల్లిదండ్రులు ఈ విషయం బసంత్‌నగర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
పోలీసులు నరేశ్ గురించి ఆరా తీస్తున్నట్టు గ్రహించిన కుటుంబీకులు ఓ నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధి కుమారుడిని ఆశ్రయించారు. దీంతో ఆయన సూచనమేరకు బసంత్‌నగర్ ఎస్సై విజయేందర్ జాప్యం చేయడంతో గ్రామానికి చెందిన నాయకులు గంట రమేశ్, కలవేన రవీందర్‌తోపాటు ఇతర పెద్దలు ఎస్సైతో వాగ్వాదానికి దిగి దివ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.